ఉత్తరాంధ్ర ఉద్యానవనం ఆ ఒక్కటి మరిచిపోవడం వల్లే ఇలా తయారయ్యిందా?

ఉద్దానం పేరు వింటే గుర్తుకొచ్చేది ఒక్కటే.. అదే కిడ్నీ సమస్య. ఈ సమస్యలపై దశాబ్దాలుగా ప్రజలు ఇబ్బంది పడుతున్నా.. పౌర సమాజం నుంచి ఆశించిన స్పందన రాకపోవడమే..

Update: 2024-10-08 06:48 GMT

ఒకరా ఇద్దరా.. గత పది సంవత్సరాల్లో దాదాపు 4500 మంది ప్రజలు మరణించారు. వీరు అకాల మరణం చెందడానికి కారణం ఒక్కటే.. అదే కిడ్ని సమస్య. కొన్ని సంవత్సరాలుగా ఉత్తరాంధ్ర లోని ఉద్దానంలో, ముఖ్యంగా శ్రీకాకుళంలోని ఉద్ధానం చుట్టు పక్కల ఉన్న మరో ఏడు మండలాల్లో ఇదే సమస్య. వందలాంది మంది కిడ్నీ వ్యాధి గ్రస్తులు ఉన్నారు. వీరికి నిత్యం డయాలసిస్ తో పాటు మందులు వాడాల్సిందే. దశాబ్ధాలుగా ఈ సమస్య ఉన్న ప్రభుత్వాలు అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నించిన దాఖలా కనిపించడంలేదు. దీనికి ప్రజా చైతన్యం కొరవడటమే ఓ కారణంగా చెప్పవచ్చు.

