గుంటూరు గడ్డపై టీడీపీ హ్యాట్రిక్ సాధిస్తుందా?
గుంటూరు పార్లమెంట్‌లో ఏ పార్టీ ఎత్తుగడేంటి.. దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న టీడీపీ తిరిగి పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకుంటుందా?;
By : The Federal
Update: 2024-04-10 07:32 GMT
జి విజయ కుమార్
గుంటూరు పార్లమెంట్ స్థానంలో తెలుగుదేశం పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుందా అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలో రెండు సార్లు ఇక్కడ నుంచి టీడీపీ గెలుపొందడం, 2019 ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజక వర్గాల్లో అధిక శాతం సీట్లు వైఎస్‌ఆర్‌సీపీ ఆధిక్యత కనబరిచింది. ఐదు స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ గెలువగా.. కేవలం రెండు స్థానాల్లో మాత్రమే టీడీపీ కైవసం చేసుకుంది. అయినా గుంటూరు పార్లమెంట్ స్థానం మాత్రం తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకొని టీడీపీ జెండాను ఎగుర వేసింది. ఈ సారి కూడా తెలుగుదేశం పార్టీ ఇదే ఒరవడిని కొసాగించి ముచ్చటగా మూడో సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని రంగంలోకి దిగగా.. దానికి ఎలాగైనా చెక్ పెట్టి ఇటు వైఎస్‌ఆర్‌సీపీ జెండా పాతాలనే దిశగా ఇరు పార్టీలు సోషల్ ఇంజనీరింగ్‌లు చేపట్టాయి.
కమ్మ వర్సెస్ కాపు
గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకోవాలనే లక్ష్యంతో అభ్యర్థుల ఎంపికలో కూడా అనేక జాగ్రత్తలు ఇరు పార్టీలు తీసుకున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కమ్మ సామాజిక వర్గం వైపే మొగ్గు చూపారు. గుంటూరు పార్లమెట్ ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గం నేతలు ప్రభావితం చేశారు. ఈ సారి కూడా ఇదే కొనసాగింపు అవుతుదంనే అంచనాతో ఈ సారి కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలని నిర్ణయించారు. ఆ వ్యూహంలో భాగంగానే పెమ్మసాని చంద్రశేఖర్‌ను టీడీపీ అభ్యర్థిగా రంగంలోకి దింపారు. సీఎం వైఎస్ జగన్ అందుకు భిన్నంగా సోషల్ ఇంజనీరింగ్ చేపట్టారు. కమ్మ సామాజిక వర్గానికి కాకుండా.. గుంటూరు పార్లమెంట్ రాజకీయాల్లో కమ్మ సామాజిక వర్గ ప్రాబల్యానికి చెక్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా కాపు సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలోకి దింపాలని వ్యూహం పన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారు రోశయ్యను రంగంలోకి దింపారు. అంతేకాకుండా ఏడు అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల కేటాయింపుల్లో కూడా సోషల్ ఇంజనీరింగ్ సూత్రాన్ని పాటించారు. రెండో చోట్ల బీసీ వర్గానికి చెందిన అభ్యర్థులను, ఒక చోట ముస్లిం, ఒక చోట కమ్మ, మరొక చోట కాపు వర్గాలకు చెందిన నేతలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా రంగంలోకి దింపారు.
పెమ్మసాని ఒక ఎన్‌ఆర్‌ఐ
గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక ఎన్‌ఆర్‌ఐ. అమెరికాలో వైద్యుడుగా స్థిరపడ్డారు. ఉమ్మడి గుంటూరు జిల్లా బుర్రిపాలెం సొంతూరు. తర్వాత వీరి కుటుంబం నరసరావుపేటకెళ్లి అక్కడ స్థిరపడింది. అక్కడ నుంచి ఆయన అమెరికా వెళ్లారు. 2014లో ఇక్కడకు తిరిగొచ్చారు. అదే ఏడు జరిగిన ఎన్నికల్లో పోటీ చేయాలని భావించారు. నరసరావుపేట నుంచి పోటీ చేయాలని భావించారు. చంద్రబాబు వద్దకు వెళ్లి టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ రాయపాటికి ఆ టికెట్ ఖరారు చేశారు. టికెట్ దక్కక పోవడంతో ఆయన తిరిగి అమెరికా వెళ్లి పోయారు.అయినా పెమ్మసాని పట్టు వీడ లేదు. 2024లో ఆయన గుంటూరు ఎంపీ స్థానం కోసం ట్రై చేశారు. ఈ సారి చంద్రబాబు ఆయనకు అవకాశం కల్పించారు. 2014, 2019 రెండు సార్లు ఇక్కడ నంచి గెలిచిన గల్లా రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో పెమ్మసానికి అవకాశం కలిసొచ్చింది. గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్‌కు, ప్రముఖ సినీనటుడు çకృష్ణకు బంధువులు. గుంటూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీకి ఉన్న పట్టు.. ఎంపీ గల్లా జయదేవ్‌కున్న పరిచయాలు.. సత్సంబంధాలు.. ఇటీవల టీడీపీలో చేరిన కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మినారాయణకు ఉన్న విస్తృత పరిచయాలను ఉపయోగించుకొని ఈ సారి ఎలాగైనా గెలిచి గుంటురు పార్లమెంట్ గడ్డపైన టీడీపీ హ్యాట్రిక్ కొట్టాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే ప్రచారం ప్రారంభించిన పెమ్మసాని వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ వైఫల్యాలు, యువత, నిరుద్యోగం, అభివృద్ధి, మద్యం తదిర అంశాలను ప్రధాన అస్త్రాలుగా ప్రజల్లోకి వెళ్తున్నారు.
వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి అల్లుడు
గుంటూరు పార్లమెంట్ వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి ఎంపిక అనేక మలుపులు తిరిగింది. తొలుత ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడుని దింపాలని భావించారు. తర్వాత వైఎస్‌ఆర్‌సీపీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు ఉమ్మారెడ్డి వెంకటరమణను దింపాలని నిర్ణయించారు. తర్వాత ఐడియా మార్చారు. చివరకు పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యే కిలారు రోశయ్యను రంగంలోకి దింపారు సీఎం వైఎస్ జగన్. ఈయన ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అల్లుడు కావడం గమనార్హం. గుంటూరు పార్లమెంట్ మీద ఉమ్మారెడ్డికి విశేష సంబంధాలు ఉండటం, అన్ని నియోజక వర్గాల్లో మంచి పట్టు ఉండటంతో రోశయ్యని రంగంలోకి దింపితే కలిసొస్తుందని భావించారు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం నవరత్నాల ద్వారా చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను ప్రధాన అస్త్రంగా ప్రచారం సాగిస్తున్నారు. రెండు సార్లు గెలిచిన టీడీపీని ఈ సారి ఎలాగైనా ఓడించి ఆ స్థానంలో వైఎస్‌ఆర్‌సీపీ జెండాను ఎగుర వేయాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. కాపు అభ్యర్థిని రంగంలోకి దింపడం ద్వారా సులువుగా గెలవచ్చని సీఎం జగన్ భావిస్తున్నారు. ఇక్కడ కాపు ఓటర్లు 2.07లక్షలు, ముస్లిం ఓటర్లు 1.80లక్షలు, రెడ్డి ఓటర్లు 1.05లక్షలు, మాల ఓటర్లు 2.03లక్షలు ఉన్నాయి. ఈ ఓటర్లందరూ తమ పార్టీవైపే మొగ్గు చూపుతారని, దీంతో గెలుసు ఈజీ అవుతుందని సీఎం అంచనా వేస్తున్నట్లు ఆ పార్టీలో చర్చించుకుంటున్నారు. 2014లో వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, 2019లో పోటీ చేసిన వల్లభనేని బాలశౌరి టీడీపీ అభ్యర్థి గల్ల జయదేవ్ చేతిలో ఓడిపోయారు.