జైలుకెళ్లిన జగన్.. ఎందుకో తెలుసా!

సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వం తమ పద్దతి మార్చుకోవాలని మాజీ సీఎం జగన్ హితవు పలికారు. తమ నేతలపై తప్పుడు కేసులు పెట్టడం మానుకోవాలని, ప్రజా సంక్షేమంపై దృష్టి పెట్టాలని అన్నారు.

Update: 2024-07-04 12:23 GMT

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈరోజు నెల్లూరు జైలుకు వెళ్లారు. ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన మాచర్ల మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించడానికే జగన్.. నెల్లూరు జైలుకు వెళ్లారు. పిన్నెల్లిని పరామర్శించారు. భయపడొద్దని అన్యాయంగా ఎన్ని కేసులు పెట్టినా అంతిమ విజయం న్యాయానిదే అవుతుందని ధైర్యం చెప్పారు. పిన్నెల్లిని పరామర్శించి బయటొచ్చిన తర్వాత ఆయన మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చారంటూ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. వైసీపీ నేతలపై అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టి వేదిస్తున్నారని కూడా జగన్ విమర్శించారు. పిన్నెల్లిని కూడా అదే విధంగా తప్పుడు కేసులు పెట్టి నిర్బంధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం ఉందన్న అహంకారంతో టీడీపీ నేతలే తమపై దాడులు చేసి పైగా తమపైనే అబద్దపు కేసులు కూడా పెడుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు.

రావణకాష్టంలా రాష్ట్రం

‘‘మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వడంలో కానీ ఎందులోనూ కులం, మతం, పార్టీ అన్న అంశాలను పట్టించుకోలేదు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా మా ప్రభుత్వం పనిచేసింది. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం మాత్రం అన్ని విషయాల్లో తన, మన అన్న బేధాలను చూపుతుంది. తన ప్రతీకార రాజకీయాలతో రాష్ట్రాన్ని రావణకాష్టంలా చేస్తోంది’’ అని విమర్శించారాయన. ఇందులో భాగంగానే వైఎస్ఆర్ విగ్రహాలను కూడా తగలుబెట్టారని, ఈ పాపాలన్నీ శిశుపాలుడి పాపాల మాదిరిగా పెరుగుతున్నాయని, వచ్చే ఎన్నికల్లో వీటికి ప్రాయిశ్చిత్తం చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

ఈ రాజకీయాలు సరికాదు

‘‘ఎప్పుడైనా, ఏ రాష్ట్రంలో అయినా ప్రతికార రాజకీయాలు మేలు చేయవు. ఇప్పటికైనా దీనిని గుర్తించి సీఎం చంద్రబాబు తన ధోరణి మార్చుకోవాలి. ఇలాపూ ఏంటూ అతి త్వరలోనే ప్రజలకు చంద్రబాబుకు తగిన బుద్ది చెప్తారు. ఇకనైనా కళ్ళు తెరిచి మంచి పనులు చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి’’ అని చంద్రబాబుకు హితవుచెప్పారు జగన్ మోహన్ రెడ్డి. వైసీపీ లక్ష్యంగా టీడీపీ చేస్తున్న, చేయిస్తున్న దాడులను ఆపాలని చెప్పారు. టీడీపీ పాల్పడుతున్న దాడులకు, వారు పెడుతున్న తప్పుడు కేసులకు ఎవరూ భయపడొద్దని, పార్టీ శ్రేణుల వెన్నంటే తాను అండగా ఉంటానని, ఏ కేసు పెట్టినా న్యాయపోరాటం చేద్దామని పార్టీ కార్యకర్తలు, శ్రేణులకు ధైర్యం చెప్పారు.

వైసీపీ అందుకు ఓడిపోలేదు

‘‘ప్రజల్లో వ్యతిరేకత రావడం వల్ల వైసీపీ ఓడిపోలేదు. కూటమి ఇచ్చిన అలివిమాలిన హామీల వల్ల 10 శాతం మంది ఓటర్లు కూటమి వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు ఆ హామీలను అమలు చేయకపోతే ప్రజలు అదే తరహాలో బుద్ది కూడా చెప్తారు. సీట్ల సంఖ్య పరంగా మాత్రమే వైసీపీ బలహీనంగా ఉంది. ప్రతిపక్ష హోదా కూడా పొందలేకపోయింది. కానీ ప్రజావేదికపై మాత్రం 40శాతం ఓట్లు సాధించి అత్యంత బలమైన ప్రత్యర్థిగానే ఉంది. అలానే కొనసాగుతుంది కూడా’’ అని అన్నారు జగన్.

Tags:    

Similar News