టిడిపి కూటమి హేమా హేమీలపై మహిళా సింగాలను వదిలిన జగన్

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ మహా మహులపై వైఎస్సార్‌సీపీ మహిళా సింగాలను వదిలింది. వీరి నుంచి తప్పించుకుని గెలుస్తారా? లేక ఓటమి చెందుతారా అనేది చర్చగా మారింది.;

Update: 2024-03-17 07:03 GMT
Pavan, Lokesh, vanga geeta, lavanya

తెలుగుదేశం పార్టీ కూటమిపై వైఎస్సార్‌సీపీ మహిళా హేమాహేమీలను రంగంలోకి దించింది. రాష్ట్రంలో పేరున్న నాయకులపైనే మహిళలు పోటీకి దిగటంతో అందరి దృష్టి అటువైపు మళ్లింది. ప్రస్తుతం ఈ పోటీలు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశంలోని పలు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వారిలో కూడా చర్చకు దారితీసింది.

పిఠాపురంలో పవన్‌కళ్యాణ్‌పై వంగా గీత
వంగా గీత రాజకీయ చరిష్మా ఉన్న మహిళ. ఈమె 1983లో రాజకీయాల్లోకి వచ్చారు. మండల స్థాయి నుంచి పార్లమెంట్‌ వరకు అంచలంచలుగా ఎదుగుతూ వచ్చారు. వంగా గీత మహిళా రాజకీయాలకు బ్రాండ్‌గా కాకినాడలో పేరు తెచ్చుకున్నారు. ఎంతో మంది పేదలకు తన హయాంలో సాయం చేయించారు. ప్రస్తుతం ఆమె కాకినాడ ఎంపీగా ఉన్నారు. రాజ్యసభ సభ్యురాలుగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ప్రజల్లో మంచి పేరు ఉండటం, పిఠాపురంలో కాపు సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉండటంతో ఆమెను పిఠాపురం నియోజకవర్గానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ప్రకటించింది.
జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈయన గత ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీచేసి ఓటమి చెందారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కూటమిగా ఎన్నికల రంగంలోకి దిగారు. కె పవన్‌ కళ్యాణ్‌ ప్రముఖ సినీహీరో కావడం వల్ల ఆయన తెలియని వారు ఉండరు. కానీ వంగా గీతకు కాకినాడ పార్లమెంట్‌ స్థానంలోనే ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. పవన్‌ కళ్యాణ్‌ను ఎలాగైనా ఓడించాలనే ఆలోచనలో గీతను వైఎస్సార్‌సీపీ రంగంలోకి దించింది. ఇరువురూ కాపు సామాజిక వర్గానికి చెందిన వారే.
మంగళగిరిలో నారా లోకేష్‌ వర్సెస్‌ లావణ్య
మురుగుడు లావణ్య. ఈమె రాజకీయాలకు కొత్త. అయితే ఈమె మామ రాజకీయాల్లో తలపండిన వారు. మామ మురుగుడు హనుమంతరావు ప్రస్తుతం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీగా ఉన్నారు. కమల తల్లి కాండ్రు కమల మాజీ ఎమ్మెల్యే. గతంలో మంగళగిరి నియోజక వర్గం నుంచే గెలిచారు. విద్యావంతురాలైన లావణ్య మహిళ వీవర్స్‌ కమ్యునిటీకి చెందినది. మంగళగిరి నియోజకవర్గంలో లావణ్య ద్వారా వీవర్స్‌ కమ్యునిటీ ఓట్లు ఎక్కువగా రాబట్టుకోవచ్చని, మామ ద్వారా వచ్చే ఓట్లు కూడా తన గెలుపుకు కారణమవుతాయనే ఆలోచనలో ఆమె ఉన్నారు.
నారా లోకేష్‌ టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసి ఐదువేల పైచిలుకు ఓట్ల తేడాతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఓటమి చెందారు. వైఎస్సార్‌సీపీ ముందుగా మంగళగిరి నియోజకవర్గ ఇన్‌చార్జిగా గంజి చిరంజీవిని నియమించి ఆ తరువాత కమలను రంగంలోకి దించింది. ఇటీవలే తాను 50వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో గెలుస్తానని లోకేష్‌ ప్రకటించారు. వీరి మధ్య పోటీ రసవత్తరంగానే ఉంటుంది.
