Mid-day meal scheme | మధ్యాహ్న భోజనంలో జోనల్ వ్యవస్థ
పిల్లలకు ప్రాంతీయ వంటకాలే వడ్డించనున్నారు.ఇంటర్ విద్యార్థులకు ఇచ్చిన హామీ నిలుపుకున్నారు. దీనికోసం పీయూసీఎల్ చేసిన ప్రయత్నం ఏమిటి?
Byline : SSV Bhaskar Rao
Update: 2024-12-20 03:56 GMT
రాష్ట్రంలో విభిన్న ప్రాంతాల ఆహార అలవాట్లను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. పాఠశాలల్లో సంక్రాంతి పండుగ సెలవుల తర్వాత మధ్యాహ్న భోజన పథకంలో కొత్త మెనూ అమల్లోకి రానుంది. దీంతో
రాష్ట్రంలోని 69,182 ప్రాధమిక స్థాయి నుంచి హైస్కూళ్లలోని 60.91.634 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం యథావిధిగానే అందుతుంది. అదనంగా..
2014-19లో మాదిరే సీఎం ఎన్. చంద్రబాబు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా ఈ పథకం వర్తింపచేయడానికి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు ఈ పథకం రద్దు చేసింది. కాగా, 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ ప్రధాన కార్యదర్శి హోదాలో యువగళం పాదయాత్రలో నారా లోకేష్ "ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజన పధకం వర్తింప చేస్తా" అని హామీ ఇచ్చారు. ఆ మేరకుఇంటర్ కాలేజీల్లో గత ప్రభుత్వం రద్దు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందుకోసం..
నిధులు ఇలా...
-2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు మొదటి ఏడాది రూ.27.39 కోట్లు, రెండో ఏడాదికి రూ.85.84 కోట్ల బడ్జెట్ అంచనాలతో 2024 డిసెంబర్ నుంచి 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమం అమలు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
-రాష్ట్రంలో 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి.
-వీటిలో 300 కాలేజీలు ఉన్నత పాఠశాలల ప్రాంగణాలతో కలిసి ఉన్నాయి.
-ఆ పాఠశాలల్లోని వంటచేసే వారి ద్వారానే విద్యార్థులకు భోజనం అందిస్తారు.
-మిగిలిన 175 కాలేజీలకు సమీపంలోని పాఠశాలల నుంచి పంపిస్తారు.
-ఈ పథకం పునరుద్ధరణతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని 1.41 లక్షల మంది విద్యార్థులకు మేలు జరగనుంది.
ఫలించిన ప్రయోగంతో..
టీడీపీ కూటమి ప్రభుత్వం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకంలో ఈ పాటికే ప్రయోగాత్మకంగా రెండు జిల్లాల్లో అమలు చేసింది. అక్కడ సత్ఫలితాలు రావడంతో రాష్ట్రంలో ఇదే పద్ధతి అమలు చేయడానికి వీలుగా నాలుగు జోన్లుగా విభజించారు.
రాష్ట్రంలో ఒకో ప్రాంతంలోని ఆహారపు అలవాట్లు మరో ప్రాంతంలో కనిపించవు. పెద్దలే కాదు. పిల్లలకు కూడా ఈ పద్ధతి అలవాటైంది. అందులో రాయలసీమ, నెల్లూరు, కోస్తా, ఉత్తరాంధ్ర ఆచార వ్యవహారాలే కాదు. అలవాట్లు పరస్పర విరుద్ధంగా ఉంటాయి. ఈ విషయాన్ని పాఠశాల శాఖ ఆలస్యంగా పరిగణలోకి తీసుకుంది. ఆ మేరకు పాఠశాలల్లో విద్యార్థులకు ప్రాంతాల వారీగా వారి ప్రాంతంలోని వంటకాలే మధ్యాహ్న భోజన పథకంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఏడాది నవంబర్ ఐదో తేదీ జరిగిన రాష్ట్ర స్థాయి వర్క్ షాపులో ఓ నిర్ణయం జరిగింది. ప్రాంతాల వారీగా మొదట గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ పద్ధతి అమలు చేశారు. దీనికి విద్యార్థులు సంతృప్తి చెందారని భావిస్తున్నారు. దీంతో,
2025 సంక్రాంతి తరువాత రాష్ట్రంలోని ప్రాంతాలను నాలుగు జోన్లుగా విభజించి, వారి ప్రాంతాల అభిరుచులకు అనుగుణంగా మధ్యాహ్న భోజన పథకం అమలు చేయడానికి పాఠశాల విద్యా శాఖ సమాయత్తం అవుతోంది.
