Vizag Steel Plant | విశాఖ ఉక్కులో వీఆర్ఎస్ ఆలోచనకు విరామం ఇస్తారా?

కేంద్రం తాజా ప్యాకేజీతో ఉద్యోగులు పునరాలోచనలో పడ్డారా? ఈనెల 15 నుంచి 31 వరకు వీఆర్ఎస్కు అవకాశమిచ్చిన యాజమాన్యం. తొలి మూడు రోజులు 450 మంది వరకు దరఖాస్తు.;

Update: 2025-01-19 01:30 GMT
జీతాల కోసం ప్లాంట్లో ఆందోళన చేస్తున్న ఉక్కు ఉద్యోగులు (ఫైల్ ఫోటో)

విశాఖపట్నం స్టీల్స్టాంట్కు కేంద్ర ప్రభుత్వం పునరుజ్జీవ ప్యాకేజీ ప్రకటన ప్రభావం స్వచ్ఛంద పదవీ విరమణ స్కీం (వీఆర్ఎస్)పై పడనుందా? 2026 డిసెంబర్ ఆఖరు నాటికి ఈ కర్మాగారంలో పనిచేస్తున్న శాశ్వత ఉద్యోగులు, కార్మికుల సంఖ్యను 12,300 నుంచి 8 వేలకు తగ్గించుకోవాలని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం భావిస్తోంది. ఇందులో భాగంగా 15 ఏళ్ల సర్వీసును పూర్తి చేసిన వారు, 45 ఏళ్ల వయసు పైబడిన వారికి వీఆర్ఎస్కు అవకాశం కల్పిస్తూ ఇటీవల ప్లాంట్ యాజమన్యం సర్క్యులర్ జారీ చేసింది. దాని ప్రకారం వీరు ఈనెల 15 నుంచి 31 వరకు తమ దరఖాస్తులను యాజమాన్యానికి సమర్పించుకోవలసి ఉంటుంది. అనంతరం వీరి దరఖాస్తులను కమిటీ పరిశీలించి ఆమోదించడమో, తిరస్కరించడమో చేస్తుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తామని నాలుగేళ్ల క్రితం కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించినప్పట్నుంచి ఉక్కు ఉద్యోగులు, కార్మికుల్లో అలజడి రేగుతూనే ఉంది. అప్పట్నుంచి ఈ ప్లాంట్లో ఒక్కొక్కటిగా జరుగుతున్న పరిణామాలన్నీ వీరిని కుదురు లేకుండా చేస్తున్నాయి. ప్లాంట్ అప్పులతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం, ముడి సరకు కొరత, ఉత్పత్తి

తగ్గిపోవడం, అందుకనుగుణంగా ఉద్యోగుల సంఖ్య తగ్గుముఖం పట్టడం, కొత్త రిక్రూట్మెంట్లు నిలిపివేయడం వంటివి చోటు చేసుకున్నాయి. ఫలితంగా ఉద్యోగులపై పని భారంతో పాటు ఒత్తిడి కూడా అధికమవుతోంది. మరోవైపు ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితికి ప్లాంట్ చేరుకుంది. అంతకు ముందే దసరా బోనసు కూడా ఎగవేసింది. సెప్టెంబర్ నుంచి అరకొర జీతాలను మాత్రమే చెల్లిస్తూ వస్తోంది. చివరకు డిసెంబర్ నెల జీతం పూర్తిగా ఇవ్వలేక చేతులెత్తేసింది. ఇలా రోజురోజుకూ ప్లాంట్ పరిస్థితి దిగజారుతూ వస్తుండడంతో వీరిలో ఆందోళన తీవ్రమవుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉక్కు కర్మాగారం యాజమాన్యం ఇటీవల వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవచ్చంటూ జారీ చేసిన సర్క్యులర్క కార్మికులు, ఉద్యోగులు ఆకర్షితులయ్యారు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు మూడు రోజుల్లోనే 450 మంది వరకు వీఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అంటే రోజుకు సగటున 150 మంది చొప్పున దరఖాస్తు చేసినట్టు స్పష్టమవుతోంది. వీరిలో నాన్ ఎగ్జిక్యూటివ్ (కార్మికులు) లతో పాటు ఎగ్జిక్యూటివ్లు (అధికారులు) కూడా ఉన్నారు. తాజా సర్క్యులర్ ద్వారా 2500 మంది వరకు వీఆర్ఎస్కు ముందుకొస్తారని ప్లాంట్ యాజమాన్యం అంచనా వేసినట్టు చెబుతున్నారు.

ప్యాకేజీ పునరాలోచనలో పడేసిందా?

ఈ నేపథ్యంలో అనూహ్యంగా శుక్రవారం కేంద్ర ప్రభుత్వం ఈ స్టీల్ ప్లాంట్కు రూ.11,440 కోట్ల రివైవల్ ప్యాకేజీని ప్రకటించింది. అంతేకాదు.. ఈ నిధులతో ప్లాంట్ మనుగడకు చర్యలు తీసుకుంటున్నామని, ముడి సరకును సమకూర్చే మార్గాలు అన్వేషిస్తున్నామని పేర్కొంది. కొన్నాళ్ల పాటు జీతాలు చెల్లింపులకు డోకా ఉండదన్న నమ్మకంతో పాటు ప్రైవేటీకరణ తాత్కాలికంగా ఆగవచ్చన్న ఆలోచనతో కొందరు ఉక్కు ఉద్యోగులు, కార్మికులు పునరాలోచనలో పడినట్టు సమాచారం. ఇలాంటి వారు వీఆర్ఎస్పై కొన్నాళ్ల పాటు వేచి చూసే ధోరణిని అవలంబించనున్నట్టు తెలుస్తోంది.

ఎగ్జిక్యూటివ్ ల్లో వీఆర్ఎస్కు మొగ్గు?

విశాఖ స్టీల్స్టాంట్లో వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకుంటున్న వారిలో 45 శాతం మంది ఎగ్జిక్యూటివ్ ఉంటున్నారు. వీరిలో ఎక్కువ పని భారం పెరిగి ఒత్తిడికి గురవుతున్న వారు, పిల్లలు వివిధ ఉద్యోగాల్లో స్థిరపడిన వారు, అనారోగ్యం బారిన పడుతున్న వారు ప్లాంట్లో కొనసాగడంకంటే వీఆర్ఎస్ తీసుకోవడమే బెటర్ అనే నిర్ణయానికొచ్చినట్టు చెబుతున్నారు. కాగా వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న వారందరివీ యాజమాన్యం ఆమోదించే అవకాశం లేదు. గత కొన్నేళ్లుగా మంచి పనితీరు కనబరుస్తూ ట్రాక్ రికార్డు ఉన్న వారిని వీఆర్ఎస్ ను తిరస్కరించే వీలు కూడా ఉంటుంది. అనారోగ్యంతో ఉన్న వారిని, ప్లాంట్లో పనితీరు బాగు లేని వారి వీఆర్ఎస్లను వెనువెంటనే ఆమోదం తెలుపుతుంది. నెలాఖరు వరకు వీఆర్ఎస్ దరఖాస్తులను ఆహ్వానించాక దీనిపై నియమించే కమిటీ వాటిని పరిశీలిస్తుంది. అనంతరం మార్చి నుంచి వీరికి వీఆర్ఎస్ను అమలు చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

Tags:    

Similar News