వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదా?
వకాల్తా పుచ్చుకున్న మంత్రి లోకేష్. 8న ప్రధానితో దీనిపై ప్రకటన చేయిస్తారా? లోకేష్ వ్యూహాత్మకంగానే అలా చెప్పించారా?;
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదా? ఆంధ్రప్రదేశ్లోని ఎన్డీయే కూటమి ప్రభుత్వ పెద్దలు ఈ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను ఆపేశారా? ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు తనయుడు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి లోకేష్ మాటలు వింటే ఎవరికైనా అలాంటి అనుమానమే కలుగుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు ప్రైవేటీకరణ గండం తప్పిపోయినట్టేనని అనిపిస్తుంది. అయితే ఈనెల 8న విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీతో దీనిపై ప్రకటన చేయిస్తారా? లోకేష్ మాటల్లో నిజమెంత?
సరిగ్గా నాలుగేళ్ల క్రితం 2021 జనవరిలో విశాఖ స్టీల్స్టాంట్ (ఆర్ఎన్ఎల్)ను ప్రైవేటీకరణ చేయబోతున్నట్టు కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రైవేటీకరణ బాంబుకు ఉలిక్కి పడిన ఉక్కు కార్మికులు అప్పట్నుంచి ఉద్యమిస్తూనే ఉన్నారు. రోడ్డెక్కి ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు వంటివి ఎన్నో చేస్తున్నా కేంద్రం మాత్రం తగ్గేదే లే అంటూ ప్రైవేటీకరణపై ఒక్కో అడుగూ ముందుకే వేస్తోంది. ఉక్కులో కార్మికుల సంఖ్యను తగ్గించేయడం, ఉన్న వారిని ఏదోలా వదిలించుకోవడం, కొత్తగా నియామకాలు నిలిపివేయడం, కోకింగ్ కోల్ కొరతతో ఉత్పత్తిని తగ్గించేయడం, అప్పులు, నష్టాలను పెంచుకుంటూ పోవడం, తాజాగా ఫైర్ ఫైటింగ్ ప్రివెన్షన్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ ను తప్పించి ప్రైవేటుకు అప్పగించేందుకు సన్నాహాలు చేయడం వంటి వాటిపైనే కేంద్రం దృష్టి సారించింది.
మరోవైపు ఇప్పటికే మూడు నెలలుగా జీతాల్లేక ప్లాంట్ కార్మికులు ఆకలి కేకలు పెడుతున్నారు. అయినప్పటికీ దీనిపై కూటమి పాలకులెవరికీ చీమ కుట్టడం లేదు. యాజమాన్యం నుంచి జీతాలు చెల్లించే ప్రయత్నాలేమీ చేయడం లేదు. ఒత్తిడీ చేయడం లేదు. విశాఖ వచ్చినప్పుడల్లా ప్రైవేటీకరణ జరగదన్నట్టే కబుర్లు చెప్పి వెళ్లిపోతున్నారు. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా జరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు వస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు పడుతున్న తరుణంలో మంత్రి లోకేష్ ప్రధాని పర్యటన ఏర్పాట్ల పరిశీలనకు ఆదివారం విశాఖకు వచ్చారు.
మంత్రి లోకేష్ ఏమన్నారంటే..?
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఆదివారం విశాఖలో మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే లోకేష్‌కు అసహనం తన్నుకొచ్చింది. ప్రైవేటీకరణ ఆగిపోయిందని ఎన్ని సార్లు చెప్పాలి మీకు? అంటూ చిరాకును ప్రదర్శించారు. 'వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని వంద సార్లు చెప్పాను. ఇంకా డౌటెందుకు? ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తారు? కేంద్రమంత్రి వచ్చి చెప్పారు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి చెప్పారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కనీసం నాలుగైదుసార్లు వైజాగ్ వచ్చాను. వచ్చినప్పుడల్లా చెబుతున్నాను. ప్రజలు కూడా ప్రైవేటీకరణ దుష్ప్రచారాన్ని నమ్మకండి. ఫేక్ వారుంటారు.. వైసీపీ ఫేక్ పార్టీ.. వారికి పనీపాటా ఉండదు.' అంటూ లోకేష్ విరుచుకుపడ్డారు.
