కడప స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ జయభేరి
కడప జిల్లా పరిషత్ ను వైఎస్సార్సీపీ తిరిగి గెలుచుకుంది. 8 ఉప సర్పంచ్ లకు ఎన్నికలు జరిగితే ఐదు చోట్ల వైఎస్సార్సీపీ, మూడు చోట్ల టీడీపీ మద్దతు దారులు గెలిచారు.;
కడప జిల్లా పరిషత్ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ జిల్లా పరిషత్ స్థానాన్ని దక్కించుకుంది. గతంలోనూ వైఎస్సార్సీపీ కడప జిల్లా పరిషత్ లో వైఎస్సార్సీపీ జెండాను ఎగుర వేసింది. సాధారణ ఎన్నికల వరకు కడప జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్న ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డి రాజంపేట అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి, కడప జిల్లా పరిషత్ చైర్మన్ స్థానానికి ఆయన రాజీనామా చేశారు. ఈమేరకు ఏర్పడిన ఖాళీకి గురువారం ఎన్నిక జరిగింది.
జడ్పీ చైర్మన్ ఎన్నిక కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసిన వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ హాజరైన సభ్యుల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థిని ప్రతిపాదించాల్సిందిగా కోరారు. దీంతో పోరుమామిళ్ల జడ్పీటీసీ సభ్యుడు ముత్యాల ప్రసాద్, అలియాస్ చెన్నయ్య, వేముల జడ్పీటీసీ సభ్యుడు కోకటం వెంకట బయ్యపురెడ్డి లు బ్రహ్మంగారి మఠం జడ్పీటీసీ సభ్యులు ముత్యాల రామగోవిందరెడ్డి పేరును ప్రతిపాదించారు. ఆ తరువాత వారు ఆయన పేరును బలపరిచారు. ఆ తరువాత వేరే వారి నుంచి అభ్యర్థనలు రాలేదు. కలెక్టర్ మూడు సార్లు కోరినా మరో నామినేషన్ రాకపోవడంతో రామగోవిందరెడ్డి గెలిచినట్లు ప్రకటించారు. అనంతరం కలెక్టర్ రామగోవిందరెడ్డిని జిల్లా పరిషత్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయంచారు. తరువాత జిల్లా పరిషత్ సీఈవో ఓబుళమ్మ, కలెక్టర్లు కలిసి చైర్మన్ కు పుష్పగుచ్చం ఇచ్చి అభినందించారు.
50 మందికి 41 మంది హాజరు
కడప జిల్లా పరిత్ సభ్యులు మొత్తం 50 మంది కాగా వారిలో ఒకరు తెలుగుదేశం పార్టీ ద్వారా గెలిచారు. మిగిలిన 49 మంది వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన వారే. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలు ఖాళీ ఏర్పడటంతో 48 మంది మాత్రమే ఉన్నారు. గోపవరం మండల జడ్పీటీసీ సభ్యులు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు. కాగా ఓబులవారిపల్లె, చిన్నమండెం, వీరపునాయునిపల్లె, మద్దులూరు, జమ్మలమడుగు జెడ్పీటీసీలు పార్టీ పిరాయించి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరంతా ఎన్నికలో పాల్గొనలేదు. వేంపల్లె జడ్పీటీసీ సభ్యుడు రవికుమార్ రెడ్డి తల్లి మృతి కారణంగా ఎన్నికకు హాజరు కాలేదు. మొత్తం 48 మందిలో ఏడుగురు హాజరు కాలేదు. 41 మంది హాజరయ్యారు.
మాకు తగిన బలం లేనందున ఎన్నికల్లో పోటీ చేయలేదని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు. కడప మేయర్ విషయంలో తెలుగుదేశం పార్టీ రాజకీయ పావులు కదుపుతోంది. కార్పొరేషన్ లో కూడా ఒక్కరు మాత్రమే తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు. మిగిలిన వారంతా వైఎస్సార్ సీపీ నుంచి గెలిచిన వారే కావడం విశేషం. కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి కడప వైఎస్సార్సీపీ మేయర్ సురేశ్ బాబును పదవీ చ్యుతుడిని చేసేందుకు పావులు కదుపుతున్నారు. ఎంతవకు తెలుగుదేశం వారు సక్సెస్ అవుతారో వేచి చూడాల్సిందే.
ఐదు పంచాయతీల్లో వైఎస్సర్సీపీ మద్దతు దారుల గెలుపు
వైఎస్సార్ కడప జిల్లాలో ఎనిమిది పంచాయతీల్లో ఉప సర్పంచ్ పదవులకు ఎన్నికలు జరిగాయి. పంచాయతీల్లో జరిగే ఎన్నికలు పార్టీ రహితంగా ఉంటాయి. పార్టీ గుర్తులు లేకపోయినా పార్టీ బలరిచిన వ్యక్తులు మాత్రమే గెలుస్తారు. ఎనిమిది పంచాయతీ ఉప సర్పంచ్ ల్లో బ్రహ్మంగారి మఠం మండలం గొల్లవీడు నుంచి బద్వేల్ రామలక్ష్మమ్మ, కమలాపురం మండలం కోగటం నుంచి కనపర్తి రమణమ్మ, సింహాద్రిపురం మండలం నుంచి అంకాలమ్మ గూడూరు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ గా చల్లా శివస్వప్న, ఎర్రగుంట్ల మండలం తుమ్మలపల్లె ఉప సర్పంచ్ గా గొర్ల తులశమ్మ, చిర్రాజుపల్లె ఉప సర్పంచ్ గా యెద్దలపల్లె సుబ్బమ్మ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వీరంతా వైఎస్సార్సీపీ మద్దతు దారులు.
కాగా తెలుగుదేశం పార్టీ బలపరిచిన చెన్నూరు మండలం ముండ్లపల్లె కు చెందిన షేక్ అబ్దుల్లా, దువ్వూరు మండలం ఇడమడక ఉప సర్పంచ్ గా ముద్దం లక్ష్మీదేవి, సీకే దిన్నె మండలం బసిరెడ్డి పల్లె గ్రామ ఉప సర్పంచ్ గా డి వెంకటరమణారెడ్డిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల సందర్భంగా జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగలేదు.