‘‘వన్ నేషన్ - వన్ ఎలక్షన్’’ గురించి స్టాలిన్ అభిప్రాయమేంటి?

జమ్ము కాశ్మీర్ లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం చేతగాని వారు దేశమంతా ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉంది - తమిళనాడు సీఎం స్టాలిన్

Update: 2024-09-29 07:09 GMT

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై డీఎంకే చీఫ్ స్టాలిన్ విరుచుకుపడ్డారు. ఒక రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం చేతగాని వారు దేశమంతా ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. డీఎంకే 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కాంచీపురంలో ఏర్పాటు చేసిన సమావేశంలో స్టాలిన్‌ ప్రసంగించారు.

జమ్ము కాశ్మీర్‌ అసెంబ్లీలోని 90 మంది సభ్యులను ఎన్నుకునేందుకు మూడు విడతలుగా ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చిందని గుర్తుచేస్తూ..“ఒకే దేశం, ఒకే ఎన్నిక గురించి మాట్లాడటానికి సిగ్గుండాలి? ఒక రాష్ట్రంలో ఒకే దశలో ఎన్నికలను నిర్వహించలేని వారు ‘‘వన్ నేషన్ - వన్ ఎలక్షన్’ గురించి మాట్లాడుతున్నారు. బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వానికి పార్లమెంట్‌లో పూర్తి మెజారిటీ లేదు. కేవలం 240 మంది ఎంపీలతో మనుగడ సాగిస్తున్నారు. అందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు” అని పేర్కొన్నారు.

డీఎంకే నేతృత్వంలోని “విజయవంతమైన” కూటమి కేంద్రంలో బీజేపీని గద్దె దింపడానికి అలాగే జాతీయ స్థాయిలో భారత కూటమిని ఏర్పరచడానికి ప్రేరణగా నిలిచిందని పేర్కొన్నారు. ఫాసిస్ట్, మతతత్వ శక్తులను దూరంగా ఉంచడానికి మేమంతా సైద్ధాంతికంగా ఐక్యంగా ఉన్నామని, లోక్‌సభ ఎన్నికలలో తమ కూటమి అద్భుతంగా పనిచేసిందని గుర్తుచేసుకున్నారు. .

వారి కలలు ఎప్పటికీ నిజం కావు..

డీఎంకే, దాని మిత్రపక్షాల కూటమిని విచ్ఛిన్నం చేసే క్రమంలో బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోందని, వారి కలలు ఎప్పటికీ నెరవేరవని చెప్పారు. ఎన్నికల సమయంలో బీజేపీ ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవడంపై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. ‘ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకున్న పార్టీలు విడిపోయిన సందర్భాలూ ఉన్నాయి. కానీ మా కూటమి అలా కాదు. మా ఐక్యతను చూసి మా రాజకీయ ప్రత్యర్థులు అసూయపడుతున్నారు. అసత్యాలు ప్రచారాలు చేస్తూ శునకానందం పొందుతున్నాయి. అది ఎంతో కాలం నడవదు. ' అని స్టాలిన్ అన్నారు.

Tags:    

Similar News