విశాఖ క్రికెట్ స్టేడియంలో వైఎస్ పేరుకు ఎస‌రు !

2003లో ఏసీఏ-వీడీసీఏ పేరిట ఈ మైదానం ఏర్పాటు. 2009లో వైఎస్ మ‌ర‌ణానంత‌రం దానికి ఆయ‌న‌ పేరు జోడింపు. తాజాగా కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక తొల‌గింపు. ఆందోళ‌న‌కు దిగిన వైసీపీ శ్రేణులు. v;

Update: 2025-03-20 09:01 GMT
వైఎస్ పేరుతో ఉన్న విశాఖ క్రికెట్ స్టేడియం

దివంగ‌తులైన నేత‌లు పాల‌కుల చేష్ట‌ల‌కు బ‌ల‌వుతున్నారు. త‌మ పార్టీ వారు అధికారంలో ఉన్నంత కాలం దివంగ‌తులైన నాయ‌కులు త‌మ పేరు ప్ర‌తిష్ట‌ల‌కు ఢోకా లేకుండా నిశ్చింత‌గా ఉంటున్నారు. అధికారం కోల్పోయాక అప్ప‌టి వ‌ర‌కు ఒక వెలుగు వెలిగిన వీరు కొత్త‌గా పాల‌న ప‌గ్గాలు చేప‌ట్టిన వారి ప‌గ‌లు, ప్ర‌తీకారాలతొ ఆత్మ క్షోభకు గుర‌వుతున్నారు. కొంత‌కాలంగా రాష్ట్రంలో జ‌రుగుతున్న ఘ‌ట‌న‌లు, పాల‌కుల నిర్ణ‌యాల తీరుతెన్నుల‌ను చూస్తుంటే ఇందుకు ఏ పార్టీ మిన‌హాయింపు కాద‌నిపిస్తోంది. అధికారంలోకి వ‌చ్చాక ప్ర‌భుత్వ ప‌థ‌కాలు,, వివిధ ప్రాజెక్టులు, స్టేడియాలు, రిజ‌ర్వాయ‌ర్లు త‌దిత‌ర వాటికి త‌మ పార్టీలో స్వ‌ర్గ‌స్తులైన కీల‌క నేత‌ల పేర్లు పెట్ట‌డం ప‌రిపాటిగా మారింది. ఆ పార్టీ గ‌ద్దె దిగాక అప్ప‌టి వ‌ర‌కు ప‌థ‌కాల‌కు కొన‌సాగిన పేర్ల‌ను తొల‌గించి, ఆ స్థానంలో త‌మకు న‌చ్చిన నేత‌ల పేర్లు పెట్ట‌డం ఆన‌వాయితీ అయిపోయింది. పాల‌కులు రాష్ట్రంలో అభివ్రుద్ధిపై కంటే వీటిపైనే ఎక్కువ ద్రుష్టి పెడుతున్నారంటే అతిశ‌యోక్తి కాదు.

 

పేరు తొల‌గించాక స్టేడియం

గ‌త ఏడాది సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వైసీపీ ప్ర‌భుత్వం ఓట‌మి పాలై కూట‌మి స‌ర్కారు అధికారంలోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అప్ప‌ట్నుంచి గ‌త వైసీపీ ప్ర‌భుత్వంలో ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాల పేర్ల‌ను మార్చ‌కుంటూ వ‌చ్చింది. వైసీపీ పాల‌న‌లో దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పేరిట ఉన్న పేర్ల‌ను, అప్ప‌టి సీఎం వైఎస్ జ‌గ‌న్ పేరిట ఉన్న ప‌థ‌కాల పేర్ల‌ను మార్చేశారు. ఇప్ప‌డు ఒక‌డుగు ముందుకేసి దివంగ‌త వైఎస్ పేరిట ఏమేం ఉన్నాయ‌న్న దానిపై ఫోక‌స్ పెట్టారు. మూడు రోజుల క్రితం వైఎస్సార్ జిల్లా పేరుకు క‌డ‌ప‌ను జోడించి వైఎస్సార్ క‌డ‌ప జిల్లాగా మార్చాల‌ని కూట‌మి ప్ర‌భుత్వం మంత్రివ‌ర్గంలో నిర్ణ‌యించింది. వాస్త‌వానికి 2009లో వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణానంత‌రం అప్ప‌టి కాంగ్రెస్ ప్ర‌భుత్వం 2010లో వైఎస్సార్ క‌డ‌ప జిల్లాగా పేరు మార్చారు. 2019లో వైఎస్ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చాక క‌డ‌ప‌ను తొల‌గించి వైఎస్సార్ జిల్లాగా మార్పు చేశారు. గత ఐదేళ్ల‌లో వైఎస్సార్ జిల్లాగానే క‌డ‌ప జిల్లా కొన‌సాగింది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన తొమ్మిది నెల‌ల‌కు మ‌ళ్లీ వైఎస్సార్ జిల్లాకు క‌డ‌ప‌ను త‌గిలించారు. దీంతో త్వ‌ర‌లో మ‌ళ్లీ వైఎస్సార్ క‌డ‌ప జిల్లాగా మార‌నుంది.

