చంద్రబాబుపై వర్మ తిరుగుబావుటా?

లోకేష్‌ను టీడీపీ రథసారధిని చేయాలని డిమాండ్‌. కాకినాడ ప్రజాదర్బారులో వ్యూహాత్మకంగానే మాట్లాడారా? దుమారం రేపుతున్న టీడీపీ పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు;

Update: 2025-04-10 05:13 GMT

కొన్నాళ్లుగా తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పిఠాపురం మాజీ మాజీ ఎమ్మెల్యే ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ తాడో పేడో తేల్చకోవడానికి సిద్ధమయ్యారా? పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే లక్ష్యంగా తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు దానికి సంకేతమా? కాకినాడలో బుధవారం జరిగిన పార్టీ ప్రజా దర్బార్‌లో వర్మ టీడీపీ పగ్గాలు చంద్రబాబు నుంచి ఆయన తనయుడు లోకేష్‌కు అప్పగించాలంటూ సరికొత్త అంకానికి తెరలేపడం వ్యూహాత్మకమేనా? ఇదే ఇప్పడు తెలుగుదేశం పార్టీలో పెద్ద చర్చకు దారితీసింది.

గత సార్వత్రిక ఎన్నికల్లో చేతికొచ్చిన ఎమ్మెల్యే పదవిని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తన్నుకు పోవడంతో అప్పట్నుంచి పిఠాపురం మాజీ ఎమ్మల్యే, ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఎస్‌వీఎస్‌ఎన్‌ వర్మ రగిలిపోతూనే ఉన్నారు. కూటమి పార్టీల పొత్తులో పిఠాపురం సీటును చంద్రబాబు జనసేనకు ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడ్డాక తొలివిడతలోనే వర్మకు ఎమ్మెల్సీ పదవినిస్తామని చంద్రబాబు బహిరంగంగానే హామీ ఇచ్చారు. అధినేత భరోసాతో ఇష్టం ఉన్నా లేకున్నా పవన్‌ కల్యాణ్‌కు వర్మ సపోర్టు చేశారు. ఆ ఎన్నికల్లో పవన్‌కు ఊహించని విధంగా 71 వేల ఓట్ల భారీ మెజార్టీ రావడంతో వపన్‌ గెలుపులో వర్మ కృషి ఏమీ లేదన్న నిర్ణయానికొచ్చారు పవన్, ఆయన సోదరుడు నాగబాబు. అదే విషయాన్ని గత నెలలో చిత్రాడలో జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో నాగబాబు కుండ బద్దలు కొట్టారు. పవన్‌ గెలుపు ఆయన చరిష్మా, జనసైనికులు, పిఠాపురం ఓటర్ల వల్లే సాధ్యమైందని, అలాకాకుండా తన వల్లేనని ఎవరైనా అనుకుంటే అది వారి ‘ఖర్మ’ అంటూ వ్యాఖ్యానించారు. నాగబాబు పేల్చిన ‘ఖర్మ’ వ్యాఖ్యలు అప్పట్నుంచీ వర్మ, ఆయన వర్గీయుల్లో ఆగ్రహావేశాలను రగిలిస్తూనే ఉన్నాయి. అయితే వర్మకు ఇస్తానన్న ఎమ్మల్సీ పదవి కూడా ఆయనకు కాకుండా నాగబాబుకే కట్టబెట్టారు. ఇది వర్మను మరింతగా పుండుమీద కారం చల్లేలా చేసింది. రాష్ట్రంలో కూటమి ప్రభుతవం 164 సీట్లతో బలంగా ఉండడం, పైగా పిఠాపురంలో గెలిచిన పవన్‌ కల్యాణ్‌ ఉప ముఖ్యమంత్రి కావడం వంటి పరిస్థితుల్లో వర్మ తెగించి ఏమీ మాట్లాడే సాహసం చేయలేక పోతున్నారు. అయినప్పటికీ పార్టీ శ్రేణులతో తన పరిస్థతిని చెప్పకుని బాధపడుతున్నారు. మరోవైపు పవన్‌ కల్యాణ్, నాగబాబులు కూడా పిఠాపురంలో వర్మ హవాను క్రమంగా నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన రెండో రోజే నాగబాబు పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలకు ఉరుకులు పరుగుల మీద వచ్చారు. ఆ కార్యక్రమాలకు వర్మను ఆహ్వానించలేదంటూ టీడీపీకి చెందిన వర్మ వర్గీయులు ఎక్కడికక్కడే నిరసనలు వ్యక్తం చేస్తూ నాగబాబును అడ్డకునే ప్రయత్నం చేశారు. దీనిపై రాష్ట్రంలో తొలిసారిగా జనసేన ఫిర్యాదుతో తెలుగుదేశం పార్టీ శ్రేణులపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ పరిణామాలు వర్మను మరింతగా ఆవేదనకు గురిచేశాయి. అయినా ఆయనెక్కడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.
ప్రజా దర్బారు వేదికగా బాంబు పేల్చిన వర్మ..
