ఆవుదూడ గుర్తుందా, అప్పటికి ఇప్పటికీ ఎంత తేడానో!

తిట్లు, శాపనార్ధాలతో ఈవేళ సాగుతున్న ప్రచారానికి 1970ల నాటి ప్రచారానికి అసలు పొంతనే లేదు. నేటి ప్రసంగాలు చెవుల్లోంచి రక్తం కారేలా చేస్తున్నాయంటున్నారు జనం;

Update: 2024-03-29 03:55 GMT
ఫోటో కర్టసీ వికీపీడియా

2024 ఎన్నికల ప్రచార స్వరాలు..

-అతనో గుంటనక్క.. అతనికి ఓటేస్తే గుడిని గుడిలో లింగాన్నీ మింగేస్తాడు..

--అతడో దుర్మార్గుడు.. మళ్లీ గెలిస్తే రాష్ట్రంలో మిగిలేదీ ఉండదు. తస్మాస్ జాగ్రత్త, నీ గుండెల్లో నిద్రపోతా..

1970 ఎన్నికల ప్రచారం...

-పేదరికం నిర్మూలన మా ఎజెండా.. మేము అధికారంలోకి వస్తే ప్రతిపక్షాల విమర్శలకు అడ్డుకట్టవేస్తాం..

--అధికార పార్టీ దగా చేస్తోంది. మాటలతో మభ్యపెడుతోంది. తస్మాస్ జాగ్రత్త. అవినీతితో ప్రజాస్వామ్యాన్ని కుళ్లబొడుస్తున్నారు..


కాలం గడిచే కొద్ది పటిష్టమై పరిడవిల్లాల్సిన ప్రజాస్వామ్యం ప్రమాదఘంటికలు మోగిస్తోందన్న విమర్శల్ని పక్కనబెడితే 50 ఏళ్లనాటి ఎన్నికల ప్రచారానికి ఇప్పటికి చాలా తేడా వచ్చిందన్నది నిజం. వాస్తవానికి ఓ రాజకీయ నాయకుణ్ణి అతడు, ఇతడు, అతను, గుంటనక్క వంటి పదాలతో పిలవడం గౌరవం కాదు. కాని ఇప్పుడు అలానే పిలిచేస్తున్నారు. అలా పిలవకపోతే ఆ రాజకీయ నాయకుడు అసలు నాయకుడే కాదన్నట్టుగా ఉంది. ప్రజాస్వామ్యంలో వచ్చిన పెద్ద మార్పు తిట్లు, శాపనార్థాలు. ఒకప్పుడున్న సున్నితత్వం ఇప్పుడు లేదు. మాట తూలడానికి గతంలో ఉన్న ఓరకమైన పెద్దరికం ఇప్పుడు చెల్లుబాటు కాదు. ఎంత నిర్భయంగా తిట్టగలిగితే, ఎంత స్వేచ్ఛగా అవతలి వ్యక్తిని కించపరిస్తే ఇప్పుడంత పేరుమోసిన నాయకుడు అవుతారు. గతంలో మాదిరి ఏదో ఒక పార్టీకే కట్టుబడి నీతి నీయమాలు అని మడికట్టుకు కూర్చుంటామంటే ఇప్పుడు ఎందుకూ కొరగాని నాయకుడే అవుతారు.

1970ల నాటి ఎన్నికల ప్రచారానికి ఇప్పటికీ చాలా తేడా వచ్చింది. దీని మంచి చెడులపై చర్చించాల్సిన అవసరం ఉందని మేధావులు చెబుతున్నా తెంపరితనం రాజ్యమేలుతున్న కాలంలో ఈ చర్చోపచర్చలు ఎవరికీ పట్టనివిగా ఉంటాయంటున్నారు ఇటీవల హైదరాబాద్ లో సమావేశమైన సామాజిక శ్రేయోభిలాషులు.

1970ల నాటి ప్రచారంలో ఏదో ఒక ముఖ్యమైన అంశంపై ప్రస్తావన ఉండేది. 1971నాటి సార్వత్రిక ఎన్నికల్లో ప్రధానాంశం పేదరికం నిర్మూలన. కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలింది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (రిక్విజనిస్టులు), ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (ఆర్గనైజేషన్). మొదటి వర్గానికి ఇందిరా గాంధీ నాయకత్వం మరో వర్గానికి మొరార్జీ దేశాయ్, కె.కామరాజ్, వీరేంద్రపాటిల్ వంటి మహామహులు నాయకత్వం వహించారు. ఇందిరా గాంధీకి ఆవుదూడ గుర్తు, మిగతా వాళ్లకి రాట్నం వడుకుతున్న మహిళ గుర్తు వచ్చింది. హోరాహోరీ పోరాడుకున్నారు. విమర్శలూ చేసుకున్నారు. అయితే అవేవీ వ్యక్తిగతమైనవో, ఇళ్లల్లోని స్త్రీలను కించపరుచుకున్నవో కావు. ఎవరి విధానాలు వారు చెప్పుకున్నారు. గోడల మీద రాతలు రాసుకున్నారు. గుర్తులు చెప్పుకున్నారు. తాము అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెప్పారే తప్ప ఎవడ్రా నువ్వు, వాడేమి పీకుతాడు, వీడేమి పికుతాడు అని తిట్టుకోలేదు. ఏదైనా విమర్శ చేయాల్సి వచ్చినా చాలా సున్నితంగా దెప్పి పొడుచుకున్నారే తప్ప నువ్వు దొంగంటే నువ్వు దొంగనుకోలేదు.

