పోలీస్ శాఖ పటిష్టమవుతుందా?
పోలీస్ శాఖలో రిక్రూట్ మెంట్, ప్రమోషన్స్ విధానంలో ప్రభుత్వం సమూల మార్పులు చేసింది.;
ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖను పటిష్ట పరిచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? ఎందుకు ప్రమోషన్స్ కోటాను తగ్గించాలనుకుంది. ప్రమోషన్స్ పై వచ్చే వారు విధి నిర్వహణలో సరిగా లేరా? అనే చర్చ ప్రస్తుతం పోలీస్ శాఖలో జరుగుతోంది. ప్రమోషన్స్ విషయంలో ప్రభుత్వం పలు నిర్ణయాల ప్రకారం కానిస్టేబుల్ నుంచి ప్రమోషన్స్ పై వచ్చే వారి సంఖ్య తగ్గుతుంది. అయితే వీరు ఉద్యోగంలో ప్రతిభ కనబరిచినట్లైతే అటువంటి వారికి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించింది. ఘతంలో ఈ రిజర్వేషన్లు ఈ స్థాయిలో లేవు. ఉన్నప్పటికీ నామినల్ గానే ఉన్నాయని చెప్పొచ్చు.
65 శాతం డైరెక్ట్ రిక్రూట్ మెంట్
సబ్ ఇన్ స్పెక్టర్ లకు డైరెక్ట్ రిక్రూట్ మెంట్ ఉంటుంది. 65 శాతం పోస్టులు సబ్ ఇన్స్పెక్టర్ లకు కేటాయించేందుకు నిర్ణయించారు. మిగిలిన 35 శాతం పోస్టులు ప్రమోషన్ కోటాలో భర్తీ చేస్తారు. గతంలో ఎస్ ఐ పోస్టులకు 55 శాతం మాత్రమే రిక్రూట్ మెంట్ ఉండేది. ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లకు ప్రమోషన్ కల్పించడం ద్వారా 30 శాతం, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ కు (ఏఆర్, ఏపీఎస్పి, ఎస్ ఏఆర్ఎస్పిఎల్) ల నుంచి బదిలీల ద్వారా 5 శాతం పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
డైరెక్ట్ రిక్రూట్ మెంట్ లో కొన్ని రిజర్వేషన్లు
డైరెక్ట్ రిక్రూట్ మెంట్ లో పోలీస్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ కు 5శాతం, మినిస్టీరియల్ స్టాఫ్ కు 1 శాతం, క్రీడల్లో మెరిట్ ఉన్న వారికి రెండు శాతం, సిబ్బంది పిల్లలకు 2శాతం, డ్యూటీ చేస్తూ మరణించిన వారి పిల్లలకు 2శాతం, ఎన్సీసీ వారికి 3శాతం రిజర్వేషన్ లు ఉంటాయి. వీరికి స్థానికంగానే ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఆర్ఎస్ఐ నుంచి ఎస్ఐ కావాలనుకునే వారికి 5శాతం రిజర్వేషన్ ఉంటుంది. వీరికి స్థానిక జోన్ లోనే రిజర్వేషన్ వర్తిస్తుంది.
వచ్చే ఏడాది జూలై నుంచి ఈ ఏడాది జూలై వరకు ఉన్న ఖాళీలు భర్తీ చేసేందుకు ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనుంది. స్టాఫ్ నుంచి ఎస్ఐ రిక్రూట్ మెంట్ కు వచ్చే వారి వయస్సు గత సంవత్సరం జూలై 1 నాటికి 40 ఏళ్ల వయస్సు దాటకూడదు. ఈ నియామకాలు పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు చేపడుతుందని ఆదేశాల్లో పేర్కొన్నారు. నక్సల్స్, మావోయిస్ట్, ఉగ్రవాద వ్యతిరేక విభాగాల్లో ఏదైనా గ్యాలెంట్రీ మోడల్ ఉండాలి.
ఈ ప్రాంతాల్లో 1 నుంచి 3 ఏళ్లు పనిచేసి ఉంటే 5 మార్కులు, 3 నుంచి 5ఏళ్లు పనిచేసి ఉంటే 10 మార్కులు, ఐదేళ్ల కంటే ఎక్కువ పనిచేసి ఉంటే 15 మార్కులు కలుపుతారు. అశోక్ చక్ర అవార్డీ దారులకు 25 మార్కులు, కీర్తి చక్ర అవార్డుకు 20 మార్కులు, పీపీఎంజీ, పీఎంజీలకు 15 మార్కులు, ముఖ్యమంత్రి శౌర్య పథకానికి 10 మార్కులు కలుపుతారు. ఔట్ స్టాండింగ్ ఏసీఆర్ కు 5, వెరీగుడ్ 4, గుడ్ 3, గుడ్ 3, సంతృప్తికరం 2 మార్కులు కలుపుతారు. జోన్ వారితోనే భర్తీ చేయాల్సి ఉంటుంది. స్థానికులు లేనప్పుడు వేరే జోన్స్ వారిని డిప్యుటేషన్ పై తీసుకుని రిక్రూట్ చేస్తారు.
ఏడాది కాలంలో ఉన్న ఖాళీలన్నీ భర్తీ
డైరెక్ట్ రిక్రూట్ మెంట్ లోనూ విధుల్లో ఉన్న వారికి రిజర్వేషన్ కల్పిస్తూ తీసుకున్న నిర్ణయం ఎంతో మంచిదనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది. రిక్రూట్ మెంట్ కు సంబంధించి గత సంవత్సరం జూలై నుంచి ఈ సంవత్సరం జూలై వరకు ఉన్న ఖాళీలన్నీ పరిశీలించి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయించింది.
అనుభవానికీ ప్రాధాన్యత ఉండాలి: రిటైర్డ్ డీజీపీ
కానిస్టేబుళ్లలో కూడా చాలా మంది అనుభవం కలిగిన వారు ఉన్నారని, వారికి కూడా ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మంచిదేనని ఏపీ రిటైర్డ్ డీజీపీ నండూరి సాంబశివరావు అన్నారు. ఆయన ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ తో మాట్లాడుతూ కానిస్టేబుల్స్ లో కూడా తెలివైన వారు ఉన్నారని, పీజీ చదువుకున్న వారు కానిస్టేబుల్ ఉద్యోగాలు చేస్తున్నట్లు చెప్పారు. తాను డీజీపీగా ఉన్నప్పుడు విజయనగరం పీటీసీ ని సందర్శిస్తే శిక్షణలో జమ్స్ ఎంతో మంది కానిస్టేబుల్స్ ఉన్నారన్నారు.