పరిపాలన కేంద్రం విశాఖకు మారినట్లే!

సమీక్షల పేరుతో హెచ్‌వోడీల తరలింపు

Byline :  The Federal
Update: 2023-11-29 18:06 GMT
Visakhapatnam city in ap

సమీక్షల పేరుతో హెచ్‌వోడీల తరలింపు

ఏపీ సీఎం జగన్‌ వ్యూహాం ఫలిస్తుందా?
(జిపి వెంకటేశ్వర్లు)
ఆంధ్రప్రదేశ్‌ పరిపాలనా కేంద్రం ఇక నుంచి విశాఖపట్నం అని చెప్పవచ్చు. మంత్రులు, వారి సిబ్బందికి అవసరమైన కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఇప్పటి నుంచి ఎప్పుడైనా, ఎన్ని రోజులైనా విశాఖ నుంచి పాలన సాగించవచ్చు. ప్రభుత్వ శాఖల హెచ్‌వోడీలు, కమిషనర్లు, డైరెక్టర్‌లు, ప్రభుత్వ కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, వారితో ఉండే సిబ్బంది ఇక నుంచి ఎప్పుడైనా విశాఖకు వెళ్ళవచ్చు. అక్కడే బస చేయవచ్చు. ఎన్నిరోజులైనా ఉండవచ్చు. ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులతో సమావేశాలు నిర్వహించి సమీక్షలు చేయవచ్చు. అధికారులకు అవసరమైన కార్యాలయాల కేటాయింపు జరిగింది.
మంత్రులు, అధికారులకు క్యాంపు కార్యాలయాలు
మంత్రులు, వారి సిబ్బందికి క్యాంపు కార్యాలయాల ఏర్పాటు జరిగింది. మంత్రులు ఇక మీదట విశాఖపట్నంలో బస చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేసింది. మంత్రులు, అధికారులకు అవసరమైన భవనాలు కేటాయిస్తూ ఆ భవనాల అడ్రస్‌లు తెలుపుతూ ఇటీవల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి జీవో జారీ చేశారు. ప్రధానంగా 35 శాఖల కార్యాలయాల వివరాలు జీవోలో పేర్కొన్నారు.
మిలీనియం టవర్స్‌లో 1,75,716 చదరపు అడుగుల భవనాలు కేటాయించారు. విఎంఆర్‌డీఏ షాపింగ్‌ కాంప్లెక్స్‌లోనూ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. అప్పూఘర్‌ హరిత రిసార్ట్స్‌లో అధికారులకు గదులు ఏర్పాటు చేశారు. మొత్తం 2,27,287 చదరపు అడుగుల భవనాలను మంత్రులు, అధికారులకు కేటాయించినట్లు జీవోలో పేర్కొన్నారు.
మూడు రాజధానుల వ్యూహంలో భాగమే
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మూడు రాజధానుల ఏర్పాటు వ్యూహంలో భాగంగానే ఈ కార్యాచరణ జరిగింది. కార్యనిర్వాహక రాజధాని ఇకనుంచి విశాఖపట్నం అయినట్లుగానే భావించాలి. ఎందుకంటే ఉత్తరాంధ్రకు సంబంధించిన ఏ కార్యక్రమైనా విశాఖలో మంత్రులు, కార్యదర్శులు, కమిషనర్లు, వారి సిబ్బంది అందుబాటులో ఉంటారు.
వ్యూహం ఫలిస్తుందా... కోర్టు జోక్యం చేసుకుంటుందా...
ఏపీ సీఎం జగన్‌ వ్యూహం ఫలిస్తుందా..? కోర్టు జోక్యం చేసుకుంటుందా? ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే మూడు రాజధానుల వ్యవహారం ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఉంది. హైకోర్టు ఆదేశాల ప్రకారం అమరావతి రాజధానిగా ఉంటుంది. హైకోర్టు ఎందుకు ఈ ఆదేశాలు జారీ చేసిందంటే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే మూడు రాజధానుల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించింది. దీనిపై రాజధానికి భూములిచ్చిన రైతులు కోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. అమరావతిని కాదని రాజధాని మరో చోట ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. ఆ తరువాత ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఇంకా తీర్పు రాలేదు. ఈలోపు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మూడు రాజధానుల బిల్లును తర్వాత సమావేశాల్లో వెనక్కు తీసుకుంది. టెక్నికల్‌ కారణాల వల్ల బిల్లును ఉపసంహరించుకున్నట్లు ప్రకటించి సర్థిచెప్పుకుంది.
ఎన్నికల వ్యూహంలో భాగంగానే..
ఇప్పటికే మూడు సార్లు తాను విశాఖలో క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రకటించారు. అయితే జరగలేదు. ఎన్నికలు సమీపిస్తుండటంతో తన వ్యూహాన్ని అమలు చేయాలనే ఆలోచనకు వచ్చారు. అందుకే ముందుగా పరిపాలనా సౌలభ్యం అంటూ కార్యాలయాల తరలింపు మొదలు పెట్టారు. విశాఖ నుంచి పరిపాలనకు శ్రీకారం చుట్టారు.
కార్యాలయాల అద్దెలకు బోలెడంత డబ్బు
ఏపీలో ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణ కోసం అద్దెల రూపంలో ఇప్పటికే నెలకు సుమారు కోటి రూపాయలు వెచ్చిస్తున్నది. ఇక విశాఖలో కూడా కార్యాలయాలు ఏర్పాటైనందున కొన్నింటికి అద్దెలు చెల్లించాల్సిందే. అప్పులు చేసి అద్దె ఆఫీసుల్లో ఉండటం ఏ రాష్ట్రంలోనూ ఇంతగా లేదని చెప్పవచ్చు. పైగా ఇక నుంచి మంత్రులు, కమిషనర్లు, కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు విమానాల్లో ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. వారితో పాటు కొందరు సిబ్బంది కూడా వెళ్లాల్సిందే. వీరి ప్రయాణ ఖర్చులు కూడా లక్షల్లోనే ఉంటాయి.


Tags:    

Similar News