జగన్ బస్సెక్కిన విజయమ్మ.. షర్మిలకు టాటా చెప్పినట్టేనా?

కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి వైఎస్ విజయమ్మ ఇడుపులపాయకు వచ్చారు. ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.

Update: 2024-03-27 09:34 GMT
Source: Twitter

(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: ఎన్నికలకు సిద్ధం బస్సుయాత్ర ప్రారంభించడానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయకు చేరుకున్నారు. కుమారుడి వెంట తల్లి వైఎస్ విజయమ్మ కూడా వచ్చారు. తాను కుమారుడి వెంట ఉన్నానని సంకేతం ఇచ్చినట్లు కనిపించింది. ఇదే ఇప్పుడు చర్చకు ఆస్కారం కల్పించింది. 2024 ఎన్నికలకు అన్ని పార్టీలు శంఖారావం పూరించాయి.

యధావిధిగానే వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల నియోజకవర్గం ఇడుపులపాయకు బుధవారం మధ్యాహ్నం చేరుకున్నారు. అనంతరం తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్లో తండ్రి సమాధి వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబం ఏ కార్యక్రమం ప్రారంభించాలన్న ముందు ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్లో ప్రార్థనలు నిర్వహించడం సంప్రదాయంగా అనుసరిస్తున్నారు.


చర్చకు కారణం ఎందుకంటే

సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయానా బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి.. 2019 ఎన్నికల ముందే హత్యకు గురయ్యారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కుటుంబంలో అంతర్గత కలహాలకు బీజం పడింది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత రెడ్డి ఈ కేసును పులివెందుల కోర్టు నుంచి ఢిల్లీ స్థాయికి తీసుకెళ్లారు. ఈమెతో పాటు తల్లి వైఎస్ సౌభాగ్యమ్మ కూడా కన్నీటితో జగన్‌పై ఆరోపణలు సంధిస్తున్నారు. ఈమెకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తోడబుట్టిన చెల్లెలు వైఎస్ షర్మిల రెడ్డి కూడా సునీత రెడ్డికి అండగా నిలిచారు. అన్నయ్య జగన్ మోహన్ రెడ్డిపై ఆమె కూడా మాటల తూటాలు పేలుస్తున్నారు.

వైఎస్ఆర్‌సీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న వైఎస్ విజయమ్మను, ఆ పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. దాంతో ఆమె తన కుమార్తె వైఎస్ షర్మిల వెంట హైదరాబాద్ వెళ్ళిపోయారు. వైఎస్ షర్మిల వైఎస్‌ఆర్‌టీపీ పెట్టిన తర్వాత... " నేను పాప వెంట ఉండాల్సిన అవసరం ఉంది" అందుకే అక్కడికి వెళుతున్నా అని అప్పట్లో ఆమె వ్యాఖ్యానించారు. ఆ తర్వాత ఇడుపులపాయకు రావడం మినహా కుమారుడు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్లిన దాఖలాలు లేవు అని చెప్పవచ్చు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత ఆమె ఒక విధంగా మూగ సాక్షిగా అన్ని గమనించిన ఎక్కడ మాట్లాడిన దాఖలాలు కూడా లేవు. అలాగని కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెంతకు వెళ్లిన సందర్భాలు కూడా లేవనే చెప్పాలి.

"జగన్ బాబును మీకు అప్పగిస్తున్న"

2014, 2019 ఎన్నికలకు వెళ్లే ముందు కూడా ఆమె చెప్పింది ఒకటే. " జగన్ బాబును మీకు అప్పగిస్తున్న" అని గద్గద స్వరంతో చెప్పిన మాటలు వైఎస్ఆర్ అభిమానులు వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు ఇంకా మరవలేదు అనేది సత్యం. అంతేకాకుండా ఎన్నికల్లో కూడా ఆమె ప్రచార సారాధ్య బాధ్యతలు నిర్వహించడంలో కూడా కీలక పాత్ర వహించారు.


తర్వాత ఏమైంది?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత రాష్ట్రంలో ఆమె కదలికలు తక్కువ. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య తర్వాత కూడా ఆమె నోరు మెదపలేదు. ఆమె మౌనంగా అన్నీ భరిస్తూ వస్తున్నారు. మినహా, ఆమె ఘటనను ఖండించలేదు. కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. విషాద సంఘటనను, కుటుంబంలో చెలరేగిన వివాదాలను ఒకపక్క భరిస్తూ వచ్చారు. ఆ సమయంలో కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నిందిస్తున్నా నోరు మెదపలేని స్థితి ఆమెది. అలాగని మందలించిన దాఖలాలు కూడా లేవనే చెబుతారు. కుమారుడితో తల్లి విజయమ్మ దూరం పాటిస్తున్నారని మాటలు తరచూ వినిపించాయి.

ఎంతైనా తల్లి కదా!

ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ముందు కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెంట ఉండటానికి వైఎస్ విజయమ్మ ఇష్టపడతారు. ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్‌లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరం ఇతర కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేవారు. అందరి అంచనాలను, షికారు చేస్తున్న పుకార్లను వైఎస్ విజయమ్మ పటాపంచలు చేశారా? అంటే పరిస్థితి అదే అని భావిస్తున్నారు.

కుమారుడు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్రకు సిద్ధం అవుతున్న నేపథ్యంలో.. ఆమె ఇడుపులపాయలో ప్రత్యక్షమయ్యారు. కుమారుడితో కలిసి వైఎస్ విజయమ్మ భర్త దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధికి నివాళులర్పించారు. దీని ద్వారా " నేను జగన్ బాబు వెంటే ఉన్నాను" అనే సందేశం పంపిస్తున్నారా అనేది కూడా చర్చకు ఆస్కారం కల్పించింది. వైఎస్‌ఆర్ అభిమానులకు ఇదొక పెద్ద సందేశంగానే భావించాల్సి ఉంటుందనేది ఆమె వ్యవహార శైలి ద్వారా స్పష్టం చేసినట్లు కనిపిస్తోంది.

అయితే " పాప వెంట ఉండాల్సిన అవసరం ఉంది" అని తెలంగాణకు వెళ్లిన వైఎస్ విజయమ్మ ఈ ఎన్నికల కోసం జగన్ బాబు వెంట ఉండాలని వచ్చారా? అలాగైతే అన్నపై తిరుగుబాటు చేసిన పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరిస్థితి ఏంటి? వైయస్ఆర్ కుటుంబంలో ఆమె ఒంటరి అవుతారా? వైఎస్ విజయమ్మ కొడుకూ కూతురిని రెండు కళ్ళలా భావించి బుధవారం ఇడుపులపాయకు వచ్చారా? అనేది చర్చకు ఆస్కారం కల్పించింది. కుమార్తె పిీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఎన్నికల ప్రచార ఘట్టం ప్రారంభించడానికి తండ్రి వైఎస్ఆర్ ఘాట్‌కు వచ్చే అవకాశం ఉంది. ఆ సందర్భంగా కూడా ఇలాంటి పరిస్థితి కనిపిస్తుందో వేచి చూడాలి.

Tags:    

Similar News