రాష్ట్రంలోని పాఠశాలల్లో ప్రస్తుతం అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నట్లు ఓ అధికారి చెప్పారు. అందులో పిల్లలకు పౌష్టికాహారం అందించాలనే ప్రధాన లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం దీనికి 400 కోట్ల రూపాయలు అందిస్తోంది. ప్రస్తుతం "ప్రాంతాల వారీగా మారనున్న మెనూ వల్ల ఖర్చు మరింత పెరగడానికి ఆస్కారం ఉంటుంది" అని ఆ అధికారి అభిప్రాయపడ్డారు.
మధ్యాహ్న భోజనం పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అందిస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పోషకాహారాన్ని అందించే కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మధ్యాహ్న భోజనం అమలు తీరుపై సమగ్ర అధ్యాయనం తర్వాత విద్యార్ధుల అభిరుచులకు అనుగుణంగా సమగ్ర మార్పులు చేశారు. సంక్రాంతి పండుగ సెలవుల తర్వాత కొత్త మెనూ అమల్లోకి రానుంది. ప్రతి మంగళవారం మాత్రం విద్యార్థులు తమకు నచ్చిన ఆహారాన్ని ఎంచుకునే అవకాశం కల్పించారు.
నాలుగు జోన్లుగా అమలు
రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలుకు ఉమ్మడి జిల్లాలను నాలుగు జోన్లుగా విభజించారు. ఆ మేరకు మెనూ రూపొందించారు. కొత్త సంవత్సరంలో 2025 సంక్రాంతి తరువాత ఈ మెనూ అమలు చేయడానికి గురువారం సీఎం ఎన్. చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రి మండలిలో ఆ మేరకు నిర్ణయించారు.
జోన్ 1: శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం
జోన్ 2: తూర్పు, పశ్చిమగోదావరి
జోన్ 3: గుంటూరు, నెల్లూరు, ప్రకాశం
జోన్ 4 : చిత్తూరు,కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు ఉన్నాయి.
మెనూ ఇలా..
సోమవారం
జోన్ 1: అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ,
జోన్ 2: అన్నం, ఆకుకూరతో పప్పు, గుడ్డు ఫ్రై, చిక్కీ
జోన్ 3: అన్నం, సాంబారు, గుడ్డు ఫ్రై, చిక్కీ
జోన్ 4: అన్నంతో కూరగాయల కూర ఉడికించిన గుడ్డు, చిక్కీ
మంగళవారం
జోన్ 1: అన్నంతో పాటు గుడ్డు కూర, పప్పు, రసం, రాగిజావ
జోన్ 2 : పులిహార, చట్నీ, ఉడికించిన గుడ్డు, రాగిజా
జోన్3: పులిహార, టామాటా లేదా పుదీన చట్నీ, గుడ్డు ఫ్రై, రాగిజావ
జోన్ 4: పులగం లేదా పులిహార, పల్లీ చట్నీ, కోడిగుడ్డు ఫ్రై, రాగిజావ
బుధవారం
జోన్ 1: వెజ్ పలావ్, బంగాళాదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ,
జోన్2 : అన్నం, కూరగాయల కూర, గుడ్డు, చిక్కీ
జోన్ 3: అన్నం, 4రకాల కూరగాయలతో కూర, గుడ్డు ఫ్రై, చిక్కీ అందిస్తారు.
జోన్ 4: అన్నం, సాంబారు, గుడ్డు, చిక్కీ అందిస్తారు.
గురువారం
జోన్ 1: అన్నం, సాంబారు, గుడ్డు కూర, రాగిజావ,
జోన్2: వెజ్ రైస్, పులావ్, బంగాళాదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, రాగిజావ
జోన్3 : వెజిటేబుల్ రైస్, పలావ్, బంగాళాదుంప కుర్మా, ఉడికించిన గుడ్డు, రాగిజావ
జోన్ 4: వెజిటేబుల్ రైస్, గుడ్డు కూర, రాగిజావ
శుక్రవారం
జోన్1: పులిహార, గోంగూర చట్నీ, లేదా కూరగాయలతో చట్నీ, గుడ్డు చిక్కీ
జోన్2: అన్నం, ఆకుకూర పప్పు, గుడ్ ఫ్రై, చిక్కీ
జోన్ 3: అన్నం, గుడ్డుకూర, చిక్కీ
జోన్4: అన్నం, ఆకుకూరపప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ అందిస్తారు.
శనివారం
జోన్1: అన్నం, కూరగాయల కూర, రసం, రాగిజావ, స్వీట్ పొంగల్
జోన్ 2: అన్నం, ఆకుకూరలతో కూర, స్వీట్ పొంగల్, రాగిజావ
జోన్3: అన్నం, టమాటా పప్పు, పప్పు చారు, బెల్లం పొంగలి, రాగిజావ
జోన్ 4: అన్నం, కందిపప్పు చారు. బెల్లం పొంగలి, రాగిజావ
చారిత్రక నేపథ్యం..
ఈ పథకానికి చారిత్రక నేపథ్యం కూడా ఉంది.
స్వాతంత్య్రానికి ముందే ఈ కార్యక్రమం ప్రారంభమైంది. కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న పుదుచ్చేరి (pandiceri or Puducheri) లో ఫ్రెంచి ప్రభుత్వం 1930లో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేసింది. అంతకుముందు మద్రాసు (chennai) మద్రాసు సిటీ కార్పొరేషన్ పాఠశాల (city corporetion school) లో అమలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వాలు బడిపిల్లల కోసం మధ్యాహ్న భోజన పథకాలు 1962 నుంచి 63 విద్యా సంవత్సరం నుంచి శ్రీకారం చుట్టినట్లు చరిత్ర చెబుతోంది. పాఠశాలలకు హాజరయ్యే పిల్లల సంఖ్య పెంచడానికి వీలుగా ప్రణాళిక రూపొందించిన తమిళనాడు సీఎం కామరాజ్ నాడార్ అమలు చేశారు. ఆ తరువాత 1982లో మాజీ సీఎం ఎంజీ. రామచంద్రన్ ప్రభుత్వ కాలంలో మరింత విస్తృతం చేశారు. ఈ పథకం వల్ల స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరగడాన్ని గమనించిన తమిళనాడు ప్రభుత్వం పదో తరగతి వరకు విస్తరించారు. ఈ పథకమే ఆ తరువాత దేశంలోని మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఈ పథకాన్ని అమలు చేసిన రాష్ట్రాల్లో గుజరాత్ 1984లో ప్రారంభించి, రెండో స్థానంలో నిలిచింది. 1990-91 నాటికి గోవా, కేరళ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమ బెంగాల్ లో కూడా అమలు చేస్తున్నారు.
పీయూసీఎల్ పిటిషన్ వల్లే...
పాఠశాలల్లో పేద విద్యార్థులకు ఆహార భద్రతపై పీయూసీఎల్ (people union for civil liberties - pucl) సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం, ఇతర సంస్థల పైన ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం number 196/201 దాఖలు చేసింది.
2001 ఏప్రిల్ లో దాఖలు చేసిన పిటిషన్ లో ఆహార హక్కు ( right to food) అని కూడా పిలిచారు. ఈ కేసులో భారత రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ (జీవించే హక్కు), ఆర్టికల్ 39 ఏ, ఆర్టికల్ 47 కలిపి చూస్తే ఆహారపు హక్కు కూడా ఒక ప్రాథమిక హక్కుగా భావించవచ్చని వాదించింది.. ఆర్టికల్ 32 ప్రకారం దీన్ని అమలుపరచడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేయాలని కూడా కోరింది. అంతేకాకుండా భారత ఆహార సంస్థ ఎఫ్సీఐ (food corporation of India)లో వృధాగా ఉన్న ధాన్యాలను ఆకలితో అలమటిస్తున్న ప్రజల కోసం వినియోగించాలని కూడా వాదించింది. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించడం కూడా ఇందులో భాగంగా గుర్తు చేసింది.
