పేర్ని నానీ ని అరెస్ట్ చేస్తారా..?

మచిలీపట్నంలోని పేర్ని నాని గోడౌన్ లో నిల్వ ఉంచిన సివిల్ సప్లైస్ బియ్యం పక్కదారి పట్టిన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది.;

Update: 2025-01-02 06:42 GMT

సివిల్ సప్లైస్ బియ్యం గోడౌన్ నుంచి మాయమైనట్లు గుర్తించిన కృష్ణా జిల్లా సివిల్ సప్లైస్ మేనేజర్ వెంకటరెడ్డి పై ప్రభుత్వం ముందుగా వేటు వేసింది. ఆయన అసలు విషయం వెల్లడించారని అనుకున్నారో ఏమో కాని పోలీసులు మొదట అదుపులోకి తీసుకుంది కోటిరెడ్డి నే. బియ్యం గోడౌన్ లో షార్టేజీ వచ్చిందని పోలీసులకు రిపోర్టు ఇచ్చింది కూడా కోటిరెడ్డి కావటం విశేషం. ఆ తరువాత గోడౌన్ మేనేజర్ గా ఉన్న మానస తేజ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోడౌన్ యజమాని పేర్ని జయసుధ తో పాటు వీరిద్దరిపై మొదట కేసులు నమోదయ్యాయి. జయసుధ ముందస్తు బెయిల్ తీసుకోగా మేనేజర్లు ఇరువురినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

గోడౌన్ ఎందుకు కట్టించారు?

మచిలీపట్నంలో గోడౌన్ కట్టించింది కేవలం సివిల్ సప్లైస్ రైస్ నిల్వ ఉంచేందుకేనని పోలీసులు భావిస్తున్నారు. గత ప్రభుత్వం అధికారంలో ఉండగా రేషన్ బియ్యం నిల్వ ఉంచేందుకు గోడౌన్స్ సరిపోక ప్రభుత్వం నానా అవస్థలు పడుతోంది. ఈ నేపథ్యంలో అధికారుల సలహా మేరకు గోడౌన్ ను పేర్ని నాని నిర్మించారు. ఆ గోడౌన్ ను ఆయన పేరుతో కాకుండా భార్య జయసుధ పేరుతో ముందుగా స్థలం రిజిస్టర్ చేయించి ఆ తరువాత గోడౌన్ ను కూడా ఆమె పేరుతోనే రిజిష్టర్ చేయించారు. అధికారంలో ఉన్నారు కాబట్టి అధికారులు వెంటనే గోడౌన్ ను అద్దెకు తీసుకున్నారు. అంటే అద్దె తో రెండేళ్ల పాటు ఉంటే పెట్టుబడి వస్తుందని భావించి ఈ విధంగా చేసినట్లు సమాచారం.

బియ్యం ఎందుకు మాయమయ్యాయి?

గోడౌన్ నుంచి బియ్యం ఎలా మాయమయ్యాయనే విషయం ఇంతవరకు పోలీసులు కానీ, అధికారులు కానీ తేల్చలేదు. బియ్యం గోడౌన్ లో షార్టేజీ వచ్చాయని పేర్ని జయసుధ సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ కు లేఖ రాసిన తరువాతనే విషయం బయటకు వచ్చింది. ఆ తరువాతనే జాయింట్ కలెక్టర్ గీతాశర్మ ఆదేశాలతో సివిల్ సప్లైస్ జిల్లా మేనేజర్ కోటిరెడ్డి పోలీసు కేసు పెట్టారు. దీంతో విషయం బయటకు వచ్చింది. గోడౌన్ కు పేర్ని నానీ బంధువు అయిన మానస తేజ ఈ వ్యవహారం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం పేర్ని నానీ కి తెలియకుండా చేసే ధైర్యం ఉందా? అంటే అనుమానించాల్సిందే. ఏదైతేనేమి మానస తేజ వల్లే ఇంత జరిగిందనే చర్చ సాగుతోంది.

బెయిల్ పై ఉన్నా నోటీసు ఇచ్చి జయసుధను విచారించిన పోలీసులు

గోడౌన్ యజమాని జయసుధ ముందస్తు బెయిల్ పై ఉన్నారు. అయినా 41 నోటీస్ ఇచ్చి బుధవారం స్టేషన్ కు పిలిపించి పోలీసులు విచారించారు. సుమారు రెండు గంటలపాటు విచారణ కొనసాగింది. మేనేజర్ మానస తేజ వల్లనే ఇదంతా జరిగి ఉంటుందని ఆమె చెప్పినట్లు సమాచారం. వీరి ముగ్గురితో పాటు మరో ముగ్గురు బయటి వ్యక్తులకు కూడా సంబంధం ఉందనే అనుమానంతో కేసు నమోదు చేశారు. వారిలో ఒక లారీ డ్రైవర్ ను పోలీసులు పిలిచి ఇప్పటికే విచారించారు. మరో ఇద్దరు ఎవరనేది తెలియలేదు.

నాని పై కేసు నమోదు

పేర్ని నాని పై పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. ఈయన ఏడవ నిందితునిగా ఉన్నారు. సంఘటన జరిగి సుమారు 20 రోజులైంది. ఇన్ని రోజుల తరువాత నాని పై కేసు నమోదు చేయడం చర్చకు దారి తీసింది. కేసులో ముఖ్యమంత్రి తొందర పడకుండా వ్యవహరించారని పేర్ని నాని ఇటీవల మీడియా వారితో మాట్లాడుతూ అన్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ నాని చేసిన పాపం భార్యకు చుట్టుకుందన్నారు. గతంలో వైఎస్సార్సీపీ నాయకులు చంద్రబాబు కుటుంబాన్ని ఎంతగా నిందించారో నానికి తెలియదా అంటూ ప్రశ్నించారు.

ఉన్నట్లుండి నాని పై కూడా కేసు పెట్టడంతో ఆయనను అరెస్ట్ చేయాలనే ఆలోచనలో కూటమి నాయకులు ఉన్నారా? అనే చర్చ మొదలైంది. తనకు తానే షార్టేజీ వచ్చిన బియ్యానికి రూ. 1.68 కోట్లు నాని ఇప్పటికే చెల్లించారు. అయితే మొదట చెప్పిన దానికంటే షార్టేజీ వచ్చిన బియ్యం ఎక్కువగా ఉన్నాయని మరో రూ. 1.67 కోట్లు చెల్లించాలని జాయింట్ కలెక్టర్ గీత శర్మ నోటీసు ఇచ్చారు. కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ బియ్యం కాకినాడ పోర్టు నుంచి విదేశాలకు తరలినట్లు అధికారులు భావిస్తున్నారు.

Tags:    

Similar News