టెక్కలిలో వైసీపీ అభ్యర్థికి ఇంటిపోరు.. బరిలోకి భార్య
టెక్కలిలో వైసీపీకి సంకట పరిస్థితి ఎదురైంది. వైసీపీ నేతలకు కట్టుకున్న భార్యే ప్రత్యర్థిగా మారింది. దీంతో టీడీపీని ఎలా ఎదుర్కోవాలని వైసీపీ తలలు పట్టుకుంటుంది.
(శివరామ్)
వైసీపీకి కొరుకుడు పడని నియోజక వర్గాల్లో ఒకటైన శ్రీకాకుళం జిల్లా టెక్కలి లో ఆ పార్టీ ఇప్పుడు వింత పరిస్థితి ఎదుర్కొంటుంది. వైసీపీ టెక్కలి అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి ఆయనపైనే రెబల్‌గా పోటీ చేయనున్నట్లు తెలిసింది. గురువారం తన జన్మదినం సందర్భంగా అభినందనలు తెలియజేసేందుకు వెళ్లిన కార్యకర్తలకు ఆ విషయాన్ని ఆమె తెలియజేశారు .టెక్కలిలో రెబల్‌గా పోటీ చేస్తానని వైసిపి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ భార్య, టెక్కలి జడ్‌పీటీసీ అయిన వాణి అనుచరులకు చెప్పిన ఆడియో వైరలవుతోంది. ఈనెల 22న నామినేషన్ వేయనున్నట్లు ఆమె తెలిపారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలున్నాయి. భర్త శ్రీనివాస్‌పై గతంలో ఆమె వైపీపీ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారు. భార్యాభర్తలు విడివిడిగానే ఉంటున్నారు.
భర్తపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు
వాణి నేరుగా ముఖ్యమంత్రి జగన్‌ను కలసి భర్తపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వైసీపీ అధిష్టానం శ్రీనివాస్‌ను పక్కన పెట్టి వాణినే టెక్కలి ఇన్ఛార్జ్‌గా నియమించింది. ఆమెకు అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ గడప గడపకు కార్యక్రమాన్ని నియజకవర్గంలో బాగా చేసి పార్టీకి పేరు తెచ్చిపెట్టారు. వచ్చే ఎన్నికల్లో టెక్కలి టికెట్ ఆమెకే అని అప్పట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు కూడా. దీంతో అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పని చేస్తున్నారు.
2004లోనే కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ
రాజకీయ వారసత్వం నుంచి వచ్చిన వాణి 2004 లోనే అప్పటి హరిశ్చంద్రాపురం నియజకవర్గం కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేశారు. ఆమె తండ్రి సంపతిరావు రాఘవరావు 1985,1994,1996 ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్దిగా హరిశ్చంద్రాపురం నుంచి పోటీ చేశారు. సంపతిరావు రాజకీయ వారసురాలిగా ఆమె రాణించారు. భర్త దువ్వాడ శ్రీనివాస్ సైతం రాఘవరావు కుటుంబానికి ఉన్న పరపతితోనే రాజకీయాల్లోకి వచ్చారు. దువ్వాడ శ్రీనివాస్ గత ఎన్నికలలో శ్రీకాకుళం పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు కూడా భర్త గెలుపు కోసం వాణి శ్రమించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత శ్రీనివాస్‌కు ఎంఎల్సీ పదవి దక్కగా, టెక్కలి జడ్‌పీటీసీగా వాణి భారీ మెజారిటీతో గెలుపొందారు.
శ్రీనివాస్‌కే టికెట్
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో వాణిని నియోజకవర్గ ఇన్చార్జిగా తప్పించి భర్త శ్రీనివాస్‌కే వైసీపీ బాధ్యతలు అప్పగించింది. ఆయనకే టికెట్ ఖరారు చేసింది. పార్టీకోసం అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా కష్టపడిన తనను కాదని, తనకు ఒక మాట కూడా చెప్పకుండా, సంప్రదించకుండా శ్రీనివాస్‌కు టికెట్ ఇవ్వడం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ కారణంగానే స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయాలని నిర్ణయించారు.
ఇలా అయితే అచ్చెన్నను ఢీ కొనేదెలా?
వాణి పోటీ నిర్ణయం టెక్కలి వైసీపీని కుదిపేసింది. ఇప్పటికే టెక్కలిలో బలహీనంగా ఉన్న వైసీపీ.. వాణి రెబల్ దెబ్బతో మరింత ఇబ్బందులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. నియోజకవర్గంలో బలమైన ప్రత్యర్థి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడును ఇలా ఇంటిపోరుతో ఢీ కొనడం ఎలా అని వైసీపీ కార్యకర్తలే డీలా పడుతున్నారు. వైసీపీ అధిష్టానం జోక్యం చేసుకొని భార్యాభర్తల మధ్య సమస్యలను పరిష్కరించి ఆమెను బరిలో నుంచి తప్పించాలని కోరుతున్నారు.