మీ తెలివి ముందు పాదరసం కూడా పనిచేయదబ్బా..!

ఎలక్షన్ కమిషన్ ఎత్తులకు నాయకులు పైఎత్తులు వేస్తున్నారు. వాలంటీర్‌లను రాజీనామాలు చేయించి రంగంలోకి దించుతున్నారు.

Update: 2024-03-30 14:42 GMT
రాజీనామాలు సమర్పిస్తున్న వాలంటీర్లు

(ఎస్.ఎస్.వి. భాస్కర్ రావ్)

తిరుపతి: అధికార పార్టీ నాయకుల ఎత్తులు చూస్తే ఆశ్చర్యం కాదు.. అభినందించక తప్పదు. వారు మెదడు పాదరసం కంటే చురుగ్గా పనిచేస్తోంది. గెరిల్లా యుద్ధ తంత్రంలో వ్యూహం, ఎత్తుగడలే కాదు. మెదడు కూడా పాదరసంలా పనిచేయాలి. అప్పుడే యుద్ధంలో విజేతగా నిలవగలరు. దీర్ఘకాలిక ప్రయోజనాలు లక్ష్యంగా గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటయింది. దీనిపై ప్రతిపక్షాల ఆరోపణలు అధికార పార్టీకి లాభించింది. వాలంటీర్లను వినియోగించుకోవడంలో వేసిన ఎత్తుగడ ఎన్నికల కమిషన్ ఆంక్షలను చిత్తు చేసేలా ఉంది. అధికార- ప్రతిపక్షాల కూటమి మధ్య రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికలు గెరిల్లా తంత్రాన్ని తలపిస్తున్నాయి. అధికార పార్టీ నాయకులు వేస్తున్న ఎత్తులు చూసే విమర్శకులు సైతం ఔరా అని నోరెళ్ళ పెడుతున్నారు.

ప్రతిపక్షం చేస్తున్న విమర్శలను సొమ్ము చేసుకోవడంతో పాటు గ్రామ సచివాలయ వాలంటీర్లను వ్యూహాత్మకంగా రాజీనామాల బాట పట్టిస్తున్నారు. ఇంకొన్ని చోట్ల ఒత్తిళ్లు తట్టుకోలేక కొందరు వాలంటీర్లు రాజీనామాలకు సంసిద్ధమయ్యారు. ఈ రెండు వేరు వేరు సంఘటనలకు చిత్తూరు జిల్లా వేదికగా నిలిచింది. బహుశా చాలా జిల్లాల్లో ఈ తరహా వ్యూహం అమలు చేయడానికి ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. పరిపాలన సంస్కరణలో ఇద్దరినీ రాష్ట్రంలో అభినందించక తప్పదు. ఆ కోవలో..

చరిత్ర మరిచిపోని వ్యక్తులు

ఇక్కడ ఒక విషయం ప్రస్తావించుకోవాలి. పరిపాలన వికేంద్రీకరణ చేయాలి అనే ఆలోచనతో టిడిపి వ్యవస్థాపకుడు అప్పటి సీఎం ఎన్టీ రామారావు మండలాల వ్యవస్థను అమల్లోకి తెచ్చారు. సుదీర్ఘ విరామం తరువాత గ్రామ సచివాలయాలు తీసుకువచ్చి.. వైయస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వికేంద్రీకరణలో తనదైన ముద్ర వేసుకున్నారు.

మండలాల వ్యవస్థకు బీజం

25 మే 1985 తేదీ. తెలుగు జాతి మరచిపోలేని సందర్భం ఇది. టిడిపి వ్యవస్థాపకుడు, సీఎం ఎన్టీ రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలన వికేంద్రీకరణకు బీజం వేశారు. తాలూకా స్థాయిలో ఉన్న సమితులను రద్దుచేసి నియోజకవర్గంలోని నాలుగు ఐదు మండలాలుగా విభజించి ఎంపీడీవో, తహసిల్దార్ల వ్యవస్థ తీసుకొని వచ్చారు. రాష్ట్ర యువజన అనంతరం నవ్యాంధ్రలో 679 మండలాలు మిగిలాయి. ఈ మండల వ్యవస్థ ద్వారా పరిపాలన చిన్న పట్టణాల చెంతకు చేరింది. సుధీర్ఘ విరామం తర్వాత..

ప్రభుత్వ పథకాలు అందిస్తున్న వాలంటీర్లు (ఫైల్)

ఇంటి వద్దకే పథకాలు..

ఎన్టీ రామారావు ప్రభుత్వం తర్వాత కాల గమనంలో 39 సంవత్సరాలకు ఒక చారిత్రాత్మక నిర్ణయానికి బీజం పడింది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి నవరత్న పథకాలతో పాటు నిరుద్యోగులకు కూడా హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే సీఎం హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. 2019 అక్టోబర్ 2వతేదీన వార్డు సచివాలయాలకు శ్రీకారం చుట్టారు. అన్ని లాంఛనాలను పూర్తి చేసిన తర్వాత 2021 అక్టోబర్‌లో 15,004 గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశారు.

అలాగే రాష్ట్రంలో 16 కార్పొరేషన్లు, 77 మున్సిపాలిటీలు, 32 నగర పంచాయతీలు ఉన్నాయి. వీటన్నిటి పరిధిలో ఇంటి ముంగిటకే పరిపాలన తీసుకువచ్చింది. అన్ని విభాగాలు అందుబాటులో ఉండే విధంగా రాష్ట్రంలో 1,26,649 నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించి ప్రజలకు అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలో 3.2 కోట్ల మందికి ప్రభుత్వ పథకాలు అందించడానికి వీలుగా 50 ఇండ్లకు ఒకరిని కేటాయిస్తూ రూ.5 వేల గౌరవ వేతనంతో పనిచేయడానికి 2,54,832 వాలంటీర్లు నియమితులయ్యారు.

