YS SHARMILA|అసెంబ్లీకి వెళ్లనపుడు నీకూ నాకూ తేడా ఏముంది జగనన్నా?

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఆయన సోదరి, ఏపీసీసీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. అసెంబ్లీకి వెళ్లమని సలహా ఇచ్చారు.

Update: 2024-11-14 05:26 GMT
వైఎస్ షర్మిల (ఫైల్ ఫోటో)
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ఆయన సోదరి, ఏపీసీసీ (APCC) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. అసెంబ్లీకి వెళ్లకుండా ఇళ్లల్లో కూర్చుని ప్రెస్ కాన్ఫరెన్సులు పెట్టడమేమిటని ప్రశ్నించారు. జగన్ తీరు ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుందన్నారు. బడ్జెట్ బాగోలేదని, రాష్ట్ర ప్రజలకు ఉపయోగం కానీ బడ్జెట్ అని కాంగ్రెస్ పార్టీ, వైసీపీ కంటే ముందుగా ప్రెస్‌మీట్ పెట్టి చెప్పిందని.. తాము చెప్పిందే జగన్ మళ్లీ ప్రెస్‌మీట్ పెట్టి చెప్పాడన్నారు. సభలో మాట్లాడాల్సిన విషయాలను బయట మాట్లాడేందుకైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం మంచిదని సలహా ఇచ్చారు.
జగన్ పార్టీకి 38 శాతం ఓట్లు వచ్చినా.. అసెంబ్లీకి వెళ్ళనప్పుడు, వైసీపీకి కాంగ్రెస్ పార్టీకి పెద్ద తేడా ఏం లేదన్నారు. 38 శాతం ఓట్ షేర్ పెట్టుకొని అసెంబ్లీకి పోనీ వైసీపీని నిజానికి ఒక " గుర్తింపులేని (ఇన్ సిగ్నిఫికెంట్)" పార్టీగా మార్చింది జగనేనని షర్మిల విమర్శించారు. అసెంబ్లీలో అడుగు పెట్టలేని, ప్రజా సమస్యల కోసం సభల్లో పట్టుబట్టలేని, పాలకపక్షాన్ని అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేని, అసమర్థ వైసీపీ ఇవాళ రాష్ట్రంలో అసలైన "ఇన్ సిగ్నిఫికెంట్ పార్టీ" అన్నారు.
ప్రజలు వైసీపీకి ఓట్లు వేసింది ఇంట్లో కూర్చోవడానికి కాదన్నారు. సొంత మైకుల ముందు కాకుండా అసెంబ్లీ మైకుల ముందు మాట్లాడడానికే ప్రజలు వైసీపీకి ఓట్లు వేశారన్నారు. "మీకు చిత్తశుద్ది ఉంటే.. నిండు సభలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై సభ దద్దరిల్లేలా చేయండి" అని సూచించారు. ప్రతిపక్షం కాకపోయినా..11 మంది ప్రజాపక్షం అనిపించుకోండని సలహా ఇచ్చారు. ఇప్పటికీ అసెంబ్లీకి వెళ్ళే దమ్ము లేకుంటే రాజీనామాలు చేసి.. ఎన్నికలకు వెళ్ళాలని సవాల్ విసిరారు. అప్పుడు ఎవరు ఇన్ సిగ్నిఫికెంట్.. ఎవరు ఇంపార్టెంట్ తేలుతుంది అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని లేదా దమ్ముంటే అసెంబ్లీకి వెళ్లి బడ్జెట్‌పై చర్చించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలకు నిధుల కేటాయింపుపై నిలదీయాలన్నారు.
వైఎస్ షర్మిల ఈ డిమాండ్ చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ తన సోదరునికి ఈ సలహా ఇచ్చారు. చిన్నపిల్లల మాదిరి మంకు పట్టు పట్టడమేమిటని నిలదీశారు. ప్రజాసమస్యలు పరిష్కరించాల్సిన వేదికపై మాట్లాడకుండా ఇళ్లల్లోని సొంతమైకుల వద్ద ఎంతసేపు మాట్లాడితే ఏమి ప్రయోజనం అని ప్రశ్నించారు. వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్లాలని మరోసారి సలహా ఇచ్చారు.
Tags:    

Similar News