జమిలీ లక్ష్యమా.. పరామర్శ కోసమా.. జగన్ మళ్లీ జనంలోకి వెళ్లనున్నారా..?

రెండు అంశాల అజెండాను వైసీపీ ఎంపిక చేసుకుంది. జనవరిలో జగన్ ఏమి కార్యాచరణ ఎలా ఉండబోతోంది..?

Update: 2024-11-08 09:47 GMT

పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపడం. సోషల్ మీడియా కార్యకర్తలను కాపాడుకోవడం. ప్రధాన అంశాలుగా మాజీ సీఎం వైఎస్. జగన్ మళ్లీ గజనంలోకి వెళ్లాలని భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. జనవరిలో సంక్రాంతి పండుగ తరువాత ఈ కార్యక్రమం ప్రారంభించడానికి సమాలోచనలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాసమస్యల పరిష్కార వేదిక, శాసనాలు తయారు చేసే అసెంబ్లీకి వెళ్లకూడదని తాజాగా వైసీపీ నిర్ణయించుకున్నది. ఈ విషయాన్ని వైఎస్. జగన్ స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే.

"అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరిగే సమయంలో ఏకధాటిగా మీడియా సమావేశాలు నిర్వహిస్తాం" అని వైఎస్. జగన్ చెప్పడం గమనార్హం.
వైసీపీ అధికారంలో ఉండగా, రౌడీషీట్లు ఉన్న వ్యక్తులు టీడీపీ, జనసేన పార్టీల నేతలు, వారి కుటుంబసభ్యులపై సోషల్ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్టులతో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. వీటిపై రాష్ట్రంలోని అనేక మంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టారు. అయితే, చాలా చోట్ల అధికార వైసీపీ నేతల ఒత్తళ్ల నేపథ్యంలో పోలీసులు కూడా కఠినంగా వ్యవహరించలేపోయారనేది సర్వత్రా ఆరోపణలు. దీనిపై టీడీపీ, వైసీపీ నేతలు, ప్రధానంగా మహిళా నాయకులు కూడా నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఫిర్యాదు చేయడానికి వెళ్లిన సమయంలో డీజీపీ కార్యాలయంలోకి కూడా అనుమతించలేదు. దీంతో ఆమె తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆమే రాష్ట్ర హోంమంత్రి అయ్యారు. దీనికి తోడు సీఎం చంద్రబాబు, ఆయన భార్య నారా భువనేశ్వరి, కొడుకు నారా లోకేష్ పై సోషల్ మీడియాలో అసభ్యంగా పెట్టిన పోస్టులు కూడా కలకలం రేపాయి.
రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో పాత కేసులను తిరగదోడే కార్యక్రమం చేపట్టినట్టు కనిపిస్తోంది. దీంతో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన సోషల్ మీడయా కార్యకర్తలను అరెస్టు చేయడానికి పోలీసులు సమాయత్తం అయ్యారు. ఆ కోవలో కడపలో వర్రా రవీంద్రారెడ్డి ఎపిసోడ్ నాటకీయ పద్ధతిలో సాగింది.
కడప జిల్లా రాయచోటిలో సోషల్ మీడియా కార్యకర్త హనుమంతరెడ్డిని సివిల్ డ్రస్సులో వచ్చిన పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్కడికి తీసుకుని వెళ్లింది కూడా అతని కుటుంబీకులకు చెప్పలేదు. దీంతో విషయం తెలుసుకున్న వైసీపీ మాజీ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి "స్టేషన్ వద్ద ఆందోళనలకు దిగుతాం" అని హెచ్చరించారు. అదే రోజు రాత్రి హనుమంతరెడ్డిని వదిలేశారు. మరుసటి రోజు వారి ఇంటికి వెళ్లిన గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి సోషల్ మీడియా వర్కర్ హనుమంతరెడ్డిని పరామర్శించారు.

గుంటూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్పై వినుకొండ మండలం పానకాలపాలెం గ్రామానికి చెందిన నన్నపనేని వెంకట్రావు ఎన్నికల సమయంలో పోస్టులు పెట్టారంటూ, జనసేన జిల్లా కార్యదర్శి నిశ్వంబర శ్రీనివాసరావు గత శుక్రవారం ఫిర్యాదు నేపథ్యంలో వెంకట్రావును పోలీసులు నిర్భంధించారు. ఇలా..
"ఒకే రోజు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో 40 మంది వైసీపీ సోషల్ మీడియా వారియర్లను అరెస్టు చేయడం సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు విరుద్ధం" అని వైఎస్. జగన్ తప్పుబట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీ అసెంబ్లీకి వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.
కార్యకర్తలకు ధైర్యం కోసం...
టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మంత్రి లోకేష్ రెడ్ బుక్ (Red Book) రాజ్యాగం అమలు చేస్తోందని వైఎస్. జగన్ ఆరోపిస్తున్నారు. ఆ మేరకు సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా ఖాతరు చేయడం లేదని ఆయన మండిపడుతున్నారు. సోషల్ మీడియా వారియర్లకు అండగా నిలివాలని వైసీపీ చీఫ్ వైఎస్. జగన్ భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. వారితో పాటు పాత కేసులు తిరగదోడి, అరెస్టులు చేయడానికి పోలీసులు దూకుడు పెంచారు. దీంతో వైసీపీ కలవరానికి గురవుతోంది. వారిని కాపాడుకోవడానికి లీగల్ సెల్ ను పటిష్టం చేశామని ఆయన ప్రకటించారు.
జనంలోకి వెళ్లాలనే...

రాష్ట్రంలో శ్రేణులకు అండగా నిలవాలని పార్టీ నేతలకు వైఎస్. జగన్ సూచించారని తెలుస్తోంది. అంతేకుండా తానే స్వయంగా రంగంలోకి దిగడానికి పార్టీ నేతలతో సమాలోచనలు సాగిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా, పార్టీ కార్యకర్తలకు అండగా "నేను ఉన్నాను" అని జగన్ భరోసా ఇవ్వడానికి జనంలోకి వెళ్లడానికి సంసిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా వర్కర్లలో కూడా ధైర్యం నింపాలనే లక్ష్యంగా బస్సు యాత్ర చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ప్రతి జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటన సాగించనున్నట్లు తెలుస్తోంది. ఆ మూడు రోజులు కూడా కేసులు ఎదుర్కొంటున్న సోషల్ మీడియా వారియర్లను పరామర్శంచడం, పార్టీ క్యాడర్ లో జోష్ నింపే లక్ష్యంగా పర్యటన సాగించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
దేశంలో జమిలీ ఎన్నికలు జరిగే అవకాశం కూడా ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో 2025 జనవరిలో సంక్రాంతి తరువాత భరోసాయాత్ర సాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ క్యాడర్ కు భరోసా ఇవ్వడం, బాధితులను ఓదార్చడంతో పాటు ఒకవేళ ముందస్తు ఎన్నికలు కనుక వస్తే, పార్టీని కూడా సంసిద్ధం చేయాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల కిందట వైఎస్. జగన్ కూడా చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనార్హం. "ఎన్నికల ఎప్పుడ జరిగినా వైసీపీ అధికారంలోకి రావడం ఖాయం" అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. "జమిలీ ఎన్నికలు జరిగితే రెండేళ్లకే... లేదంటే మళ్లీ ఐదేళ్ల తరువాత ఎన్నికలు జరిగినా వచ్చేది మేమే" అని జగన్ ధీమా వ్యక్తం చేయడమే కాదు. పార్టీ శ్రేణులను కూడా మళ్లీ మితిమీరిన ఉత్సహానికి లోను చేసే విధంగా మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల తరువాత వైఎస్. జగన్ పార్టీ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉందని ఓ నేత తెలిపారు.
Tags:    

Similar News