భోగి మంటల్లో వైసీపీ మ్యానిఫెస్టో...
ఓ పార్టీ మ్యానిఫెస్టోను మరోపార్టీ దహనం చేయవచ్చా.. ఇది రూలు కాకపోవచ్చు గాని సంప్రదాయం కాదంటూ మండిపడుతున్న సోషల్ మీడియా.. విమర్శలకే పరిమితమైతే బాగుండేదా..;
ఆంధ్రప్రదేశ్ అంతటా సంక్రాంతి సందడి నెలకొంది. ఎన్నికల వేళ అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా వేడుకలు నిర్వహిస్తున్నాయి. టీడీపీ, జనసేన ఆధ్వర్యంలో రాజధాని ప్రాంతమైన మందడం గ్రామంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఊరు ఊరంతా సంక్రాంతి సందడి నెలకొంది. అయితే ఈ వేడుకల్లో అధికార వైసీపీకి చెందిన ఎన్నికల మ్యానిఫెస్టోను దహనం చేశారు. ఇలా చేయడం సబబా.. ఓ పార్టీ మ్యానిఫెస్టోను మరో పార్టీ తగులబెట్టవచ్చా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది.
అసలేం జరిగిందంటే...
రాజధాని గ్రామం మందడంలో నిర్వహించిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పాల్గొన్నారు. అమరావతి ఐక్యకార్యాచరణ సమితి, తెలుగుదేశం, జనసేన ఆధ్వర్యంలో ‘తెలుగు జాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. చంద్రబాబు, పవన్‌కు ఇరుపార్టీల శ్రేణులు, రాజధాని ప్రాంత రైతులు ఘన స్వాగతం పలికారు. ఆతర్వాత అసలు కథ మొదలైంది. నేతలిద్దరూ భోగిమంటలు వెలిగించారు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులు, అమరావతి వ్యతిరేక ప్రతులను, వైసీపీ మ్యానిఫెస్టో ప్రతులను మంటల్లో వేసి దహనం చేసి నిరసన తెలిపారు. ఇలా చేయడం సబబేనా అనేది ఇప్పుడు చర్చనియాంశమైంది.
చంద్రబాబు ఏమన్నారంటే..
వైసీపీ ప్రభుత్వ అసమర్థ, విధ్వంస విధానాలతో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. “అమరావతి రైతులు అడుగడుగునా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఐదేళ్లు వారికి చీకటి రోజులు. ‘తెలుగు జాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ చాలా మంచి కార్యక్రమం. జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో కలిసి రావడం చాలా సంతోషం. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాల ఉత్తర్వులు, అమరావతి వ్యతిరేక ప్రతులను భోగి మంటల్లో వేసి నిరసన తెలుపుతున్నా. ఈ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.. రాష్ట్రానికి మంచి రోజులు వస్తున్నాయి. దేవతల రాజధాని అమరావతిని రాక్షసులు చెరబట్టారు. శుభగడియలు తలుపు తడుతున్నాయి.. ‘వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్’ కోసం నేటి నుంచి 87 రోజుల పాటు కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా అందరూ ఒకే బాటలో పయనించాలి” అని చంద్రబాబు పిలుపిచ్చారు. ‘‘మన రాజధాని అమరావతే.. ఇది ఆంధ్రప్రదేశ్‌ను సస్యశ్యామలం చేస్తుంది. సంపద సృష్టించే కేంద్రంగా, సంక్షేమ పాలన అందించేందుకు ఉపయోగపడుతుంది. జగన్‌కు కూల్చడమే తెలుసు.. నిర్మించడం తెలియదు. పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి రైతుల పోరాడారు” అన్నారు చంద్రబాబు. అంతవరకు ఆగితే బాగుండేదని, మరో రాజకీయ పార్టీకి చెందిన మ్యానిఫెస్టోను దహనం చేయడమే సరిగా లేదని రాజకీయ విశ్లేషకుడు డి.పాపారావు అభిప్రాయపడ్డారు. అయితే గతంలో టీడీపీ మ్యానిఫెస్టోను కమ్యూనిస్టులు దహనం చేశారని గుర్తుచేశారు.
బీసీల ఉసురు తీస్తున్నారన్న పవన్ కల్యాణ్..
“రాష్ట్రాన్ని పునర్ నిర్మించుకోవాలి. రాజకీయ హింస, మోసపు హామీలతో జగన్ బడుగు బలహీనవర్గాల ఉసురు తీస్తున్నారు. 32 రోజులుగా అంగన్వాడీలు పోరాడుతున్నా పట్టించుకోవడం లేదు. పండగ పూట కూడా వారిని రోడ్డుపై ఉండేలా చేశారు. వైసీపీ పాలనలో రైతులు చాలా కష్టాలు పడ్డారు. గిట్టుబాటు ధర లేదు.. తుపాను వచ్చి నష్టపోయినా వారిని పట్టించుకోలేదు. యువతకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి. భవిష్యత్తులో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే బాధ్యతను టీడీపీ, జనసేన తీసుకుంటాయి’’ అని పవన్ కల్యాణ్ చెప్పినప్పుడు సభ చప్పట్లతో మార్మోగింది. తమ తపనంతా ప్రజల కోసమేనని, వైసీపీ అరాచకంగా పాలించిందని పవన్ కల్యాణ్ చెప్పినప్పుడు కూడా రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.