బెంగళూర్: ‘పే అండ్ పార్కింగ్’ పై బయోకాన్ చైర్ పర్సన్ విమర్శలు

రద్దీ పన్ను విధిస్తే ప్రయోజనం ఉంటుందని సూచన

Update: 2025-11-15 11:06 GMT
బెంగళూర్ నగరంలో ట్రాఫిక్

భారత ఐటీ రాజధాని అయిన బెంగళూర్ లో ట్రాఫిక్ కష్టాలను నివారించడానికి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో పే అండ్ పార్కింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని బెంగళూర్ ట్రాఫిక్ పోలీసులు తీసుకున్నా నిర్ణయాన్ని బయోకాన్ చైర్ పర్సన్ కిరణ్ మజుందార్ షా విమర్శించారు.

దీని బదులుగా రద్దీ పన్నులు వసూలు చేయడం వలన ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అధికారులకు సూచించారు. బెంగళూర్ లోని ఓఆర్ఆర్ పై ట్రాఫిక్ రద్దీ పెద్ద సమస్యగా మారింది. దీనిని పరిష్కరించడానికి ట్రాఫిక్ పోలీసులు, అనేక మంది ప్రముఖులు ఇతర ఉన్నత స్థాయి కంపెనీల మేనేజ్మెంట్ తో వరుస సమావేశాలు నిర్వహించారు.

ఈ సమావేశాలలో ఉద్యోగులు తమ సొంత వాహానాలపై రావడాన్ని నిరుత్సాహపరచడానికి, ప్రజా రవాణాను ఉపయోగించడానికి పే అండ్ పార్క్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని పోలీసులు సూచించారు.

ఈ సూచనను షా తిరస్కరించారు. దీనివలన కొత్త సమస్యలు పుట్టుకొస్తాయని, రద్దీ పన్ను విధించడం వలన కొంత ట్రాఫిక్ ను నియంత్రించవచ్చని సూచించారు.

‘‘ప్రధానంగా ఉదయం పూట ఓఆర్ఆర్ లో చాలా మంది ఒంటరిగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లేవారిని నేను చూశాను. రద్దీని నివారించడానికి ప్రయోగాత్మకంగా పార్కింగ్ రుసుమును వసూలు చేయాలని మేము సూచించాము.
ఎందుకంటే దీనివలన కొంతమంది ప్రజా రవాణాకు మారవచ్చు. వారు స్వచ్చంద, వాణిజ్యేతర కార్ పూలింగ్ కూడా చేయవచ్చు. ఒకే ప్రదేశంలో నివసిస్తున్నా నలుగురు లేదా ఐదుగురు కలిసి ప్రయాణించడానికి ఇది వీలు కల్పిస్తుంది’’ అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సాహిల్ బాగ్లా తన నివేదికలో పేర్కొన్నారు.
రద్దీ పన్ను అంటే..
సింగపూర్, లండన్, మిలాన్, న్యూయార్క్, స్టాక్ హోమ్ వంటి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నగరాలలో రద్దీ పన్నును ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. 1975 లో సింగపూర్ మొదటిసారిగా ఈ రద్దీ పన్నును ప్రవేశపెట్టింది.
రద్దీ సమయాల్లో నిర్ధిష్ట రోడ్ లోకి వాహానాలు ప్రవేశించాలంటే రద్దీ పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఓఆర్ఆర్ ప్రాంతంలో ఒకే వ్యక్తి ప్రయాణించే వాహానం వస్తే రద్దీ పన్నును విధించాలని కూడా సూచనలు వస్తున్నాయి.
కర్ణాటక ప్రభుత్వం దీనిని ప్రవేశపెట్టబోతోందని వార్తలు వచ్చాయి. అయితే ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దీనిని తిరస్కరించారు.
‘‘ఆ విషయాలన్నీ అబద్దం. అలాంటిదేమీ విధించడం లేదు. బెంగళూర్ పౌరుల ప్రయోజనాల కోసం కొంతమంది పారిశ్రామికవేత్తలు సూచనలు ఇచ్చారు. కానీ అది నా దగ్గరికి ఇంకా రాలేదు. వారి సూచనలు పరిశీలిస్తాము’’ అని శివకుమార్ గత నెలలో మీడియాతో అన్నారు.
బెంగళూర్ ట్రాఫిక్ కష్టాలు తీర్చడం తమ వల్ల కాదని ఇంతకుముందే డీకే శివకుమార్ వ్యాఖ్యానించారు. ప్రతిరోజు వేల సంఖ్యలో కొత్త వాహానాలు వస్తున్నాయని, వాటికి సరిపడినంత రోడ్లు లేవని అన్నారు. అనేక రోడ్ నిర్మాణ ప్రాజెక్ట్ లు ఏళ్ల తరబడి కొనసాగడం కూడా ఖజానాపై భారం పడుతుందని, దేవుడే బెంగళూర్ ను రద్దీ నుంచి కాపాడాలని అప్పట్లో పేర్కొనడంపై తీవ్ర దుమారం చెలరేగింది. ప్రతిపక్ష బీజేపీ ఈ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించింది. 


Tags:    

Similar News