సుజనా చౌదరి ముస్లీంల మనసులు గెలుస్తారా?

విజయవాడ పశ్చిమలో అధిక సంఖ్యలో ముస్లిం మైనారిటీలు.. టీడీపీ, జనసేన పొత్తుల్లో బిజెపీకి సీటు కేటాయింపు.

Update: 2024-03-28 11:05 GMT
Sujana Chowdary

జి విజయ కుమార్ 

కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ముస్లిం మైనారిటీల మద్దతు లభిస్తుందా.. ముస్లిం మైనారిటీల మనసులు గెలుచుకుంటారా.. ఆయన గెలుపునకు సహకరిస్తారా అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో సాగుతోన్న చర్చ. కేంద్రంలో ఎన్డీఏ కూటమిపైన, మోదీ ప్రభుత్వంపైన, బిజెపితో పాటు ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్‌దళ్‌ వంటి హిందూ మత సంస్థలు ముస్లిం మైనారిటీలపై పెరిగిన దాడుల నేపథ్యంలో ముస్లిం మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్న చోట బిజెపీ అభ్యర్థిగా సుజనా చౌదరిని రంగంలోకి దింపడం దీనికి ప్రాథాన్యత సంతరించుకుంది.

బీజేపీపై వ్యతిరేకతను సుజన అనుకూలంగా ఎలా మలుచుకుంటారు..
బుధవారం బిజెపీ ప్రకటించిన అభ్యర్థుల్లో సుజనా చౌదరికి బిజెపీ అభ్యర్థిగా విజయవాడ పశ్చి నియోజక వర్గం ఖరారు చేశారు. ఈ నియోజక వర్గంలో ముస్లిం మైనారిటీలు అధిక సంఖ్యలో ఉన్నారు. ఎన్నికల కమిషన్‌ ప్రకటించిన గణాంకాల ప్రకారం విజయవాడ పశ్చిమ నియోజక వర్గంలో మొత్తం 2,48,908 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 133105 మంది పురుషులు, 140667 మంది మహిళలు, 50 మంది థర్డ్‌ జండర్‌ ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో దాదాపు 40వేల నుంచి 45వేల వరకు ముస్లిం మైనారిటీ వర్గాల ఓటర్లు ఇక్కడ ఉన్నారు. అభ్యర్థుల గెలుపు ఓటములపై ఈ వర్గం ఓటర్ల ప్రభావం చాలా ఉంటుంది. వీరి మద్దతు లేకుండా ఏ పార్టీ అభ్యర్థి అయినా ఇక్కడ గెలవడం అసాధ్యమని స్థానిక నేతలు చెబుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తుల్లో భాగంగా విజయవాడ సీటును బిజెపీకి కేటాయించారు. సుజనా చౌదరికి ఒక నాయకుడిగా ఇక్కడ పేరు ఉన్నప్పటికీ బిజెపీ అభ్యర్థిగా పోటీ చేస్తుండటం, ఆయన గెలుపు అవకాశాలపై నీలినీడలు ఉన్నాయనే వాదన తెరపైకి రావడం ఇక్కడ చర్చనియాంశం. పార్టీలకు అతీతంగా ముస్లిం మైనారిటీ వర్గాలు బిజెపీని వ్యతిరేకించే చాన్స్‌ ఉందని స్థానిక నేతలు చర్చించుకుంటున్నారు.
టీడీపీలో సీనియర్‌ మైనారిటీ నేతలు
విజయవాడ పశ్చిమ సీటు కోసం ముగ్గురు టీడీపీ నేతలు పోటీ పడ్డారు. వారిలో మాజీ ఎమ్మెల్యే జలీల్‌ ఖాన్‌తో పాటు నాగూల్‌ మీరా, ఎంఎస్‌ బేగ్‌ ఉన్నారు. వీరి ముగ్గురికీ ఈ అసెంబ్లీ సెగ్మెంట్‌లో మంచి పట్టుంది. ప్రత్యేకించి ముస్లిం మైనారిటీ వర్గాలో మంచి ఆదరణ ఉంది. జలీల్‌ ఖాన్‌ ఇది వరకు 1999, 2014లో రెండు సార్లు ఈ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత ఆయన టీడీపీలోకి వెళ్లారు. ఇదే స్థానం నుంచి 1989లో గెలుపొందిన ఎంఎస్‌ బేగ్‌ కుమారుడు ఎంఎస్‌ బేగ్‌. తండ్రి వారసడిగా రాజకీయాల్లోకి వచ్చారు. నాగూల్‌ మీరా టీడీపీలో సీనియర్‌ నేత. 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీలోకి దిగిన జలీల్‌ ఖాన్‌పై టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌గా పని చేశారు. టీడీపీకి కాదని బిజెపీకి సీటు కేటాయించిన నేపథ్యంలో వీరు సుజనా చౌదరికి ఎలా సహకరిస్తారనేది ప్రశ్నార్థకంగా మారిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.
ఆశించి భంగపడిన జనసేన
పొత్తుల్లో ఈ స్థానాన్ని జనసేనకు కేటాయిస్తారని, ఆ పార్టీ తరఫున పోతిన మహేష్‌ అభ్యర్థిగా ఖరారు చేస్తారని ఆ పార్టీ శ్రేణులు భావించాయి. అయితే అనూహ్య మార్పుల నేపథ్యంలో బిజెపీకి కేటాయించడంతో వారు అసంతృప్తిలో ఉన్నారు. టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కూడా ఈ స్థానం కోసం పోటీ పడి నిరాశకు గురయ్యారు. తనకు కేటాయించాలని బుద్దా వెంకన్న చంద్రబాబుకు రక్తాభిషేకం కూడా చేశారు. కానీ సుజనా చౌదరికి కేటాయించడంతో అసంతృప్తికి గురయ్యారు.
సుజనాకు సవాల్‌
ఇన్ని సమస్యలున్న విజయవాడ పశ్చి నియోజక వర్గంలో వీటిని ఎలా అధికమిస్తారనేది ఒక సవాల్‌గా మారింది. బిజెపీని వ్యతిరేకిస్తున్న ముస్లిం మైనారిటీ వర్గాలను, ఆ వర్గాలకు చెందిన నేతలను, గ్రూపులుగా విడిపోయిన టీడీపీ నేతలను, టికెట్‌ ఆశించి భంగపడిన జనసేన శ్రేణులను ఒక తాటిపైకి తెచ్చి తనకు సహకరించే విధంగా చేసేందుకు ఎలాంటి కార్యాచరణ అమలు చేస్తారనేది స్థానికుల్లో ఆసక్తికరంగా మారింది. మరో వైపు వైసీపీ ఈ స్థానాన్ని ముస్లిం నేత ఆసిఫ్‌కు కేటాయించడంతో అన్ని సమస్యలను దాటుకొని ముందుకు రావడం సుజనా చౌదరికి కత్తిమీద సాములా మారిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.


Tags:    

Similar News