మ‌ర‌ణానంత‌రం విశాఖ స్టేడియానికి వైఎస్ పేరు.. .

ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్‌, (ఏసీఏ) విశాఖ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేష‌న్ (వీడీసీఏ) వెర‌సి ఏసీఏ, వీడీసీఏల పేరిట 2003లో విశాఖ‌ప‌ట్నం పీఎం పాలెం జాతీయ ర‌హ‌దారికి ఆనుకుని క్రికెట్ స్టేడియం ఏర్పాటైంది. 2009 వ‌ర‌కు అదే పేరుతో కొన‌సాగింది. 2009 సెప్టెంబ‌ర్‌లో అప్ప‌టి ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి మ‌ర‌ణానంత‌రం అదే నెల 14న ఈ క్రికెట్ స్టేడియానికి డాక్ట‌ర్ వైఎస్ రాజశేఖ‌ర్‌రెడ్డి ఏసీఏ, వీడీసీఏ అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియంగా పేరు మార్చారు. ఏసీఏ చైర్మ‌న్‌గా ఉన్న గోక‌రాజు గంగ‌రాజు హ‌యాంలో ఈ స్టేడియానికి వైఎస్ పేరు పెట్టారు. అప్ప‌ట్నుంచి ఈ స్టేడియం ఆ పేరుతోనే న‌డుస్తోంది.

వైఎస్ పేరు తొల‌గింపుపై నిర‌స‌న‌కు దిగిన వైసీపీ శ్రేణులు

 

అనూహ్యంగా వైఎస్ పేరు తొల‌గింపు..

తాజాగా రెండు రోజుల క్రితం విశాఖ‌లోని అంత‌ర్జాతీయ‌ క్రికెట్ స్టేడియానికి ఉన్న వైఎస్సార్ పేరును తొల‌గించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ (ఏసీఏ) ఈ స్టేడియంలో కొద్ది రోజులుగా ఆధునికీక‌ర‌ణ ప‌నులు చేప‌డుతోంది. స్టేడియానికి మ‌ర‌మ్మ‌తులు చేస్తున్నారు. రంగులు వేస్తున్నారు. మ‌రోవైపు ఈ స్టేడియంలో ఈనెల 24, 30 తేదీల్లోరెండు ఐపీఎల్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో ఇన్నాళ్లూ ఈ స్టేడియంలో వివిధ‌ చోట్ల ఉన్న డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి ఏసీఏ, వీడీసీఏ స్టేడియం పేరులో వైఎస్సార్ పేరును లేకుండా చేశారు. దీంతో ఇప్ప‌డు ఈ స్టేడియం పేరు ఏసీఏ, వీడీసీఏ స్టేడియంగానే మిగిలింది. కానీ వైఎస్‌ పేరును తాము తొల‌గించిన‌ట్టు ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్ ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌క‌టించ‌లేదు. అయితే కూట‌మి నేత‌లు మాత్రం వైఎస్ పేరు తొల‌గింపును స‌మ‌ర్థిస్తున్నారు. గ‌తంలో వైసీపీ అధికారంలో ఉన్న‌ప్పుడు విజ‌య‌వాడ‌లోని హెల్త్ యూనివ‌ర్సిటీకి ఉన్న ఎన్టీఆర్ పేరును తొల‌గించి వైఎస్సార్ పేరిట మార్చ‌డాన్ని గుర్తు చేస్తున్నారు. అది త‌ప్పు కాన‌ప్పుడు ఇది త‌ప్పెలా అవుతుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు.

