YCP|అంబటి రాంబాబు ఇంట్లో అనితను తిట్టిన వైసీపీ సోషల్ మీడియా ఇన్చార్జీ

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల వేట కొనసాగుతోంది. ప్రస్తుత హోం మంత్రి అనిత పై అసభ్యకర పోస్టింగ్ పెట్టిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తను పోలీసులు పట్టుకున్నారు.

Update: 2024-11-13 09:53 GMT

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జీల అరెస్టుల పర్వం కొనసాగుతోంది. కొన్ని వందల మందికి ప్రస్తుత ప్రభుత్వ పోలీసులు ఇచ్చిన నోటీసులతో చాలా మంది పరారీలో ఉండగా కొందరు వైసీపీ (YSRCP) పెద్దనాయకుల ఇళ్లలో తలదాచుకుంటున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు (AMBATI RAMBABU) ఇంట్లో తలదాచుకున్న ఓ సోషల్ మీడియా ఇన్చార్జీని పోలీసులు నవంబర్ 13న అరెస్ట్ చేశారు.

మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంట్లో YCP సోషల్‌ మీడియా ఇన్చార్జీని నూజివీడు పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుత హోంమంత్రి వంగలపూడి అనితపై పల్నాడు జిల్లా నకరికల్లుకు చెందిన రాజశేఖర్‌రెడ్డి సోషల్‌ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టాడు. దీనిపై నూజివీడులో కేసు నమోదు అయింది. దీంతో నూజివీడు పోలీసులు గత కొంతకాలం ఈ రాజశేఖరరెడ్డి కోసం గాలిస్తున్నారు. సోదాలలో భాగంగా నకరికల్లులో రాజశేఖరరెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లారు. రాజశేఖరరెడ్డి ఓ పెద్దనాయకుడి ఇంట్లో తలదాచుకుంటున్నట్టు సమాచారం అందింది. ఎవరై ఉంటారా అని పోలీసులు ఆరా తీస్తున్న క్రమంలో అంబటి రాంబాబు స్పందించారు. రాజశేఖర్‌ రెడ్డి తమ ఇంట్లోనే ఉన్నాడని.. సంబంధిత ఆధారాలు ఉంటే అరెస్ట్ చేసుకోవచ్చన్నారు. దీంతో బుధవారం నూజివీడు పోలీసులు గుంటూరులో అంబటి ఇంటికి వెళ్లారు. ఫిర్యాదుకు సంబంధించిన ఆధారాలను చూపించి రాజశేఖర్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.
వంగలపూడి అనిత క్యారెక్టర్ ను అపహాస్యం చేసేలా రాజశేఖరరెడ్డి పోస్టింగులు పెట్టేవారని తెలిసింది. కొన్ని పోస్టులు మరీ అసభ్యంగా ఉన్నాయని కూడా పోలీసులు అంబటి రాంబాబుకు వివరించినట్టు సమాచారం.
గత వారం రోజుల్లో 147 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 680 మందికి నోటీసులు జారీ చేశారు. మరో 49 మంది అరెస్టు చేశారు. రాజకీయ ప్రముఖుల వ్యక్తిత్వాన్ని అపహాస్యం చేసేలా పోస్టులు పెడుతున్న వారిని అరెస్టులు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నా వైసీపీ వారి వాదన మాత్రం వేరుగా ఉంది. సోషల్‌ మీడియా కార్యకర్తలను పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. ఈమేరకు ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేసింది.
Tags:    

Similar News