రంగంలో ఉదయభాను ఉంటాడా ..?

జగ్గయ్యపేట రాజకీయం ఆసక్తి కరంగా మారింది. గెలుపు ఓటములు పక్కన పెడితే టిడిపి అభ్యర్థిని ప్రకటించగా, వైసిపి అభ్యర్థి ఖరారు కాకపోవడం చర్చనీయాంశంగా మారింది.;

Byline :  The Federal
Update: 2024-03-02 06:36 GMT
Udayabhanu (file photo)

G. Vijaya kumar

ఆంధ్రప్రదేశ్‌లోని జగ్గయ్యపేటకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ ఒకప్పుడు బౌద్దమత బోధనలు ఎంతో మందిని ఇక్కడ చైతన్యవంతం చేశాయి. ఇప్పుడు అటువంటిదేమీ లేకపోయినా రాజకీయ విన్యాసాలకు తక్కువేమీ లేదు. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో 5 సార్లు టిడిపి ఇక్కడ నుంచి గెలుపొందింది. ఏడు సార్లు కాంగ్రెస్‌ ఒక సారి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలుపొందారు. టిడిపి అభ్యర్థిగా శ్రీరామ్‌ తాతయ్యను ప్రకటించగా ఆయన ప్రచారంలో దూసుకొని పోతున్నారు. మరో వైపు వైసిపి అభ్యర్థిని ఇంకా ఖరారు చేయలేదు. ప్రస్తుతం ఉన్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే సామినేని ఉదయభానుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంకా గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వలేదు.
ప్రకటించే వరకు సందిగ్ధమే..
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను మార్పు చేస్తూ ఇప్పటి వరకు తొమ్మిది జాబితాలను విడుదల చేసారు. ఇక మార్పులు చేర్పులు లేవంటూనే శుక్రవారం రాత్రి నలుగురు అభ్యర్థులతో తాజా జాబితాను విడుదల చేశారు. ఇలా ఒక పక్క మార్పులు లేవంటూనే సిఎం జగన్‌ మార్పులకు తెర తీయడం, మరో వైపు ఉన్న వాళ్లకు మీరే అభ్యర్థులని ఖారారు చేయక పోవడంతో సామినేనితో పాటు అతని క్యాడర్‌లో అయోమయ పరిస్థితి నెలకొంది. దీంతో అడుగు ముందుకేయలేని పరిస్థితి నెలకొంది. జిల్లాలోనే తన పార్టీకి చెందిన ప్రత్యర్థులు తనకు స్థానం దక్కకుండా చేస్తారనే అనుమానాలు అతని సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎమ్మెల్యే వెల్లంపల్లికి, ఉదయభానుకు ఇది వరకు ఒక బర్త్‌డే పార్టీలో గొడవ జరిగింది. నువ్వెంతంటే నువ్వెంతనే స్థాయి వరకు వెళ్లింది. బహిరంగంగానే వాగ్వాదం చేసుకున్నారు. ఇది కాస్తా సిఎంఓ వరకు వెళ్లడంతో ఇరువురిన మందలించి పంపినట్లు ఆప్పట్లో ప్రచారం కూడా జరిగింది. ఇది కూడా తన పేరు ఖరారుపై ప్రభావం చూపుతుందేమోనని ఆయన ఆందోళనలో ఉన్నట్లు ఆ పార్టీలో చర్చ సాగుతోంది.
రెండు సార్లు గెలిచిన ఉదయభాను
సామినేని ఉదయబాను ప్రస్తుతం సిట్టింగ్‌ ఎమ్మెల్యే. కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశారు. తొలి సారి 1999లో ఆ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత జరిగిన 2004 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ పార్టీ పెద్దలు ఉదయబానుకే టికెట్‌ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో కూడా ఉదయబాను గెలుపొందారు. అనంతరం 2009,2014 ఎన్నికల్లో వరుసగా ఓటమిని చవి చూశారు. ప్రత్యర్థులు నెట్టెం రఘురాం, శ్రీరామ్‌ తాతయ్యపైన గెలిచారు.
తాతయ్య గెలుపు కూడా రెండు సార్లే..
శ్రీరామ్‌ రాజగోపాల్‌ తాతయ్య రెండు దఫాలుగా ఎమ్మెల్యేగా జగ్గయ్యపేట నుంచి ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌ నాయకుడైన జొన్నకూటి బాబాజీరావు ద్వారా ఆ పార్టీలోకి వచ్చిన తాతయ్య 2004లో జగ్గయ్యపే మునిపల్‌ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. తర్వాత టిడిపి తీర్థం పుచ్చుకున్నారు. 2009, 2014లోను టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2019లో కూడా గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలనుకున్నారు. కానీ ప్రత్యర్థి సామినేని ఉదయబాను చేతిలో ఓడి పోయారు.
సానుభూతిపైనే బాబు నమ్మకం
చంద్రబాబునాయుడు మాత్రం శ్రీరామ్‌ తాతయ్యపైనే నమ్మకం పెట్టుకున్నారు. సానుభూతితో ఓటర్లు గెలిపిస్తారనే నమ్మకంతో ఉన్నారు. ఈ సారి కూడా చంద్రబాబు తాతయ్యకే జగ్గయ్యపే టిడిపి టికెట్‌ కేటాయించారు. దీంతో పాటుగా టిడిపి నిర్వహించిన సర్వేలో తాతయ్యకు అనుకూలత ఎక్కువుగా ఉందని తేలడంతో అతని వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. గత ఎన్నికల్లో ఓడి పోయిన సాను భూతి, ప్రభుత్వం ఉన్న వ్యతిరేకత తాతయ్యకు అనుకూలంగా మారే చాన్స్‌ ఉందని టిడిపి పెద్దలు అంచనా వేస్తున్నారు.
హ్యాట్రిక్‌ కొట్టిన నెట్టెం రఘురామ్‌
నెట్టం రఘురాం కూడా ఇదే స్థానం ఆశించారు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్‌ జిల్లా టిడిపి అధ్యక్షులుగా ఉన్నారు. గతంలో ఇదే అసెంబ్లీ నియోజక వర్గానికి ప్రాతినిద్యం వహించారు. రెండు సార్లు ఓడి పోయిన నెట్టెం రఘురాం మూడు పర్యాయాలు గెలుపొందారు. 1985, 1989, 1994లో వరుస విజయాలను సాధించి హ్యాట్రిక్‌ కొట్టారు. జగ్గయ్యపే టికెట్‌ తనకే కేటాయిస్తారని చంద్రబాబుపై నమ్మకం పెట్టుకున్నారు. అయితే తాతయ్యకే ఈ స్థానం కేటాయించారు. దీంతో నెట్టం రఘురామ్‌ ఆసంతృప్తికి లోనయ్యారు. ఆయన క్యాడర్‌ కూడా దిగాలు పడింది. ఈ నేపథ్యంలో నెట్టం రఘురామ్‌ అనుచరులు, కార్యకర్తలు తాతయ్యకు సహకరించి గెలుపునకు పని చేస్తారా అనేది టిడిపి శ్రేణుల్లో ప్రశ్నార్థకంగా మారింది.
Tags:    

Similar News