ముత్యాల పాపతో అయ్యన్నకు కలిసొచ్చేది ఎంత?

మాజీ ఎమ్మెల్యే బోలెం ముత్యాలపాప టీడీపీలో చేరిక మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుకు కలిసి వస్తుందా...? ఆ నియోజకవర్గంలో గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి...?

Update: 2024-03-20 14:01 GMT
చంద్రబాబు


(తంగేటి నానాజీ,)

విశాఖపట్నం: ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ రాజకీయం రసవత్తరంగా మారింది. ఇక్కడి నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పోటీ చేస్తుండగా… వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ తిరిగి ఎన్నికల బరిలోకి దిగారు. ఇరువురి మధ్యనే ప్రధాన పోటీ జరగనుంది. ఇరువురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో ఆ సామాజిక వర్గం మద్దతు ఎవరు సాధిస్తారు అన్నది ఆసక్తిగా మారింది. అయ్యన్నపాత్రుడు సొంత తమ్ముడే ప్రతిపక్షంలో ఉండడం ఆయనకు మైనస్ అయితే... గతసారి అయ్యన్నపై గెలిపొందిన ఉమాశంకర్ ఈసారి కూడా ఓటర్లను ఆకట్టుకుని విజయం సాధిస్తారా అన్నది హాట్‌టాపిక్‌గా మారింది.

ముత్యాలపాప చేరిక కలిసొచ్చేనా...

2009లో వీరిద్దరూ ప్రత్యర్ధులు.. అయితే ఇప్పుడు చేతులు కలిపారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బోలెం ముత్యాలపాప పోటీ చేయగా... టీడీపీ నుంచి అయ్యన్నపాత్రుడు పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వైఎస్ఆర్ హవాతో ముత్యాల పాప చేతిలో అయ్యన్నపాత్రుడు పరాజయం పాలయ్యారు. 5000 ఓట్ల మెజారిటీతో ముత్యాలపాప విజయం సాధించారు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోవడంతో సైలెంట్‌గా ఉన్న ముత్యాల పాప తాజాగా అయ్యన్నపాత్రుడుకు మద్దతు ప్రకటించారు. అంతేకాదు టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఈమె పార్టీలో చేరడంతో అయ్యన్నకు కొండంత బలం చేకూరింది. ఆ నియోజకవర్గంలో బోలెం కుటుంబం అతిపెద్ద కుటుంబంగా పేరుగాంచింది. ఈ అంశం అయ్యన్నకు కలిసి వస్తుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.


మూడోసారి పోటీ...

మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్‌లు పోటీ పడడం ఇది మూడోసారి.. 2014 ఎన్నికల్లో అయ్యన్నపాత్రుడు గెలుపొందగా... 2019 ఎన్నికల్లో ఉమాశంకర్ గణేష్ 28 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. తిరిగి ఈ ఎన్నికల్లో వీరిద్దరే పోటీ పడుతున్నారు.

టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఆరు సార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు. టెక్నికల్ ఎడ్యుకేషన్, ఆర్ అండ్ బి, ఫారెస్ట్ మంత్రిగా మూడుసార్లు పని చేశారు. ఓసారి కాంగ్రెస్ చేతిలో, గత ఎన్నికల్లో వైసీపీ చేతిలో పరాజయం చెందారు. వైసీపీ అభ్యర్థి ఉమాశంకర్ గణేష్ తొలిత టీడీపీలోనే ఉండేవారు. జగన్ పార్టీ స్థాపించిన తర్వాత వైసీపీలో చేరారు. అంచెలంచెలుగా ఎదిగి అయ్యన్నకే పోటీగా నిలిచారు.

సామాజిక సమీకరణాలు...

నర్సీపట్నం నియోజకవర్గంలో అత్యధిక ఓటర్లు వెలమ సామాజిక వర్గానికి చెందిన వారే.. అందుకే ఈ సీటు ఎప్పుడూ అదే సామాజిక వర్గానికి అన్ని పార్టీలు కేటాయిస్తూ ఉంటాయి. ఈసారి కూడా ఇరువురు అదే సామాజిక వర్గానికి చెందిన వారు. దీంతో సామాజిక వర్గం ఓట్లు చీలుతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ద్వితీయ తృతీయ స్థాయిలో ఉన్న కాపు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మద్దతు ఎవరికి లభిస్తే వారు విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి. అందుకే తమ సామాజిక వర్గంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఓట్ల వేటలో ఇరు పార్టీల అభ్యర్థులు నిమగ్నమై ఉన్నారు. విజయం ఎవరిని వరిస్తుందో తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.



Tags:    

Similar News