ఏపీలో ముఠాల పాలన.. మరో కస్సుమన్న జగన్

ఆంధ్రప్రదేశ్‌లో హింసా రాజకీయాల పరిస్థితులు ఏమాత్రం మారలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి మండిపడ్డారు.

Update: 2024-08-04 13:35 GMT

ఆంధ్రప్రదేశ్‌లో హింసా రాజకీయాల పరిస్థితులు ఏమాత్రం మారలేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి మండిపడ్డారు. ప్రజాస్వామ్యబద్దమైన ప్రభుత్వం చేయాల్సిన పాలనన ఏపీలో మాత్రం ముఠాలు సాగిస్తున్నాయంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నా.. పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారంటూ మండిపడ్డారు జగన్. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో శాంతి భద్రతలను ఎంతో అద్భుతంగా నిర్వహించామని, కానీ ప్రభుత్వం మారిన రెండు నెలల్లోనే పరిస్థితు అన్నీ మారిపోయాయంటూ ధ్వజమెత్తారు. ప్రస్తుతం ప్రభుత్వం కేవలం తమ స్వలాభమే తప్ప ప్రజల, రాష్ట్ర లాభాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు భయంతో బిక్కు బిక్కుమంటున్నారని, ఎప్పుడు ఎవరు వచ్చి దాడి చేస్తారో అర్థం కాక బయటకు రావడానికి కూడా ఆలోచిస్తున్నారని అన్నారు. వీటిపై ప్రశ్నిస్తున్నందుకే వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ప్రతీకార రాజకీయాలను సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

అదే విధంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలు విషయంలో కూడా కూటమి ప్రభుత్వం కపట రాజకీయాలు చేస్తోందని వైసీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. మొన్నటి వరకు సూపర్ సిక్స్ అన్న చంద్రబాబు.. ఇప్పుడు వాటిని చూస్తేనే భయమేస్తోందని అసెంబ్లీలో చెప్పడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది వైసీపీ. ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపి తీరా అధికారం వచ్చిన తర్వాత వారికి నరకం చూపుతున్న నేత చంద్రబాబు ఒక్కరేనంటూ వైసీపీ నేతలు పలువురు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఉచిత బస్సు ప్రయాణం, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలెండర్లు, ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15000 అని అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి మహిళలను మోసం చేశారని, పైగా వాటి అమలు సాధ్యపడేలా లేదని సదరు మంత్రులే వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందని కూడా వైసీపీ నిలదీస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు హామీలు ఇచ్చేటప్పుడు తెలియలేదా అని కూడా ప్రశ్నించారు. ఈ మేరకు కూటమి సర్కార్‌ను ప్రశ్నిస్తూ ఆయన ఎక్స్(ట్విట్టర్)లో ఓ పోస్ట్ పెట్టారు.

‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోంది. ఈ 2 నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయింది. పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడంలేదు. ప్రభుత్వంలో పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు, అధికారంలో తమపార్టీ ఉందనే ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు రాష్ట్రంలో ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి. నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి జరిగిన హత్య, ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటన వీటికి నిదర్శనాలే. ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడంతో, ఎవరూ ప్రశ్నించకూడదని, రోడ్డుపైకి రాకూడదని ప్రజలను, వైసీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు. ఈ దారుణాల బాధితులకు అండగా ఉంటూ, పోరాటాన్ని కొనసాగిస్తాం’’ అని భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వ బాధితులకు వైసీపీ ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు.

Tags:    

Similar News