మూడేళ్ల కాల గమనంలో గ్రామ సచివాలయల ద్వారా ప్రజలకు పథకాలు, అందుతున్నాయి. చాలాచోట్ల చోటుచేసుకుంటున్న పరిణామాలపై ప్రతిపక్షాలు మండిపడుతూనే ఉన్నాయి. వాలంటీర్లను అడ్డుపెట్టుకుని ఇతరత్రా కార్యక్రమాలు సాగిస్తున్నారంటూ ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శిస్తున్నాయి. వారాహి యాత్ర సందర్భంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వాలంటీర్లు అగ్గి మీద గుగ్గిలమయ్యారు.

ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడు ఎన్ చంద్రబాబు నాయుడు ఎన్నికల వేళ చేసిన వ్యాఖ్యలతో.. వ్యతిరేకత మూట కట్టుకున్నారు. నష్ట నివారణ చర్యలో భాగంగా బస్సు యాత్రలో..." మా ప్రభుత్వం వస్తే వాలంటీర్లను తొలగించం. అప్రజాస్వామికంగా వ్యవహరిస్తే ఉపేక్షించే సమస్యే లేదని హెచ్చరించారు. తామ అధికారులకు వచ్చిన తర్వాత ఐదు వేల గౌరవ వేతనాన్ని రూ.50 వేలు సంపాదించుకునే రీతిలో స్కిల్ డెవలప్మెంట్ ఇప్పిస్తాం’’ అని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయినా వాలంటీర్లు అభద్రతాభావంలోనే ఉన్నారు. ఇది వేరే సంగతి. అసలు కథ ఇక్కడే ఉంది..

ఎలక్షన్ కమిషన్ ఆంక్షలు

ప్రారంభం నుంచి వాలంటీర్ల వ్యవస్థ పై ప్రతిపక్షాలు సందేహాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. ప్రభుత్వ ధనం ఖర్చు చేస్తూ పార్టీ కార్యక్రమాలకు వాడుకుంటున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో వీరిని దూరంగా ఉంచాలనే వరకు పరిస్థితి వెళ్ళింది. ఫిర్యాదుల పరిశీలన నేపథ్యంలో.. ఎన్నికల సంఘం కూడా తీవ్రంగానే స్పందించింది. ఎన్నికల వేళ వాలంటీర్లను దూరంగా ఉంచాలని ఆదేశించింది. ఇదే విషయంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కూడా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఇది పరిపాలన వ్యవహారమే. దీంతో ఎన్నికల్లో గ్రామ సచివాలయ వాలంటీర్లు సేవలు అందించేందుకు అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల కమిషన్ వేసిన ఎత్తును ఏం చేశారంటే..

ఏం మైండ్ రా బాబు

వాలంటీర్లు ప్రభుత్వ పథకాలను పంపిణీ చేయడమే కాకుండా, పార్టీకి ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎన్నికల కమిషన్ ఆంక్షల నేపథ్యంలో.. వైఎస్ఆర్సిపి నాయకుల్లో కొత్త ఆలోచనకు తెర తీసింది. ఎలాగో మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందని ధీమాతో వైఎస్సార్సీపీ నాయకులు ఉన్నారు. ఆ ధైర్యంతోనే గ్రామాల్లో ఉన్న వార్డు సచివాలయ వాలంటీర్లతో రాజీనామాలు చేయిస్తున్నట్లు పరిస్థితి చెప్పకనే చెబుతోంది. వార్డు ఏజెంట్లుగా కూర్చుంటారని ప్రకటించారు.

ఉద్యోగ భద్రత కల్పించాలంటున్న వలంటీర్లు (ఫైల్)

ఇదే సాక్ష్యం...

చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వీకోట మండలం కంబార్లపల్లి గ్రామ సచివాలయంలో 14 మంది వార్డు వాలంటీర్లు రాజీనామా చేశారు. పలమనేరు సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడది కూడా ఇదే మండలం కావడం గమనార్హం. సార్వత్రిక ఎన్నికల్లో తాము ఎమ్మెల్యే కోసం పనిచేస్తామంటూ వారందరూ బహిరంగంగానే ప్రకటించారు. వైఎస్ఆర్సిపి నాయకులు తమ మెదడులను ఎంత పాదరసంలా ఉపయోగిస్తున్నారనేందుకు ఇదే సాక్ష్యం. ఇది ఒకటే కాదు చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం అందుతోంది.

రాజీనామా చేయండి

సత్యవేడు నియోజకవర్గం వరదయ్యపాలెం మండలంలో కూడా వాలంటీర్లను రాజీనామా చేయమని మండల ఆర్గనైజర్ ఒత్తిడి చేస్తున్నట్టు సోషల్ మీడియాలో సంభాషణ వైరల్ అవుతోంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వాలంటీర్లు రాజీనామా చేసి రావాలని ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి ఆదేశించినట్లు సమాచారం. మళ్లీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వస్తుంది, మళ్లీ మిమ్మల్ని తీసుకుంటాం అని భరోసా ఇస్తున్నారు అంట. ఎన్నికలు సమీపించే కొద్ది ఇలాంటివి ఎన్ని చూడాల్సి వస్తుందో!

Tags:    

Similar News