నిస్తేజంగా పౌర సమాజం..
దాదాపు ఏడు మండలాల్లోని లక్షలాది మంది ప్రజలు ఈ సమస్యలో బాధపడుతున్నారు. పాలకులు పట్టించుకోవడం లేదు అయినా.. పౌర సమాజం మాత్రం దీనిపై ప్రభుత్వాలు నిలదీయడం, ప్రశ్నించడం లాంటి చైతన్యవంతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం లేదు. ఒకప్పుడు ప్రజా ఉద్యమాలతో సమైక్య రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపిన ఉత్తరాంధ్ర నేడు తమ సమస్యపై తమకే పట్టనట్లు వ్యవహరిస్తోందని ప్రముఖ ఆర్థిక వేత్త ద్రవిడ విశ్వవిద్యాయలం పూర్వపు వైస్ ఛాన్సలర్ కే. ఎస్ చలం ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్దానంలోని కిడ్నీ వ్యాధి గ్రస్తుల శాశ్వత పరిష్కారానికి కవులు, కళాకారులు, రచయితలు.. తమ ఆయుధాలైన కళాలు, గళాలతో ప్రజా చైతన్యాన్ని రగిలించాలని పిలుపునిచ్చారు. ఒకప్పుడు తమ సమస్యల పరిష్కారానికి ప్రజలంతా కలిసికట్టుగా ఉండేవారని, ఎన్నికల వంటి సమయాలలో బహిష్కరణ అస్త్రం ప్రయోగించారని ఒకప్పటి నాయకులు గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడు పోరాట చైతన్యం మచ్చుకైన కానరావడం లేదు. అందుకే ఉద్దానం కిడ్నీ సమస్య దశాబ్దాల తరబడి కొనసాగుతోంది.
ఉద్ధానంలో సమస్య..
ఉద్దానంలో వయస్సుతో సంబంధం లేకుండా కిడ్ని సమస్య అందరిని వేధిస్తోంది. ఇక్కడ ఉద్దానం నెఫ్రోపతి అనేది శ్రీలంక నెఫ్రోపతి, మెసో అమెరికా నెఫ్రోపతి అనే వర్గంగా మారి ప్రమాదకరంగా తయారవుతోందని వైద్య పరిశీలకులు చెబుతున్న మాట. ఇది అత్యంత ప్రమాదకరమైన వ్యాధి తీవ్రతగా మారి ఇక్కడ గ్రామాలన్నీ ఖాళీ కాకాముందే ప్రభుత్వాలు మేల్కొనాలని అందుకే ప్రజా చైతన్యం ద్వారా ఇక్కడ ప్రజలలో ప్రశ్నించే అలవాటు పెరగాలని  ఫ్రొపెసర్ కేఎస్ చలం ఆకాంక్ష.
ఐఎంఎఫ్ లెక్కల ప్రకారం ఇక్కడ ఒక్కో వ్యక్తి తన జీవిత కాలంలో కుటుంబం కోసం సంపాదించే విలువ రెండు నుంచి మూడు కోట్ల రూపాయలు ఉంటుంది ఈ లెక్కన చనిపోయిన వ్యక్తుల కారణంగా కుటుంబాలు, ఈ ప్రాంతం మొత్తానికి దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు నష్టం వాటిల్లినట్లు అంచనా. కానీ ఇక్కడ ఉన్న రాజకీయ వైషమ్యల కారణంగా అభివృద్ధికి అవసరమైన నిధులు మాత్రం కేటాయించబడటం లేదని చలం గారి అభిప్రాయం.
ఒకప్పుడు ఉత్తరాంధ్ర ప్రాంతం నక్సలిజం కారణంగా వెనకబడింది. కానీ ఇప్పుడు అభివృద్ధి మొత్తం బడా కంపెనీలు ఉన్న ప్రాంతాలకే పరిమితం అయింది. భూములు, ప్రజల ఆదాయ మార్గంగా ఉన్న చేపల పెంపకం వంటి రంగాల్లోని ఎంఎన్సీలు వచ్చి చేరాయి. పోర్టుల నిర్మాణ, నిర్వహణ కూడా వాటి చేతుల్లోనే కేంద్రీకృతమవుతోంది. ఈ కార్పొరేట్ కంపెనీలతో బడా నాయకులతో పాటు స్థానిక నాయకులు చేతులు కలిపింది.
అయితే వీటన్నింటిని ప్రశ్నించాల్సిన పౌర సమాజం మధ్య విభజన కనిపిస్తోంది. ఈ సమూహాలన్నీ కూడా వారి మధ్య లోపాలను బయటపెట్టుకోవడం, తామే బలపడాలనే ఆరాటంలో బలహీనంగా మారాయి. ప్రజాసంఘాలను బలోపేతం చేసి ప్రశ్నించే తత్వాన్ని ప్రజల్లో ప్రచారం చేయడం ద్వారా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం కనుగొనబడుతుంది.
నక్సల్బరి ఉద్యమం ఇక్కడే ఊపిరిపోసుకుంది. తరువాత రాష్ట్రం మొత్తం రాడికల్ ఉద్యమాలు రావడానికి, అలాగే విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు వంటి నినాదాలు, ‘‘ ఎం పిల్ల ఎల్ధా మొస్తావా.. ఎం పిలగో ఎల్థా మొస్తావా’’ వంటి చైతన్య గీతికలు పురుడు పోసుకుందే ఉత్తరాంధ్రలో.. అదే ప్రాంతంలో ప్రజలు భయంకర సమస్యతో పోరాడుతుంటే ప్రభుత్వాలకు ప్రశ్నలు ఎదురుకాకపోవడం ఓ శేష ప్రశ్న.
ప్రజా చైతన్యం కోసం..
ఉద్దానంలోని కిడ్నీ విషాదాలపై కవులు, కళాకారులు, జర్నలిస్టులు, సామాజిక వేత్తలు, వైద్యులు, స్వచ్చంద సంస్థలు సాగించిన పోరాటాలకు అక్షర రూపానిస్తూ రెండు సాహిత్య సంస్థలు ‘‘ ఉద్దానం కిడ్నీ విషాదాలు’’ అనే పుస్తకాన్ని ప్రచురించారు. వీటిని గిడుగు రామ్మూర్తి భాష-జానపద కళాపీఠం కళింగ సీమా సాహిత్య సంస్థలు ప్రచురించాయి. ఈ పుస్తకావిష్కరణలో ద్రవిడ విశ్వవిద్యాలయ పూర్వపు వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కే ఎస్ చలం పాల్గొన్నారు. కవులు రచయిత తమ గళాలు విప్పాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేయాలని, ఉద్దానం సమస్యకు శాశ్వతం పరిష్కారం కనుగొనాలని పిలుపునిచ్చారు.


Tags:    

Similar News