వరలక్ష్మీవ్రతం చేయిస్తారా..రేపు ఆన్ లైన్ లో టికెట్లు విడుదల

తిరుచానూరులో ఆగస్టు 8న ఆర్జిత సేవలు రద్దు;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-07-30 11:14 GMT
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం (ఫైల్)

తిరుచానూరు పద్మావతీ అమ్మవారి ఆలయంలో ఆగస్టు ఎనిమిదో తేదీ ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. ఆ రోజు వరలక్ష్మీవ్రతం కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయంలో అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, ఊంజ‌ల సేవ‌, బ్రేక్ ద‌ర్శ‌నం, వేద ఆశీర్వ‌చ‌నం సేవలను టిటిడి రద్దు చేసింది.

తిరుచానూరులో ఆగస్టు ఎనిమిదో తేదీ వరలక్ష్మీవ్రతం నిర్వహించడానికి టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. కుటుంబ శ్రేయస్సు కోసం మహిళలు వరలక్షీవ్రతం ఆచరించడం ఆనవాయితీ. శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో వ్రతంలో పాల్గొనే మహిళల కోసం ఈ నెల 31వ తేదీ గురువారం ఆన్ లైన్ లో టికెట్లు విడుదల చేయనుంది.
శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్షీవ్రతం జరుపుకుంటారు. సాధారణంగా వరలక్షీవ్రతం ఆచరించడానికి వివాహిత మహిళలు తమ కుటుంబ శ్రేయస్సు, భర్త, పిల్లల దీర్ఘాయుష్షు, సిరిసంపదల కోసం జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఈ ఉత్సవం నిర్వహించుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఇళ్లలో వ్రతం ఆచరించి, ముత్తైదువలకు పసుపు, కుంకుమ, పసుపుదారం, జాకెట్లు అందించి, వారి నుంచి ఆశీర్వచనాలు తీసుకుంటారు.
టీటీడీ ఏర్పాట్లు
టీటీడీ పరిధిలోని అమ్మవారి ఆలయాల్లో వరలక్షివ్రతం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తోంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో నిర్వహించే వరలక్ష్మీ వ్రతంలో పాల్గొనే వివాహిత మహిళల కోసం ఈ నెల 31వ తేదీ ఆన్ లైన్ లో టికెట్లు విడుదల చేయడానికి షెడ్యూలు ప్రకటించారు
భ‌క్తులు నేరుగా వ్ర‌తంలో పాల్గొనేందుకు జూలై 31న ఉద‌యం 9 గంట‌ల‌కు ఆన్‌లైన్‌లో 150 టికెట్లు జారీ చేస్తారు. ఆల‌యం సమీపంలోని కౌంటర్‌లో ఆగ‌స్టు 7న ఉదయం 9 గంటలకు కరెంట్‌ బుకింగ్‌లో 150 టికెట్లు విక్రయిస్తారు. రూ.1000 చెల్లించి భక్తులు టికెట్‌ కొనుగోలు చేయవచ్చు. ఒక టికెట్‌పై ఇద్దరు గృహస్తులను అనుమతిస్తారు.
వ్రతం నిర్వహణ
తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు ఎనిమిదో తేదీ వ్రతం జరుగుతుంది. ఆలయం సమీపంలోని ఆస్థానమండపంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం నిర్వహిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు.

Similar News