లోకేష్ మాటలపై విశాఖ వాసులు, వైసీపీ నాయకులతో పాటు ఉక్కు కార్మిక, ప్రజాసంఘాల నాయకులకు నమ్మకం కుదరడం లేదు. అందుకే వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోమని విశాఖ వస్తున్న ప్రధానితోనే స్పష్టమైన ప్రకటన చేయించాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రధాని విశాఖ పర్యటనకు వస్తున్న తరుణంలో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని లోకేష్‌తో వ్యూహాత్మకంగా ప్రకటన చేయించారన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ బాధ్యత ప్రతిపక్షాలకు, కార్మికులకే తప్ప అధికారంలో ఉన్న నేతలకు లేదా? అని నిలదీస్తున్నారు.
ఆందోళనలు.. నిరసనలకు సమాయత్తం..
ఉక్కును ప్రైవేటీకరణ చేయబోమని ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధాని వచ్చే 8 వ తేదీ వరకు వివిధ రూపాల్లో ఆందోళనలు ఉధృతం చేయాలని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నిర్ణయించింది. సోమవారం ఛలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని, కూర్మన్నపాలెంలో చేపట్టిన ఉక్కు రిలే దీక్షా శిబిరం వద్ద భారీ ధర్నాను చేపట్టారు. ప్రధాని మోదీ పర్యటనను అడ్డుకోవాలని సీఐటీయూ ఇప్పటికే పిలుపునిచ్చింది. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రధాని మోదీ పర్యటనపై పరవాడలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది.
ప్రధానితో చెప్పించగలరా?
విశాఖ స్టీల్స్టాంట్ ప్రైవేటీకరణ జరగదని లోకేష్ చెప్పడం కాదు.. ఆ విషయం విశాఖ వస్తున్న ప్రధాని మోదీతో ఆయన చెప్పించగలరా? అని మాజీ మంత్రి, వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ ప్రశ్నించారు. 'ప్లాంట్ కార్మికుల తరఫున అడుగుతున్నాం. ప్రైవేటీకరణ జరగదని ప్రధాని విశాఖ సభలో స్పష్టం చేయాలి' అని ఆయన డిమాండ్ చేశారు.
ప్రధానే ప్రకటన చేయాలి..
వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయడం లేదని విశాఖ పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ ప్రకటన చేయాలని స్టీల్ ప్లాంట్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రామస్వామి 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధితో చెప్పారు. 'పార్లమెంట్ సాక్షిగానే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతోందని రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావుకు ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి సమాధానం ఇచ్చారు. అలాంటిది ప్రైవేటీకరణ ఆగిపోయిందని లోకేష్ చెబితే ఎలా నమ్మాలి? ప్రైవేటీకరణ నిర్ణయం కేబినెట్లో తీసుకున్నందున లోకేష్ లాంటి వారు కాకుండా కేంద్ర ప్రభుత్వం లేదా ప్రధాని మాత్రమే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్టు ప్రకటించాలి' అని ఆయన డిమాండ్ చేశారు. ఉక్కు ప్రైవేటీకరణ జరగదని ముఖ్యమంత్రి చంద్రబాబో, మంత్రి లోకేషో చెబితే సరిపోదు.. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్టు విశాఖ వస్తున్న ప్రధాని మోదీ ప్రకటన చేయాలని విశాఖ జిల్లా కార్మిక, ప్రజా సంఘాల జేఏసీ సోమవారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించినట్టు జేఏసీ చైర్మన్ జగ్గునాయుడు 'ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్' ప్రతినిధికి చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో.. ప్రధానితో ప్రైవేటీకరణ లేదన్న ప్రకటన చేయించగలుగుతారా? కూటమి పాలకులు కనీసం స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించవద్దని ప్రధానికి వినతి పత్రమైనా ఇస్తారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.