మహిళల 'మద్య'మేవ జయతే!

లిక్కర్ షాపుల్లో 10 శాతానికి పైగా వారివే. మొత్తం 345 షాపులను దక్కించుకున్న మగువలు. అత్యధికంగా విశాఖలో 31, అతి తక్కువగా బాపట్లలో 1 కైవసం.

Update: 2024-10-15 10:37 GMT
మద్య నిషేధాన్ని అమలు చేయాలంటూ విశాఖలో (2022లో) ఆందోళన చేస్తున్న అప్పటి తెలుగు మహిళ అధ్యక్షురాలు, నేటి హోంశాఖ మంత్రి అనిత (ఫైల్)

(బొల్లం కోటేశ్వరరావు - విశాఖపట్నం)

రాజకీయాల్లోనే కాదు.. మద్యం వ్యాపారాల్లోనే తామేమీ తక్కువ కాదంటున్నారు మహిళలు! అన్నింటా పురుషులకు ధీటుగా రాణిస్తున్న తాము ఇప్పుడు లిక్కర్ 'క్వీన్'లం అనిపించుకోవడానికి ముందుకొచ్చారు. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా 3396 మద్యం షాపుల కేటాయింపు కోసం ఇచ్చిన నోటిఫికేషన్కు మగువలు భారీ సంఖ్యలోనే పోటీ పడ్డారు. సోమవారం నిర్వహించిన లాటరీలో 345 మంది లక్కీ ఛాన్స్ను దక్కించుకున్నారు. అంటే మొత్తం షాపుల్లో వీరు 10.20 శాతం మేర కైవసం చేసుకున్నారు. మహిళలు మద్యం దుకాణాలు దక్కించుకోవడంపై గాని, వాటి నిర్వహణపై గాని నిషేధం లేదు. అందువల్లే వీరు వీటి కోసం ఇబ్బడి ముబ్బడిగా దరఖాస్తులు చేసుకున్నారు. అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఇలా రాష్ట్రంలోకెల్లా విశాఖ జిల్లాలో అత్యధికంగా 31 మంది మహిళామణులు మద్యం షాపులకు యజమానులవుతున్నారు. అతి తక్కువగా బాపట్ల జిల్లాలో ఒక్కరికే లిక్కర్ షాపు ఓనర్ అవకాశం దక్కింది.

జిల్లాల వారీగా మద్యం షాపులను దక్కించుకున్న మహిళలను పరిశీలిస్తే.. అనకాపల్లి జిల్లాలో 25 మంది, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో 24 మంది చొప్పున, ఎన్టీఆర్ 20, గుంటూరు 11, కృష్ణా 5, అనంతపురం 18, అన్నమయ్య 13, చిత్తూరు 14, కాకినాడ 10, అంబేడ్కర్ కోనసీమ 11, తూర్పు గోదావరి 12, ఏలూరు 14, కర్నూలు 10, నంద్యాల 6, పల్నాడు 7, పార్వతీపురం మన్యం 9, ప్రకాశం 14, శ్రీసత్యసాయి 5, తిరుపతి 16, పశ్చిమ గోదావరి 14, వైఎస్సార్ కడప జిల్లాలో 6 చొప్పున మహిళలకు దక్కాయి. మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసుకున్న అతివలు ఆయా జిల్లాల్లోని లాటరీ కేంద్రాలకు చేరుకున్నారు. మరికొందరైతే పిల్లా పాపలతోనూ హాజరయ్యారు. లాటరీలో షాపులను పొందిన మహిళలు బుధవారం నుంచి లిక్కర్ దుకాణాలకు యజమానులు కానున్నారు. వారి పేరునే అవి నడవనున్నాయి. ప్రభుత్వానికి వీరి పేరునే లైసెన్స్ ఫీజులు వగైరా సొమ్ము చెల్లింపులు జరుగుతాయి.

రాష్ట్రంలో మద్య నిషేధాన్ని కోరుతూ కనిగిరిలో తెలుగు మహిళల ఆందోళన

 

మగ వారి ప్రోత్సాహంతోనే?

కొంతమంది పురుషులే తమ భార్యా పిల్లల పేరిట దరఖాస్తు చేయించిన వారూ ఉన్నారు. సెంటిమెంట్లు, నమ్మకాలతో వీరితో దరఖాస్తు చేయించారన్న ప్రచారం ఉంది. దీంతో ఇలా తమ ఇంట మహిళ పేరుతో షాపులను దక్కించుకున్నా చాలావరకు ఆ మహిళలు లిక్కర్ దుకాణాలకు వచ్చే పరిస్థితి ఉండదు. 2019కి ముందు కూడా లాటరీ విధానంలోనే లిక్కర్ షాపుల కేటాయింపు జరిగింది. అప్పట్లోనూ కొన్ని షాపులు మహిళలు దక్కించుకున్నారు. అప్పటికంటే ఇప్పుడే వీరి సంఖ్య పెరగడం ఆసక్తి రేపుతోంది.

దూబగుంట రోశమ్మ నుంచి..

సారా, మద్యం సేవించి వచ్చి ఇంట్లోని భార్యాపిల్లలను హింసించడమే కాదు.. వారి జీవితాలు నాశనమవుతుండడంతో 1991లో నెల్లూరు జిల్లా దూబగుంటలో రోశమ్మ అనే మహిళ సారా నిషేధ ఉద్యమానికి నడుం బిగించింది. కూలి నాలి చేసుకుని కష్టపడి చదివించిన తన ఇద్దరి కుమారులు తాగుడుకు బానిసలై ప్రయోజకులు కాకుండా పోవడం ఆమెను కదలించింది. దీంతో సాటి మహిళలతో మొదలైన సారా వ్యతిరేక ఉద్యమం రాష్ట్రం నలుదిశలా విస్తరించింది. దీంతో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి సారా నిషేధం విధించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్టీరామారావు తన ఎన్నికల హామీలో భాగంగా 1994లో మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు. అయితే రెండేళ్లకే అంటే 1996లోనే ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. అప్పట్నుంచి మద్యంపై మహిళలు ఆందోళనలు సాగిస్తూనే ఉన్నారు. అడపాదడపా లిక్కర్ షాపులు, బెల్టు షాపులపై దాడులు కూడా చేస్తున్నారు.

వీరికి మహిళా సంఘాలు అండగా నిలుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వానికి అతి పెద్ద ఆదాయ వనరు కావడంతో మద్యపాన నిషేధం అమలు చేసేందుకు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు సాహసం చేయలేక పోతున్నాయి. చివరకు మద్యంపై గతంలో పెద్ద ఎత్తున ఉద్యమించిన మహిళలే ఇప్పుడు లిక్కర్ షాపులకు యజమానులుగా మారుతున్న వైనాన్ని కొంతమంది మహిళలు అభ్యంతరం చెబుతున్నారు. ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 'మద్యంపై ఆందోళనలు చేపట్టే మహిళలు మద్యం దుకాణాలు దక్కించుకోవడం సరికాదు..ఉద్యమ స్ఫూర్తికే విరుద్ధం.. సాటి మహిళలకు వీరు ఎలాంటి సందేశాన్నిస్తారు?' మహిళలకు అనేక వ్యాపారావకాశాలున్నాయి. లిక్కర్ వ్యాపారాన్నే ఎంచుకోవడం అభ్యంతరకరం..' అని విశాఖ నగరం సీతమ్మధారకు చెందిన గృహిణి కుప్పిలి రాజేశ్వరి పట్నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News