ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తారా?
వైఎస్ షర్మిల మరో సారి వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌పై విమర్శలు చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తాననడం అవివేకం, అజ్ఞానమని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ధ్వజమెత్తారు. సోమవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ మిమ్మల్ని ప్రజలు గెలిపించింది.. అసెంబ్లీ మీద అలగడానికో.. మైక్ ఇస్తేనే వెళ్తానని మారాం చేయడానికో.. తమ ఇంట్లో కూర్చుని సొంత మైకుల్లో మాట్లాడడానికో కాదన్నారు. ప్రతిపక్ష హోదాకు దూరం కావడం మీ స్వయంకృత అపరాదమని అన్నారు. అసెంబ్లీ ప్రజాస్వామ్య దేవాలయం. ప్రజల సమస్యల పట్ల అధికార పక్షాన్ని నిలదీసేందుకు ప్రజలు మీకిచ్చిన గొప్ప అవకాశం. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజా గొంతుక అయ్యే అవకాశం ప్రజలిస్తే.. హోదా ఇస్తేనే వస్తామనడం సిగ్గు చేటు అని వైఎస్ జగన్ మీద విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షం లేనప్పుడు ప్రజా పక్షంగా సభలో ఉండాలనే ఇంగితం కూడా లేక పోవడం బాధాకరమన్నారు. 1994లో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లకే పరిమితమైనా.. కుంగి పోలేదు. మీలా హోదా కావాలని మారాం చేయలేదు. 26 మంది సభ్యులతో సభలో ప్రజల పక్షంగా నిలబడ్డాం. 2014లో కేంద్రంలో 44 సీట్లకే పరిమితమైనా.. ప్రతిపక్ష హోదా కావాలని అడగలేదు. 2019లో 52 సీట్లే ఓటర్లు ఇచ్చినా.. ప్రతిపక్ష హోదా కావాలని అడగలేదు. హోదా లేకున్నా, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ప్రజల సమస్యలపై పార్లమెంట్లో తమ గొంతుకను వినిపించారు. ఇప్పటికైన అసెంబ్లీకి వెళ్లండి. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయండి. అసెంబ్లీకి వెళ్లే దమ్మూ.. ధైర్యం లేక పోతే.. వైఎస్‌ఆర్‌సీపీ శాసన సభా పక్షం మొత్తం రాజీనామా చేసి ఎక్కడైనా తాపీగా కూర్చుని మాట్లాడుకోండి. అంటూ వైఎస్ జగన్‌పై.. షర్మిల ఘాటు విమర్శలు సంధించారు.