కొండపల్లి సీతారామయ్య తర్వాత చెవిరెడ్డే పెద్ద నక్సలైటంట!

‘నాపై వార్తలు రాసింది, సోషల్‌మీడియాలో పోస్టు చేసింది ఎవడ్రా? మీ ఇళ్లకు వచ్చి మీ కుటుంబసభ్యుల ముందే కాళ్లు, చేతులు విరుస్తా. ఏడేళ్లు నక్సలైట్‌గా పని చేసి వచ్చా..

Update: 2024-01-23 12:29 GMT
Chevireddy Bhaskar Reddy Image

‘పాతికేళ్ల లోపు కమ్యూనిస్టయినా, ఆ తర్వాత కమ్యూనిస్టు అయినా ఏదో లోపం ఉన్నట్టే’ అనే లోకోక్తి ఉంది. బహుశా ఆ కోవలోకి వచ్చిన వారే ఇప్పటి రాజకీయ నాయకుల్లో సుమారు 60, 70 శాతం మంది ఉన్నారు. అటువంటి వారిలో హహుశా.. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఒకరై ఉండొచ్చు.ఒకప్పుడు నేను కమ్యూనిస్టును, నక్సలైట్ ను అని చెప్పుకోవడం పెద్ద ఫ్యాషన్ కూడా. కమ్యూనిస్టు ఉద్యమం బలహీనపడి మితవాద అతివాదం రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో కమ్యూనిస్టు, నక్సలైటు వంటి పదాలు తిట్టు పదాలుగా మారాయి. ఈ కమ్యూనిస్టులు ఇంతేలే అనే ఈసడింపులు కూడా వచ్చాయి. అందుకేనేమో సీపీఎం మాజీ ప్రధాన కార్యదర్శి ఇఎంఎస్‌ నంబూద్రిపాద్‌.. ‘మాజీ కమ్యూనిస్టు నాజీ కన్నా ప్రమాదం’ అని పదే పదే చెప్పేవారు.

కొండపల్లి సీతారామయ్య లేకపోబట్టి సరిపోయింది...

1967లో సీపీఎం నుంచి చీలిన ఓ వర్గం నక్సలైట్లుగా అవతరించారు. చారు మజుందార్, కానూ సన్యాల్, కొండపల్లి సీతారామయ్య, చండ్రపుల్లారెడ్డి, తరిమెల నాగిరెడ్డి వంటి వారు వివిధ పార్టీల పేరిట విముక్తి పోరాటాలు నిర్వహించారు. ఆ విధానాలకు ఆకర్షితులైన అనేక మంది యువతీ యువకులు ఆనాడు ఆర్‌ఎస్‌యూ, పీడీఎస్‌యూ, డీఎస్‌ఓ, ఓపీడీఆర్ వంటి సంఘాల్లో పని చేశారు. బహుశా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా ఆ సంఘాల్లో పని చేసి ఉండొచ్చు. అంతమాత్రాన ఆయన నక్సలైట్‌ అయిపోడు. ఆయన పుత్రప్రేమ నక్సలిజం అయిపోదు. కాను సన్యాల్‌, కొండపల్లి సీతారామయ్య, చారుమంజుందార్‌ ఇప్పుడు ఉండి ఉంటే చెవిరెడ్డి భాస్కరరెడ్డి చేసినట్టు చెబుతున్న కామెంట్లు చూసి ముక్కున వేలేసుకునే వారో లేక వాళ్లే సిగ్గుపడేవారేమోనని అంటున్నారు సీనియర్‌ జర్నలిస్టులు.

చెవిరెడ్డి ఏ తరహా నక్సలైట్...

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్టు-లెనినిస్టు) లిబరేషన్ వంటి కొన్ని నక్సలైటు వర్గాలు న్యాయబద్ధమైన సంస్థలుగా ఉద్భవించి పార్లమెంటరీ ఎన్నికలలో పాల్గొంటున్నాయి. చెవిరెడ్డి ఏ సంఘం నుంచి వచ్చారో చెప్పకుండా నేను నక్సలైట్ ని అనే పదం వాడారు. మాజీ నక్సలైట్‌నని చెప్పుకునే చెవిరెడ్డి ఎన్నికల్లో పోటీ వైసీపీ ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు వాళ్ల అబ్బాయి మోహిత్‌రెడ్డిని ఎన్నికల బరిలోకి దించుతున్నారు. ఇంతవరకు ఎవరికీ అభ్యంతరం లేదు గాని ఏ నక్సలైట్ కూడా ఇతరుల్ని అదీ మీడియాను బెదిరించిన ఘటనలు లేవు. చెమడాలు వలిచేస్తా, తోలు తీసేస్తా లాంటి పదాలు మీడియావాళ్లను అని ఉండరు. కానీ చెవిరెడ్డి.. తనను, తన కుమారుణ్ణి విమర్శించినందుకు కొందరు జర్నలిస్టులపై విరుచుకుపడ్డారు. చెవిరెడ్డి చెలరేగిపోయారు. వ్యతిరేక వార్తలు రాస్తే కాళ్లూ చేతులు విరిచేస్తా, నేను మాజీ నక్సలైట్‌ను అని చెప్పుకుంటున్నారు చెవిరెడ్డి.

అసలేమైందంటే...

చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు మోహిత్‌రెడ్డిని విమర్శిస్తూ ఇటీవల సోషల్‌ మీడియాలో పోస్టులు వచ్చాయి. అవి వైరల్‌ అయ్యాయి. అందరికీ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ప్రసాదించే చెవిరెడ్డి సమాధానం చెప్పడానికి బదులు మీడియా వాళ్లతో చెడుగుడు ఆడుకున్నారు. ఇష్టానుసారంగా రాస్తూ పత్రికా స్వేచ్ఛ అంటే కుదరదని ఈ మాజీ నక్సలైట్‌ తీర్పు ఇచ్చారట. తిరుపతి పట్టణంలోని శ్రీకల్యాణవేంకటేశ్వర స్వామి కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఉందని 'చంద్రగిరి మండలం ప్రింట్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ మీడియా ప్రతినిధులకు' ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సమాచారం ఇవ్వడంతో 15 మంది పాత్రికేయులు అక్కడికి వెళ్లారు. ఆ మీటింగ్‌ అయిపోయిన తర్వాత వాళ్లందర్నీ తన ఇంటికి రమ్మన్నారట. ఇంటికి వెళ్లిన విలేకర్లపై రెచ్చిపోయారట. ‘నాపై వార్తలు రాసింది, సోషల్‌మీడియాలో పోస్టు చేసింది ఎవడ్రా? మీ ఇళ్లకు వచ్చి మీ కుటుంబసభ్యుల ముందే కాళ్లు, చేతులు విరుస్తా. ఏడేళ్లు నక్సలైట్‌గా పని చేసి వచ్చా. నాపై, నా కొడుకుపై తప్పుడు మెసేజ్‌లు పెడితే ఊరుకోను. సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తే కఠిన చర్యలుంటాయి. తలకిందులుగా వేలాడదీసి చర్మం వలుస్తా. దీనికోసం కొందరితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తున్నా’ అని అంటూ ఇద్దరు విలేకర్ల పేర్లను ప్రస్తావిస్తూ బెదిరించారు. అదేమని విలేఖర్లు ఎదురుతిరిగారట. దీన్ని ఏమాత్రం ఖాతరు చేయని చెవిరెడ్డి తన కుమారుడు మోహిత్‌రెడ్డిని తీసుకుని కార్లో వెళ్లిపోయారని తిరుపతి మీడియా కోడై కూస్తోంది.

Tags:    

Similar News