దుమారం రేపుతున్న దువ్వాడ ఇంటిపోరు.. ఆందోళన తెలిపిన కూతుళ్లు
మళ్ళీ తెరపైకి దువ్వాడ ఇంటిపోరు. మా నాన్న మాకు కావాలంటున్న దువ్వాడ కుమార్తెలు. గంటలు నిరీక్షించినా బయటకు రాని దువ్వాడ. అసలేంటీ వివాదం..
దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి మధ్య మనస్పర్థలు ఉన్నాయని, వీరిద్దరు వేరువేరుగా జీవిస్తున్నారన్న విషయం పెద్ద రహస్యమేమీ కాదు. 2024 ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుంచి వీరిద్దరు ప్రత్యర్థులుగా పోటీ పడటానికి కూడా సిద్ధమయ్యారు. ఇప్పుడు వీరి ఇంటిపోరు మరింత ముదిరి రచ్చకెక్కింది. తమ తండ్రి తమకు కావాలంటూ దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి కుమార్తెలు రోడ్డెక్కారు. టెక్కలి నియోజకవర్గంలోని అక్కవరం గ్రామంలో జాతీయ రహదారిపై నిర్మించుకున్న ఇంట్లో దువ్వాడ నివాసం ఉంటున్నారు. అక్కడకు వెళ్లి ఆయన కుమార్తెలు ఆందోళన వ్యక్తం చేశారు.
గంటల తరబడి నిరీక్షణ
సాయంత్రం సమయంలో దువ్వాడ కుమార్తెలు.. ఆయన నూతన నివాసం దగ్గరకు చేరుకున్నారు. లోపలికి వెళ్లడానికి ప్రయత్నించగా సెక్యూరిటీ వారిని అడ్డుకున్నారు. ఎన్నిసార్లు ఫోన్లు చేసినా, మెసేజ్‌లు పెట్టినా దువ్వాడ తమకు రిప్లై కూడా ఇవ్వలేదని కుమార్తెలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ తండ్రి ఇంట్లోనే ఉన్నారని, కానీ కావాలనే తమను కలవడానికి ఇష్టపటంలో లేదని అన్నారు. వేరే మహిళతో కలిసి ఉంటూ కావాలనే తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని గంటల పాటు వారి ఇంటి బయటే నిరీక్షించారు.
‘నాన్నతో ఉండాలనుకుంటున్నాం..’
‘మాకు మా డాడి కావాలి. మేం మా నాన్నతోనే ఉండాలనుకుంటున్నాం. మా నాన్నకు చాలా సార్లు చెప్పాం. మా మంచి, చెడు నాన్నకు తెలుసు. ఆయన మరో మహిళ ట్రాప్‌లో పడ్డారు. ఆమే మా ఇంట్లో చిచ్చు పెట్టింది. మా డాడి పొలిటికల్ పవర్ వాడుకోవాలనే ఆ మహిళ దగ్గరైంది. మాకు న్యాయం చేయండి’’ అని దువ్వాడ హైందవి వివరించారు.
‘చెప్పుకోలేని బాధ’
ఈ విషయంపై దువ్వాడ వాణి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘బయటకు చెప్పుకోలేని బాధను అనుభవించా. ఒక క్యారెక్టర్ లేని వ్యక్తితో దువ్వాడ సంబంధం పెట్టుకోవడం చాలా బాధపెట్టింది. దువ్వాడ శ్రీనివాస్ పని వల్ల మా పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్లిపోయింది. దువ్వాడను ఇంటి నుంచి మేము పంపలేదు. పలాసలో కూడా మా పిల్లల పట్ల దువ్వాడ బ్రదర్స్ చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించారు. ఇప్పుడు పిల్లలు తమ తండ్రితో కలిసి ఉండాలని అనుకుంటున్నారు. ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాం. ఎన్నికల్లో కూడా దువ్వాడ గెలవాలనే పార్టీ పెద్దలు చెప్పగానే పోటీ నుంచి తప్పుకున్నా’’ అని వాణి చెప్పుకొచ్చారు.
దువ్వాడ గొడవతో వైసీపీకి తలనోప్పి
దువ్వాడ శ్రీనివాస్, దువ్వాడ వాణి మధ్య గొడవ ఇప్పుడు కొత్తదేమీ కాదు. వీరి మధ్య దాదాపు రెండేళ్లుగా మనస్పర్థలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికల సమయంలో కూడా ఇవి కనిపించాయి. వైసీపీ అధిష్టానికి దువ్వాడపై వాణిపై ఫిర్యాదు చేశారు. అప్పుడు టెక్కలి నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవి నుంచి దువ్వాడను తొలగించి వాణిని కూర్చోబెట్టింది వైసీపీ. దాంతో అనారోగ్యంతో బాధపడుతున్నా రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు వాణి. ఎమ్మెల్యే టిక్కెట్ కూడా తనకే అనుకున్న సమయంలో వైసీపీ ఊహించని షాక్ ఇచ్చింది. టెక్కలి ఎమ్మెల్యే అభ్యర్థిగా దువ్వాడను నిలబెడుతున్నట్లు ప్రకటించింది వైఎస్ఆర్‌సీపీ. దీంతో పార్టీకి రాజీనామా చేసిన వాణి.. స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలవాలని నిశ్చయించుకున్నారు. ఇంతలో వైసీపీ పెద్దలు కలుగజేసుకుని వాణికి నచ్చజెప్పి నామినేషన్ వేయకుండా ఆపారు.
అసలు వివాదం ఇదే..
అయితే దువ్వాడ వివాహేతర సంబంధం పెట్టుకున్నారన్న వివాదం రెండేళ్లుగా కొనసాగుతోంది. ఇందే అంశాన్ని పార్టీ అధిష్టానానికి చెప్పిన తర్వాత టెక్కలి ఇన్‌ఛార్జ్ పోస్ట్‌ను వైసీపీ.. వాణికి అందించింది. అప్పటి నుంచి దువ్వాడ వివాహేతర సంబంధానికి సంబంధించి ఎటువంటి సమాచారం బయటకు రాలేదు. మళ్ళీ ఇప్పుడు ఆయన కుమార్తెల ఆందోళనతో ఈ వివాదం వెలుగు చూసింది. అంతేకాకుండా కుమార్తెలు వచ్చినప్పుడు దువ్వాడ ఇంట్లో లేరన్న వాదన కూడా వినిపిస్తోంది. కానీ ఇంట్లో లైట్లు వెలుగుతూనే ఉన్నాయని, కాబట్టి దువ్వాడ ఇంట్లోనే ఉన్నారని కొందరు వాదిస్తున్నారు. ఇప్పటి వరకు కూతుళ్లు వచ్చిన సమయంలో దువ్వాడా ఇంట్లోనే ఉన్నారా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు.