సినీ డైలాగులు చెప్పినా తప్పేనా చంద్రబాబు అని జగన్ ఎందుకన్నారు?
సినిమాల్లో డైలాగుల్నే మేమూ చెబుతున్నాం, అవి తప్పయితే పవన్ కల్యాణ్, బాలకృష్ణ సినిమాల్లోనూ తీసేయండి మరి అంటున్నారు వైఎస్ జగన్;
By : The Federal
Update: 2025-07-16 11:06 GMT
సినిమా డైలాగులు చెప్పినా.. పోస్టర్లు ప్రదర్శించినా కేసులు పెట్టేటట్టయితే వాటినీ ఆపేయమని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ మాట అన్నారు. డైలాగులు నచ్చకపోతే సెన్సార్ లో తీసేయండి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినిమాల్లో డైలాగులను తొలగించండని విజ్ఞప్తి చేశారు. రఫా, రఫా అనే డైలాగును వాడిన వారిపై కేసులు పెడతారా అని ఆయన ప్రశ్నించారు. ఆయన ఏమన్నారంటే..
"సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్‌కు పంపారు. సినిమా డైలాగ్‌లు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలి? ఆ డైలాగులు తీసేయండి. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి. ప్రెస్‌మీట్‌కు ముందు కొన్ని డైలాగులు చూపించారు. అవి ఇంకా దారుణంగా ఉన్నాయి. నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్‌లో తీసేయండి. సెన్సార్ బోర్డు ఉండేది ఎందుకు..? అంతేకానీ సినిమా రిలీజ్ అయిన తరువాత ఆ సినిమా డైలాగులు, మంచి పాటలు సహజంగానే ప్రసిద్ధి చెందుతాయి. సినిమాలో మంచి పాట ఉంటే ఆ పాట పాడినా తప్పే అంటావ్.. ఆ సినిమాలో మంచి డైలాగ్ నచ్చితే.. వాటిని పోస్టర్లుగా పెట్టినా తప్పే, మాట్లాడినా తప్పే.. వాళ్లు చేసిన యాక్షన్ వీళ్లు చేసినా తప్పే.. అలాంటప్పుడు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు.. ఆపేసేయండి, మూసేయండి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేదా అనేది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనమంతా" అన్నారు వైఎస్ జగన్.
"సినిమా డైలాగులు రాసుకుంటే రాసుకున్నాడు.. పాట పాడితే పాడాడు.. డైలాగులు కొడితే కొట్టినాడు వీళ్లకు వచ్చిన నష్టం ఏంటీ..? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా ప్రతీది వాళ్లు ఏమన్నా.. నిన్నే అన్నట్లుగా నువ్వెందుకు బాధపడుతున్నావ్..?
సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్‌కు పంపించారు. 131 మందికి నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు పేరు ఎవరు చెబితే వారిలో ఒక్కొక్కరిని పిలిపించుకోవడం, రోజంతా కూర్చోబెట్టుకోవడం, వేధించడం... చార్జ్‌షీట్లు గమనిస్తే అండ్ అదర్స్ అని ఖాళీగా వదిలిపెడతారు. అంటే వారికి నచ్చిన వారిని ఇనిస్టాల్‌మెంట్ బేసిస్ మీద ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇరిక్కించేదాని కోసమే కదా" అని జగన్ మండిపడ్డారు.
"స్థానిక ఎన్నికలు, మరో ఎన్నిక ఏదైనా వచ్చినప్పుడు అదర్స్ (others) అందరినీ జాయిన్ చేపించి, అందరినీ ఎలక్షన్స్ ముందు ఎత్తడం (Arrest). ఎందుకు ఇంత కుట్రలు చేస్తున్నారు? ప్రజాస్వామ్యంలో మంచి చేసి ప్రజల మనసులను గెలుచుకొని పాలన చేయాలి. అది సత్తా... అలా చేసి నువ్వు ఇలా అను (పుష్ప సినిమాలో మ్యానరిజం) అది సత్తా..
అంతేతప్ప.. నువ్వు అన్యాయమైన పాలన చేస్తూ, నిన్ను ఎవడైనా ప్రశ్నిస్తే వాళ్లు అలా అన్నారు. వీళ్లు ఇలా అన్నారని, అలా మాట్లాడారు, ఇలా మాట్లాడారని తీసేయడం స్టేషన్‌లో పెట్టడం ఏంటిది..?" అని ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ మండిపడ్డారు.
పోలీసుల దారుణాలు బాగా పెరిగిపోయాయన్నారు. చంద్రబాబు అనే వ్యక్తి మానవత్వం మరిచిపోయి వ్యవహరిస్తున్నారని, అలాగే కేసులు పెట్టిస్తున్నారని జగన్ ఆరోపించారు.