స్పందించిన సుప్రీం కోర్టు
ఈ అంశాలన్నిటిని సావధానంగా ఆలకించిన సుప్రీంకోర్టు 2001 నవంబర్ 28వ తేదీ "అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్నం భోజన పథకాన్ని కచ్చితంగా అమలు పరచండి"అని ఆదేశం జారీ చేసింది. దీంతో 2003లో జనవరిలో నాటికి ఈ పథకం రాష్ట్రంలో ప్రారంభమైంది. ఆ తరువాత 2008 నాటికి ఎనిమిది, 9, 10 తరగతులకు కూడా విస్తరించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరును పరిశీలించి పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా కమిటీలు కూడా ఉండాలి అనే ఆదేశాలు కూడా ఉన్నాయి. జాతీయ స్థాయి నుంచి పాఠశాల వరకు కమిటీలు కూడా పనిచేస్తున్నాయి. అందులో.
జాతీయస్థాయి : జాతీయ స్థాయి స్టీరింగ్/ మానిటరింగ్ కమిటీ ప్రోగ్రాం అప్రూవల్ బోర్డ్ (pab) మూడు నెలలకు ఒకసారి సమావేశం నిర్వహించాలి. పథకం అమలు జరుగుతున్న తీరుతనులపై సమీక్షించాలి.
రాష్ట్రస్థాయి: రాష్ట్రస్థాయి స్టీరింగ్/ మానిటరింగ్ కమిటీ కూడా ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశం కావాలని ఆదేశాలు ఉన్నాయి.
జిల్లాస్థాయి కమిటీ నెలకు ఒకసారి సమావేశం కావాలి
మున్సిపాలిటీ స్థాయి మున్సిపల్ కమిటీ కూడా నెలకు ఒకసారి సమావేశం కావాలి.
గ్రామం పంచాయతీ కమిటీ రోజువారి పర్యవేక్షణ ఉండాలి
పాఠశాల స్థాయి కమిటీ పాఠశాల నిర్వహణ అభివృద్ధి కమిటీ లేదా విద్యార్థి నెలకోసారి పరిస్థితిని సమీక్షించి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించడానికి అవసరమైన సూచనలు చేయాల్సి ఉంది.
ఇలా మధ్యాహ్నం భోజనం పథకం అమలు చేయడానికి జాతీయ స్థాయి నుంచి గ్రామం వరకు ఒక నిర్దిష్ట కార్యాచరణను తయారు చేశారు. దీంతో దశలవారీగా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు చోటుచేసుకున్నాయి.
పార్టీల మేనిఫెస్టో..
రాష్ట్రంలో పాఠశాల విద్య కూడా రాజకీయ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది. ఓటర్లకు గాలం వేసే పథకాలు ప్రకటించే రాజకీయ పార్టీలు విద్యార్థులను కూడా ప్రత్యేకంగా పరిగణించారు. ఆకర్షణీయమైన పథకాల్లో మధ్యాహ్న భోజనంలో అందించే ఆహార పదార్థాలకు కూడా చోటిచ్చారు.
నిర్ణీత బడ్జెట్ కంటే గత వైసీపీ ప్రభుత్వ కాలంలో రూ. 343.55 కోట్లు అదనంగా వెచ్చించినట్లు ప్రకటించారు. అంటే మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు 1,294 కోట్ల రూపాయలు వెచ్చించినట్లు వైసీసీ ప్రభుత్వ కాలంలో ఇచ్చిన వివరణ.
అంతకంతే ఎక్కువా..
గత నెలలో పాఠశాల విద్యాశాఖ నిర్వహించిన శిక్షణలో పాఠశాల విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్ మాటల ప్రకారం ఈ పథకం అమలుకు రెండు వేల కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. తాజాగా టీడీపీ కూటమి క్యాబినెట్ రీజయన్ల వారీగా మెనూ అమలు చేయాలని తీసుకున్న నిర్ణయం వల్ల భారం మరింత పెరిగేందుకు ఆస్కారం ఉన్నట్లే కనిపిస్తోంది.