కాకినాడలో బుధవారం తెలుగుదేశం పార్టీ ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘ప్రజా దర్బారు’ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆ జిల్లా నియోజకవర్గాల ఎమ్మల్యేలు, ఇన్చార్జిలు, ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయనేమన్నారంటే..
గత ఎన్నికలకు ముందు యువనేత లోకేష్‌ యువగళం పాదయాత్రతోనే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చింది. మున్ముందు ఆయనే పార్టీని ముందుకు నడిపించాలి. అందుకోసం రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ రధసారథిగా లోకేష్‌నే నియమించాలి. పార్టీ సారథి బాధ్యతలు ఆయనకే అప్పగించాలి. పార్టీకి భవిష్యత్తు ప్రణాళిక ఉండాలి.. 2047 విజన్‌ను దృష్టిలో ఉంచుకుని పార్టీ భవిష్యత్తు ప్రణాళిక వేసి లోకేష్‌ను రథసారథిని చేయాలి. భవిష్యత్తు తరం నాయకుడిగా నారా లోకేష్‌ ఉండాలి. ఆయన పార్టీ సారథి కావాలనుకునే వారు చేతులెత్తాలి అని కోరారు. నారా లోకేష్‌ నాయకత్వం వర్థిల్లాలి అంటూ వర్మ నినాదాలు చేశారు. ఆపై తన ప్రసంగాన్ని ముగించారు. వర్మ అనూహ్యంగా లోకేష్‌ జపం చేయడం, చంద్రబాబు స్థానంలో పార్టీ పగ్గాలు లోకేష్‌కు అప్పగించాలన్న సరికొత్త వాదనను తెరపైకి తేవడంతో వేదికపై ఉన్న ముఖ్య నాయకులంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు.
వర్మ వ్యాఖ్యలు వ్యూహాత్మకమేనా?
పిఠాపురం టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మల్యే వర్మ పార్టీ వేదికగా చంద్రబాబు స్థానంలో లోకేష్‌కు పార్టీ రథసారథి బాధ్యతలు అప్పగించాలంటూ చేసిన వ్యాఖ్యలు టీడీపీలో పెను దుమారాన్నే రేపుతున్నాయి. ఇప్పటికే గతంలో రాయలసీమలో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యడు శ్రీనివాసరెడ్డి లోకేష్‌ను డిప్యూటీ సీఎం చేయాలంటూ చేసిన ప్రకటన పార్టీలో తీవ్ర అలజడి రేపింది. అప్పట్లో ఆ వాదనను సమర్థిస్తూ తొలిసారిగా స్పందించిన వర్మ.. లోకేష్‌ను డిప్యూటీ సీఎంను చేయాల్సిందేనని బహిరంగంగా ప్రకటించారు. ఇప్పడు తాజాగా లోకేష్‌ పార్టీ పగ్గాలివ్వాలంటూ వర్మ ఏదో అలవోకగా మాట్లాడిన మాటలు కావని, వ్యూహాత్మకంగా చేసినవేనని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. కొన్నాళ్లుగా పార్టీలో తగిన ప్రాధాన్యత లేకపోవడం, అధినేత ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం, నియోజకవర్గంలో జనసేన పట్టు బిగిస్తుండడం వంటి పరిణామాలు ఆయన్ను లోలోన రగిలిపోయేలా చేస్తున్నాయని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో వర్మను వైసీపీలో చేరాలన్న ఆహ్వనాలు అందుతున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత ఒక్కొక్కటిగా జరగుతున్న అవమానకర పరిణామాలను సహిస్తూ వస్తున్న వర్మ నేరుగా అధినేతనే టార్గెట్‌ చేసి లోకేష్‌కు పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్‌ను తెరపైకి తేవడం ఇందులో భాగమేనని విశ్లేషిస్తున్నారు. దీంతో వర్మ తన రాజకీయ భవిష్యత్తుపై అధినేత చంద్రబాబుతో తాడో పేడో తేల్చుకోవడం ఖాయమన్న భావన పలువురిలో వ్యక్తమవుతోందని పిఠాపురానికి చెందిన డి దుర్గాప్రసాద్‌ అనే టీడీపీ నాయకుడు ‘ద ఫెడరల్‌ ఆంధ్రప్రదేశ్‌’ ప్రతినిధితో చెప్పారు. మొత్తమ్మీద ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న వర్మ ఆకస్మికంగా రథసారథి వ్యాఖ్యలు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. తాజా పరిణామాలు పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో? చంద్రబాబు, వపన్‌ కల్యాణ్, నాగబాబుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనన్న చర్చ ఇటు టీడీపీ, అటు జనసేన శ్రేణుల్లో జరుగుతోంది.
Tags:    

Similar News