YCP SOCAL MEDIA| 'వర్రా' ముఠా నడిపిన యూట్యూబ్ ఛానళ్లు ఎన్నో తెలుసా?

వైసీపీ సోషల్ మీడియాలో ఓ విభాగం ఇన్చార్జ్ వర్రా రవీందర్ రెడ్డి ముఠా ఏకంగా 40 యూట్యూబ్ ఛానళ్లు నడిపింది. నోరు పట్టరాని భాషను వాడి పలువుర్ని అవమానించింది

Update: 2024-11-12 06:35 GMT
వర్రా రవీందర్ రెడ్డి ఫైల్ ఫోటో
వైఎస్ రాజశేఖరరెడ్డి భార్య విజయమ్మ, ఆమె కుమార్తె వైఎస్ షర్మిల, వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీతకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టమని ఎంపీ అవినాశ్ రెడ్డి చెబితేనే పెట్టినట్టు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి చెప్పారా? కర్నూలు రేంజి డీఐజీ కోయ ప్రవీణ్‌ అవుననే అంటున్నారు.
ఎంపీ అవినాశ్ రెడ్డి పీఏ బండి రాఘవరెడ్డి సమాచారం ఇచ్చేవారని, దానికనుగుణంగా తాను పోస్టులు పెట్టేవాణ్ణని వర్రా రవీందర్‌రెడ్డి తన వాంగ్మూలంలో చెప్పినట్టు వివరించారు. రాజకీయ ప్రత్యర్థుల మీద పోస్టులు పెట్టడంపై అవినాశ్ చెబితే రాఘవరెడ్డి డైరీలో రాసుకునే వారని, దాన్ని తనకు చెబితే దానికితగ్గట్టుగా వీడియోలు, రాతలు రాసేవాణ్ణని వర్రా చెప్పినట్టు సమాచారం.

జగన్‌ తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల, మాజీ మంత్రి వివేకా కుమార్తె సునీతపై అసభ్యకర పోస్టులు పెట్టడం వెనుక అవినాశ్ రెడ్డి, ఆయన పీఏ రాఘవరెడ్డి పాత్ర ఉన్నట్టు చెప్పాడన్నది పోలీసుల సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్, హోంమంత్రి అనిత సహా పలువురు ప్రముఖుల కుటుంబ సభ్యులే లక్ష్యంగా అసభ్య పోస్టుల పెడుతున్న వైసీపీ సోషల్ మీడియా ముఠా సభ్యులందర్నీ పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు.
నిందితులు వాడిన భాష చాలా దారుణంగా ఉంది. మహిళలపై అంత దారుణంగా పోస్టులు పెట్టేవాళ్లు. ఇలాంటి వారిని అరబ్‌ దేశాల్లోనైతే బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపేస్తారని పోలీసు అధికారులే చెబుతున్నారు. ఈ ముఠా కోర్టు న్యాయమూర్తులను వదల్లేదు. ఇలాంటి వారు రాష్ట్రంలో 45 మంది ఉన్నారు. పవన్‌కల్యాణ్, మంద కృష్ణమాదిగ తల్లులపైనా పోస్టులు పెట్టారు.
ఈ ముఠా కార్యకలాపాలు తాడేపల్లి లోని పీవీఆర్‌ ఐకాన్‌ బిల్డింగ్‌ మూడో అంతస్తులోని కార్యాలయం నుంచి సాగేవి. నిందితులకు ఏకంగా 40 యూట్యూబ్‌ ఛానళ్లు ఉన్నట్టు తేలింది. సునీత, షర్మిల ఇచ్చిన ఫిర్యాదులపై హైదరాబాద్‌లో కేసులు నమోదయ్యాయి. వాటిని విజయవాడకు బదిలీ చేస్తున్నారు. రవీందర్‌రెడ్డి గతంలో భారతి సిమెంట్‌ పరిశ్రమలో పనిచేశాడు. తర్వాత ఉద్యోగం మానేసి 2019లో సోషల్‌ మీడియా కో-కన్వీనర్‌గా చేరాడు.
వర్రా రవీందర్‌రెడ్డిపై వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగు పట్టణ పోలీసు స్టేషన్‌లోనూ కేసులు నమోదు అయ్యాయి. ప్రొద్దుటూరులో కూడా మరో కేసు నమోదైంది.
ఈ ముఠా నడిపిన యూట్యూబ్ ఛానళ్లలో పంచ్‌ ప్రభాకర్, వెంకటేశ్‌ బాడీ, బేతంపూడి నాని, కీసర రాజశేఖర్‌రెడ్డి, హరికృష్ణారెడ్డి కల్లం కీలక వ్యక్తులుగా వ్యవహరించారు. ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు భార్గవ్‌రెడ్డితో పాటు జగన్‌ సమీప బంధువు అర్జున్‌రెడ్డి పాత్ర ఉన్నట్లు తేలింది. వారిపైనా కేసులు నమోదయ్యాయి.
Tags:    

Similar News