హిందూపూర్‌లో బాలకృష్ణమై దీపిక పోటీ
Delete Edit
హిందూపూర్‌ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ మూడోసారి రంగంలోకి దిగారు. ఇప్పటికి రెండు సార్లు గెలిచారు. ఎన్టీ రామారావు టీడీపీని పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకే నియోజకవర్గ ప్రజలు పట్టం కడుతున్నారు. మూడు సార్లు ఎన్‌టీ రామారావు గెలిచారు. ఒకసారి నందమూరి హరికృష్ణ గెలిచారు. రెండు సార్లు నందమూరి బాలకృష్ణ గెలిచారు. వీరు కాకుండా మిగిలిన వారు కూడా తెలుగుదేశం పార్టీ నుంచే గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్‌కు కానీ, ఇతర పార్టీలకు కానీ ఇప్పటి వరకు ప్రజలు చోటివ్వలేదు. అయితే ఇప్పుడు జగన్‌ వైనాట్‌ 175 అంటూ రంగంలోకి దిగిన నేపథ్యంలో తిప్పేగౌడ నారాయణ దీపికను బాలకృష్ణపై పోటీకి దింపారు.
దీపికి బెంగుళూరులో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా పనిచేసేవారు. ఆమె భర్త వేమిరెడ్డి. ఇరువురూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వేమిరెడ్డిది హిందూపూర్‌ మండలం బుడ్డంపల్లి గ్రామం కావడంతో వేమిరెడ్డికి నియోజకవర్గ ప్రజలతో సంబందాలు ఉన్నాయి. వేమిరెడ్డి మొదటి నుంచీ వైఎస్‌ఆర్‌కు ఫాలోవర్‌గా ఉండే వారు. ఆ తరువాత వైఎస్‌ జగన్‌కు ఫాలోవర్‌గా మారారు. బెంగుళూరులో వ్యాపారాలు చేస్తుంటారు. దాంతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంతో కూడా పరిచయాలు ఉన్నాయి. వ్యాపార సంబంధాలు ఉండటం వల్ల పెద్దిరెడ్డికి బాగా దగ్గరగా ఉంటారు. దీపిక కురుబ సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో బాలకృష్ణను ఓడించాలనే పట్టుదలతో వైఎస్‌ జగన్‌ ఈమెను రంగంలోకి దించారు.
విశాఖ నుంచి భరత్‌పై బొత్స ఝాన్సీ
విశాఖపట్నం పార్లమెంట్‌ నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ భార్య బొత్స ఝాన్సీని రంగంలోకి దించారు. బొత్స కుటుంబానికి ఉత్తరాంధ్రలో కొంత బలం ఉంది. బొత్స ఝాన్సి కూడా రెండు సార్లు విజయనగరం ఎంపీగా గెలిచి ఉత్తమ పార్లమెంటేరియన్‌గా అభినందనలు అందుకున్నారు. విజయనగరం జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా కూడా పనిచేశారు. మొదటి నుంచీ ఈమెకు రాజకీయ నేపథ్యం ఉంది. రాజకీయాల్లో ఎవరిపైనైనా ఢీ అంటే ఢీ అనే ధోరణిలోనే ముందుకు అడుగులు వేస్తున్నారు.
విశాఖ పార్లమెంట్‌కు గీతం విద్యా సంస్థల అధినేత బతుకుమిల్లి భరత్‌ను తెలుగుదేశం పార్టీ రంగంలోకి దించింది. ఈయన సినీ హీరో బాలకృష్ణకు స్వయాన అల్లుడు. గత ఎన్నికల్లో పోటీ చేసి ఎంవీవీ సత్యనారాయణపై ఓటమి చెందారు. తిరిగి టీడీపీ భరత్‌కే టిక్కెట్‌ కేటాయించింది. ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నది. భరత్‌కు విశాఖ నగరంలో అభిమానులు కూడా తక్కువేమి లేరు. తన విద్యా సంస్థలో చదువుకున్న విద్యార్థుల కుటుంబాలు కూడా అభిమానంగానే ఉంటున్నాయి. ప్రముఖ రాజకీయ వేత్త ఎంవీఎస్‌ మూర్తికి మనుమడు. మూర్తికి ప్రజల్లో ఎంతో మంచి పేరు ఉంది. ఎంపీగా విశాఖ నుంచి గెలిచి ప్రజల మన్ననలు పొందిన వాడు.
Tags:    

Similar News