ప్రభుత్వంపై పోరు బాటకు సిద్ధమైన వైఎస్‌ఆర్‌సీపీ.. ప్రణాళిక ఇదే
ప్రజల పక్షాన గొంతు విప్పాల్సిన సమయం వచ్చింది. అనుకున్న దాని కంటే ముందుగానే ఆసన్నమైంది. నేతలందరూ కీలక పాత్ర పోషించాలని జగన్ ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వంపై పోరుబాటకు వైఎస్‌ఆర్‌సీపీ సిద్ధమైంది. రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేస్తోన్న కూటమి ప్రభుత్వంపై ఆందోళనలకు సిద్ధం కావాలని ఆ పార్టీ శ్రేణులకు వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు ఇచ్చారు. రైతుల సమస్యలు, కరెంటు చార్జీలు, ఫీజు రియింబర్స్‌మెంట్ వంటి పలు అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపిచ్చారు. మండలం, నియోజక వర్గం, జిల్లా స్థాయిల్లో ఈ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తాడేపల్లి వైఎస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ నేతలతో బుధవారం సమావేశం అనంతరం ఆయన కార్యాచరణ ప్రణాళికను ప్రకటించారు. డిసెంబరు 11న రూ. 20వేల పెట్టుబడి సహాయం ఇవ్వాలని, ధాన్యానికి మద్ధతు ధర ప్రకటించాలని, ఉచిత పంటల బీమా పునరుద్ధరణ వంటి రైతుల సమస్యలపై ర్యాలీలు, కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించారు.
పెంచిన కరెంటు చార్జీలపై డిసెంబరు 27న ఆందోళనలు చేపట్టనున్నారు. కరెంటు చార్జీల పెంపును ఉప సంహరించుకోవాలని కోరు ఎస్‌ఈ కార్యాలయాలు, సీఎండీ కార్యాలయాలకు ప్రజలతో కలిసి వెళ్లి వినతి పత్రాలు సమర్పించనున్నారు. ఫీజు రియింబర్స్‌మెంట్ మీద జనవరి 3న ఆందోళనలు చేపట్టనున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి, వసతి దీవెన బకాయిలను ఇవ్వాలని కోరుతూ విద్యార్థులతో కలిసి జనవరి 3న కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లి వినతి పత్రాలు అందించాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని వైఎస్‌ఆర్‌సీపీ శ్రేణులకు జగన్ దిశా నిర్థేశం చేశారు. ప్రజల తరపున గళం విప్పాల్సిన సమయం వచ్చింది. అనుకున్న దాని కంటే ఆరు నెలలకే ఇలాంటి పరిస్థితి వచ్చింది. ప్రభుత్వంపై పోరాటంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని ఆదేశించారు.