సింపతి సీఎం పీఠంపై కూర్చోబెడుతుందా?

ప్రమాదాలు, హత్యా ప్రయత్నాలు రాజకీయాల్లో నాయకులకు, పార్టీలకు లబ్ధి చేకూరుస్తాయా? సింపతీ సీఎం పీఠంపై కూర్చోబెడుతుందా? ప్రస్తుతం రాష్ట్రంలో జరుతున్న చర్చ ఇదే.

Byline :  The Federal
Update: 2024-05-08 08:20 GMT

2019 ఎన్నికలకు ముందు జగన్‌పై జరిగిన కోడికత్తి సంఘటన ఆ ఎన్నికల్లో ప్రభావం చూపిందని, ఆ సానుభూతి వల్లే జగన్‌ అధికారంలోకి వచ్చారనే వాదన రాజకీయ వర్గాల్లో ఉంది. ఈ ఘటనపై కేసులు, అది జగన్‌ కావాలనే చేయించుకున్నారా లేక ఆల్‌ ఆఫ్‌ సడన్‌గా చోటు చేసుకుందా, దీనిలో నిజమెంతా, అబద్దమెంతా అనే విషయాలు పక్కన బెడితే 2019 ఎన్నికల్లో ఇది జగన్‌కు ఉపయోగపడిందని, దీని వల్ల ప్రజల్లో జగన్‌కు సానుభూతి పెరిగిందని, అధికారంలోకి రావడానికి ఉపయోగపడిందేన చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. ఇదే మాదిరిగా ఇటీవల విజయవాడలో జగన్‌పై రాయి దాడి కూడా జరిగిందని, ఇది కూడా ఈ సారి ఎన్నికల్లో జగన్‌కు మేలు చేస్తుందనే ఆసక్తికర చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. చంద్రబాబు అరెస్టు కూడా తెలుగుదేశం పార్టీకి సానుభూతి ఓట్లను తెచ్చిపెడుతుందని ఆ పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే చరిత్ర ఏమి చెబుతోందో ఒక సారి చూద్దాం.

2014లో పని చేయని వైఎస్‌ఆర్‌పై ఉన్న సానుభూతి
దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి 2009 సెప్టెంబరు చోటు చేసుకున్న హెలిక్యాప్టర్‌ ప్రమాదంలో దుర్మణం పాలయ్యారు. అదే ఏడాది కాంగ్రెస్‌లో వైఎస్‌ఆర్‌ వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆ పార్టీని వీడి వైఎస్‌ఆర్‌సీపీని స్థాపించడం, ఆ పార్టీ అభ్యర్థిగా ఉప ఎన్నికల్లో పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. అదే ఉప ఎన్నికల్లో సొంత మరిది వైఎస్‌ వివేకానందరెడ్డిపై వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీకి దిగిన వైఎస్‌ విజయమ్మ కూడా ఘన విజయం సాధించారు. వైఎస్‌ఆర్‌పై ఉన్న సానుభూతి ప్రభావం ఆ ఎన్నికల్లో చాలానే చూపింది. దీంతో వైఎస్‌ జగన్‌ కడప ఎంపీగా రికార్డు స్థాయి మెజారిటీతోను, విజయమ్మ కూడా పెద్ద మెజారిటీతోనే గెలుపొందారు. ఆ తర్వాత వచ్చిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ సానుభూతి ఎస్‌ఆర్‌సీపీపై చూపించ లేక పోయింది. వైఎస్‌ జగ¯Œ పార్టీ ఈ ఎన్నికల్లో ఓటమి చెందడమే దీనికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీ అధిక స్థానాలు గెలవడంతో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు. 102 సీట్లు టీడీపీ గెలుచుకోగా, పొత్తులో ఉన్న బీజేపీ 4 స్థానాలు గెలుచుకుంది. వైఎస్‌ఆర్‌సీపీకి 67 సీట్లు మాత్రమే వచ్చాయి. ఈ ఎన్నికల్లో సాక్షాత్తు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సతీమణి వైఎస్‌ విజయమ్మ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలుకావడం గమనార్హం. వైఎస్‌ఆర్‌ అకాల మరణం తర్వాత జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో ఆయన కొడుకు జగన్‌ పార్టీ ఓటమి పాలైంది. ఒక వేళ ప్రజల్లో వైఎస్‌ఆర్‌పై సానుభూతి ఉన్నా గెలిపించే స్థాయిలో చూపించ లేదని నాడు పెద్ద చర్చ కూడా జరిగింది.
చంద్రబాబుపైన పని చేయని సానుభూతి
ఇంచు మించు ఇలాంటి సంఘటనే 2004 ఎన్నికల్లో చంద్రబాబుకు జరిగింది. ఎన్నికలకు దాదాపు ఆరు మాసాలకు ముందు నాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో బాంబు దుర్ఘటన చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో చంద్రబాబు ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. దేశ వ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. ఇది ఆయన పట్ల సానుభూతిగా మారుతుందని భావించారు. అప్పటికి ఇంకా ఆరుగు నెలలు గడువు ఉండగానే ఎన్నికలకు వెళ్లారు చంద్రబాబు. అయితే 2004 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ కూటమికి 226 సీట్లు, తెలుగుదేశం పార్టీ కూటమికి కేవలం 49 సీట్లు మాత్రమే వచ్చాయి. తనపైన జరిగిన హత్యాయత్నం సానుభూతిగా మారి అధికారంలోకి తెస్తుందని భావించిన చంద్రబాబుకు నిరాశే మిగిలింది.
Tags:    

Similar News