Dharmana|‘మినిస్టర్ గారు’ కార్యకర్తల్ని గాలికొదిలేయడం 'ధర్మ'మేనా?
మంత్రి పదవిలో లేకపోయినా 'మినిస్టర్ గారు' అని పిలిపించుకునే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కొన్నాళ్లుగా మౌనంగా ఉంటున్నారు. దీంతో క్యాడర్ గందరగోళంగా ఉంది.
By : బొల్లం కోటేశ్వరరావు
Update: 2024-11-15 02:00 GMT
మంత్రి పదవిలో లేకపోయినా 'మినిస్టర్ గారు' అని పిలిపించుకునే మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Dharmana Prasada రావు) కొన్నాళ్లుగా మౌనంగా ఉంటున్నారు. ఆయనకు అలా పిలిపించుకోవడం ఇష్టమనే భావనతో ఆయన అనుచరులు, వైసీపీ నాయకులు మాజీ అయినా ధర్మానను మంత్రిగానే సంభోదిస్తుంటారు. గతంలో కాంగ్రెస్ హయాంలోను, వైసీపీ ప్రభుత్వంలోనూ ఆయన కీలక మంత్రి పదవులను చేపట్టారు. ఆ రెండు పార్టీల్లోనూ శ్రీకాకుళం జిల్లాకు ఆయన పెద్దన్నగా వ్యవహరించారు. రాజకీయాల్లోనూ బాగానే చక్రం తిప్పారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఒక వెలుగు వెలిగారు. 2024 ఎన్నికల్లో ఆయన వైసీపీ తరఫున శ్రీకాకుళం నుంచి పోటీ చేసి 55 వేల పై చిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. దీంతో ఆయన వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు. పైగా వైసీపీ తరఫున ఎలాంటి కార్యక్రమాలు చేపట్టడం లేదు. పార్టీ కార్యకలాపాల్లో పాల్గొనడం లేదు. అంతేకాదు.. ఇటు వైసీపీ తరఫున గాని, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు అనుకూలంగా గాని, టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కు వ్యతిరేకంగా పల్లెత్తయినా మాట్లాడడం లేదు. ఎలాంటి రాజకీయ వ్యాఖ్యలూ చేయడం లేదు. ఎన్నికల ముందు వరకు ఎంతో హుషారుగా కనిపించిన ధర్మాన ప్రసాదరావు కొన్నాళ్లుగా ఇలా ఎందుకు ఉంటున్నారో ఎవరికీ అంతు చిక్కడం లేదు. ఆయన వ్యవహార శైలి, ఇంటికే పరిమితమైన తీరు వైసీపీ శ్రేణులకూ రుచించడం లేదు. దీంతో కొన్నాళ్లుగా పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కూడా ధర్మాన నివాసం వైపు వెళ్లడం లేదు. మరోవైపు ధర్మాన వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ను కూడా కలవడానికి ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. ఇప్పటికే అధికారాన్ని కోల్పోయిన అనంతరం జగన్ పలు సమీక్షా సమావేశాలు నిర్వహించారు. వాటికీ ధర్మాన అల్లంత దూరానే ఉన్నారు..
ధర్మాన అలా.. బొత్స ఇలా..
పొరుగున ఉన్న విజయనగరం జిల్లాకు చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆ జిల్లాతో పాటు విశాఖపట్నం జిల్లాలోనూ యాక్టివ్గా ఉన్నారు. కూటమి ప్రభుత్వ తప్పిదాలు, వైఫల్యాలను తరచూ మీడియా ముందు ఏకరువు పెడుతున్నారు. అలాగే విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై సందర్భానుసారం విమర్శలను గుప్పిస్తున్నారు. కానీ బొత్స సమకాలికుడైన ధర్మాన ప్రసాదరావు అందుకు భిన్నంగా మౌనముద్ర దాలుస్తుండడం చర్చనీయాంశంగా మారింది. కాగా ధర్మాన రాజకీయాలతో పాటు వ్యాపారాల్లోనూ ఉంటారు. ప్రస్తుతం వ్యాపార పనుల నిమిత్తం హైదరాబాద్, బెంగళూరు వెళ్లి వస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు.
ఇదీ ఆయన ధోరణి ?
అధికార పార్టీ పాలనను కొన్నాళ్లు వేచి చూసే దాకా పార్టీకి, క్యాడరుకు దూరంగా ఉండాలన్నది ధర్మాన ప్రసాదరావు ఆలోచనగా ఉందని ఆయనతో సన్నిహితంగా ఉండే వారు చెబుతున్న మాట! కానీ రాజకీయాల్లో అంత వేచి చూసే ధోరణ ఉంటే అప్పటిదాకా క్యాడరు నిలబడడం సాధ్యం కాదన్న వాస్తవాన్ని ఆయన గుర్తించడం లేదన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. క్యాడరు చేజారిపోతే మళ్లీ తిరిగి బలపడడం అంత తేలిక కాదని వీరు అంటున్నారు. ఆయన తనయుడు రామ్మనోహర్నాయుడు పట్ల పార్టీ వర్గాల్లో ఆశించిన స్థాయిలో సానుకూలత లేదు. మరో ఏడాదో, రెండేళ్ల ధర్మాన ప్రసాదరావు ఇదే వైఖరిని కొనసాగిస్తారని, ఆ తర్వాత మారిన అప్పటి రాజకీయ పరిణామాలకనుగుణంగా అడుగులు వేస్తారని ఆయన గురించి ఎరిగిన వారు చెబుతున్నారు.
క్యాడరు చూపు జనసేన వైపు..
ఈ పరిస్థితుల నేపథ్యంలో వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీలో ఉండాలా ? వద్దా? అనే డైలమాలో పడ్డారు. తమ నాయకుడు మౌనంగాను, పార్టీ వ్యవహారాలకు దూరంగాను ఉంటే తమ భవిష్యత్తు ఏమిటని వీలు సమాలోచనలు చేస్తున్నారు. ఆ జిల్లాలోను, శ్రీకాకుళం నియోజకవర్గంలోనూ ఈ పరిస్థితులను గమనిస్తున్న జనసేన నాయకులు ఇలాంటి నాయకులకు గాలం వేస్తున్నారు. ఇప్పటికే చాలామంది వైసీపీ శ్రేణులకు టీడీపీ అన్నా, ఆ పార్టీ నాయకులన్నా పొసగదు. అందువల్ల జనసేనలోకి వెళ్లడమే మంచిదన్న అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ కార్యకర్తలు, నాయకులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఒకపక్క కేసులను, మరోపక్క ప్రతీకార దాడులను చవి చూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ధర్మాన వంటి కీలక నేత పార్టీకి, క్యాడరుకు దూరంగా ఉండడం సరికాదన్నది వీరి అభిప్రాయంగా ఉంది. దీంతో అధికారంలో ఉన్న జనసేనలో చేరడం వల్ల కొన్ని పనులైనా చేయించుకోవచ్చన్న భావనలో ఉన్నారు. అలాంటి వారు జనసేన, టీడీపీల్లో చేరేందుకు మార్గాలను వెతుక్కుంటున్నారన్న ప్రచారం ఇటీవల కాలంలో ఊపందుకుంది. ఇలావుండగా ధర్మాన ప్రసాదరావు సోదరుడు కృష్ణదాసు వైసీపీ జిల్లా అధ్యక్షునిగా కొనసాగుతున్నారు. ఆయన మాత్రం పార్టీ కలాపాలను చూస్తున్నారు.