లోకేష్ పర్యటనకు ఫలితం ఉంటుందా?
రాష్ట్ర మంత్రి లోకేష్ వారం రోజుల పాటు అమెరికా పర్యటన చేశారు. ఫలితాలు ఏ మేరకు ఉంటాయనే చర్చ ఆంధ్రప్రదేశ్‌లో మొదలైంది.
అమెరికాలో వారం రోజుల పాటు రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ చేసిన పర్యటన సత్ఫలితాలను ఇస్తుందా? లేదా? అనే చర్చ ఏపీలో జోరుగా సాగుతోంది. మేధావి వర్గంలో ఈ చర్చ ప్రధానంగా సాగటం విశేషం. ఏపీ బ్రాండ్ వైఎస్సార్‌సీపీ హయాంలో దెబ్బతిన్నదని, అందుకే తాను అమెరికా పర్యటనకు వెళ్లాల్సి వచ్చిందని లోకేష్ అనటం విశేషం. విభజిత ఆంధ్రప్రదేశ్‌లో మొదటి సారి అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ అమరావతి పేరుతో ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలని భావించింది. అందుకు అనుగుణంగా కొన్ని పనులు కూడా మొదలు పెట్టింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమరావతి నగరం అవసరం లేదని, రాజధాని నిర్మాణం కోసం బలవంతంగా భూములు ఇచ్చిన వారికి తిరిగి భూములు ఇచ్చేస్తామని ప్రకటించారు. దీంతో అమరావతి నగరం అనే మాట మూలన పడింది. అమరావతి నిర్మించాల్సిందేనని భూములు ఇచ్చిన కొందరు రైతులు ఐదేళ్ల పాటు ఆందోళన కొనసాగించారు. అయినా అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. అందువల్ల బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నదని, అందుకే తాను అమెరికా పర్యటన చేయాల్సి వచ్చిందని లోకేష్ చెప్పారు.