ఆ ముద్ర నుంచి పయ్యావుల బయట పడుతారా?
రాజకీయ వర్గాలు, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో సాగుతోన్న ఆసక్తికర చర్చ.;
జి విజయ కుమార్
సినిమాల్లో ఉన్నట్టే రాజకీయ పార్టీల్లో కొంత మంది ఐరన్ లెగ్‌లు ఉన్నారని ఎప్పటి నుంచో ఒక సరదా చర్చ ఉంది. ఆయా నియోజక వర్గాల్లో వారు గెలిస్తే ఆ ఎన్నికల్లో వారి పార్టీ ఓడి పోయి అధికారానికి దూరం కావడమే కాకుండా ప్రతిపక్షంలో ఉంటారని, వారు ఓడి పోతే వారి పార్టీలు గెలిచి అధికారంలోకి వస్తాయని ఎప్పటి నుంచో రాజకీయ వర్గాల్లో ఒక ఫన్నీ డిస్కషన్ ఉంది. కొంత మంది రాజకీయ నాయకులు కలిసినప్పుడు కూడా దీనిపై మాట్లాడుకుంటూ సరదాగా నవ్వుకోవడం చేస్తుంటారు. ఇలాంటి టాపిక్‌లు అసెంబ్లీలోను, అసెంబ్లీ లాబీల్లోను చోటు చేసుకుంటుంటాయి. వారిలో ప్రధానంగా ఇద్దరి నేతల పేర్లు వినిపిస్తుంటాయి. ప్రస్తుతం వైఎస్‌ఆర్‌సీపీలో మంత్రిగా ఉన్న ఆర్కే రోజా ఒకరు కాగా, మరొకరు తెలుగుదేశం పార్టీకి చెందిన ఉరవకుండ సిట్టింగ్ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. ఆర్కే రోజా 2014లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలవడంతో వైఎస్‌ఆర్‌సీపీ ఓడిపోయిందని, దీంతో వైఎస్ జగన్ అధికారానికి దూరం కావడంతో పాటు ప్రతిపక్షంలో కూర్చున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో కూడా అలాంటి కామెంట్లు అప్పట్లో వైరల్‌గా మారాయి. అయితే 2019 ఎన్నికల్లో ఆమె గెలవడం, వైఎస్‌ఆర్‌సీపీ కూడా అధిక స్థానాలు కైవసం చేసుకోవడం, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఆర్కే రోజా ఐరన్ లెగ్ అనే ముద్ర నుంచి బయట పడ్డారని అప్పట్లో చర్చ కూడా జరిగింది.