వైసీపీ శ్రేణుల ఆందోళ‌న‌..

ఈ సంగ‌తి తెలుసుకున్న వైసీపీ శ్రేణులు అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం కుట్ర‌లు, కుతంత్రాల్లో భాగంగానే క్రికెట్ స్టేడియానికి వైఎస్‌ పేరు తొల‌గింపు అంటూ మండి ప‌డుతున్నారు. ఇప్ప‌టికే దీనిపై నిర‌స‌న వ్య‌క్తం చేసిన ఆ పార్టీ నాయ‌కులు గురువారం ఉద‌యం స్టేడియం వ‌ద్ద ఉన్న వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి విగ్ర‌హానికి క్షీరాభిషేకం చేశారు. అనంత‌రం స్టేడియం వద్ద ఆందోళ‌న చేప‌ట్టారు. మాజీ మంత్రి, విశాఖప‌ట్నం జిల్లా వైసీపీ అధ్య‌క్షుడు గుడివాడ అమ‌ర్నాథ్ నేత్రుత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మ‌ల్యేలు, విశాఖ న‌గ‌ర మేయ‌ర్ గొల‌గాని హ‌రి వెంక‌ట కుమారి, కార్పొరేట‌ర్లు, విశాఖ జిల్లా ప‌రిష‌త్ చైర్‌ప‌ర్స‌న్ జె.సుభ‌ద్ర‌, పార్టీ వివిధ విభాగాలు, అనుబంధ సంఘాల నేత‌లు ఈ ఆందోళ‌న‌లో పాల్గొని నిర‌స‌న తెలిపారు. త‌క్ష‌ణ‌మే స్టేడియంలో తొల‌గించిన వైఎస్ పేరును పున‌రుద్ధ‌రించాల‌ని డిమాండ్ చేశారు.

 

గుడివాడ అమ‌ర్నాథ్

గుడివాడ అమ‌ర్నాథ్ ఏమ‌న్నారంటే..

వైఎస్ పేరు వింటేనే కూట‌మి నేత‌ల‌కు భ‌యం ప‌ట్టుకుంటోంది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన‌ప్ప‌ట్నుంచి రాష్ట్రంలో ప్ర‌తి చోటా వైఎస్ పేరును దుర్మార్గంగా తొల‌గిస్తున్నారు. ఇప్ప‌టికే విశాఖ‌లో సీత‌కొండ‌ వైఎస్సార్ వ్యూ పాయింట్‌కు ఆయ‌న పేరు లేకుండా చేశారు. విజ‌య‌వాడ తాడిగ‌డ‌ప మున్సిపాలిటీకి వైఎస్సార్ పేరును తొల‌గించారు. ఇటీవ‌లే వైఎస్సార్ జిల్లా పేరులో క‌డ‌పను చేర్చారు. ఇప్పుడు విశాఖ‌ప‌ట్నం క్రికెట్ స్టేడియానికి వైఎస్ పేరును తొల‌గించేశారు. ఇలా కూట‌మి నేత‌లు కుట్ర పూరితంగా ఎక్క‌డైనా వైఎస్ పేరును తొల‌గించ‌రేమో గాని ప్ర‌జ‌ల గుండెల్లో కొలువైన వైఎస్సార్‌ను తొల‌గించ‌గ‌ల‌రా? ఇప్ప‌టికైనా ఆంధ్ర క్రికెట్ అసోసియేష‌న్‌, కూట‌మి నాయ‌కులు కుతంత్రాలు మాని విశాఖ క్రికెట్ స్టేడియానికి వైఎస్ పేరును కొన‌సాగించాలి అని మాజీ మంత్రి, వైసీపీ విశాఖ జిల్లా అధ్య‌క్షుడు గుడివాడ అమ‌ర్నాథ్ డిమాండ్ చేశారు.

Tags:    

Similar News