ఆవేళ్టి పెద్ద సమస్య రిగ్గింగ్...


ఆవేళటి ఎన్నికల్లో పెద్ద సమస్య రిగ్గింగ్. బ్యాలెట్ పేపర్లు ఉండేవి. బడుగు బలహీన వర్గాల వారిని పోలింగ్ బూతుల్లోకి వెళ్లనీయకుండా అధికారం లేదా బలం ఉన్న వర్గాలు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి వాళ్లే బ్యాలెట్ పేపర్ల మీద ఓట్లు వేసుకునే వారు. ఆ సందర్భంగా హింస కూడా ప్రజ్వరిల్లేది. ఈ రిగ్గింగ్ కొందర్ని పెద్దవాళ్లను కూడా చేసింది. మరికొందర్ని ప్రముఖుల్ని చేసింది. ఇప్పుడా పరిస్థితి చాలా వరకు తగ్గింది. ఇదో పెద్ద పరిణామం. ఆమధ్య చిత్తూరు పార్లమెంటు ఉపఎన్నిక సందర్భంగా మాత్రమే మళ్లీ ఈ రిగ్గింగ్ పదం వినిపించింది. ఇది హైటెక్ రిగ్గింగ్ అని ఆరోపణలు కూడా వచ్చాయి. విద్యావంతులు పెరగడం వల్ల రిగ్గింగ్ బాగా తగ్గిందనే చెప్పాలి. 1970లలో వినబడిన రిగ్గింగ్ అనే మాట ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలతో కట్టడైంది. దీనిపైనా ఆరోపణలు ఉన్నా, బ్యాలెట్ సిస్టమే మంచిదని కొందరు వాదిస్తున్నా.. కాలం వెనక్కి పోదు కనుక బహుశా ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థే కొనసాగవచ్చు.

నాయకుల ప్రసంగాలకు ఎదురుచూపులు..

ఇప్పుడు ప్రసంగాలు చాలా బోరింగ్ గా, వినడానికి వీలు లేనట్టుగా ఉంటున్నాయని ఎవర్ని అడిగినా చెబుతారు. ‘అయినా సభలకు జనం వస్తున్నారంటే ఎలా వస్తున్నారో అందరికీ తెలిసిందే. అధికారం కోసం ప్రయత్నిస్తున్న ప్రతి పార్టీ ఏదో ఒక ప్రలోభం చూపే జనాన్ని రప్పిస్తున్నారు తప్ప నాయకుల ప్రసంగాల కోసం కాదు’ అన్నారు సీపీఐ నాయకుడు కేవీవీ ప్రసాద్. ఈవేళ మంచి వక్తలున్నా గొప్ప రాజకీయ నాయకులు లేరన్నది ప్రసాద్ ఆవేదన. ప్రాంతీయ పార్టీలు ఇంతగా బలపడని పాత కాలంలో ఎవరైనా పెద్ద నాయకుడు వస్తున్నారంటే జనాన్ని బసులు పెట్టి తోలాల్సిన పని లేకుండానే చాలా మంది స్వచ్ఛందంగా వచ్చే వారు. ఏమి చెబుతారోనని ఎదురు చూసే వారు. వచ్చే నాయకులు కూడా ప్రతి చోటా ఏదో ఒక కొత్త అంశాన్ని చెప్పేవారు. ఈవేళ మనకు ఆ పరిస్థితి లేదు. ఉన్నవి రెండూ ప్రాంతీయ పార్టీలే. వీళ్లు ఎక్కడ మాట్లాడినా ఒకర్ని ఒకరు తిట్టుకోవడమో లేక చెప్పినవి చెప్పి జనాన్ని విసిగించడమో జరుగుతోంది.

ఒకనాటి గొప్ప లీడర్లైన ఇందిరాగాంధీ, మొరార్జీ దేశాయ్, వాజపేయి, ఇంద్రజిత్ గుప్తా, భూపేష్ గుప్తా, పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, హీరేన్ ముఖర్జీ లాంటివారు ఇవాళ మనకు మచ్చుకైనా కనపడరు. వీళ్లు మాట్లాడుతున్నారంటే గిట్టనివాళ్లు సైతం వినే పరిస్థితి ఉండేది. ‘ఇప్పుడు మన లీడర్లు డర్టీ లాంగ్వేజ్ ని వాడుతున్నారు. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. చెప్పింది చెబుతున్నారు. ఏ అంశాన్ని పూర్తిగా చెప్పకుండా సగం సగం అరకొరగా చెప్తూ జనాన్ని మభ్యపెడుతున్నారు. మసిబుసి మారేడు కాయ చేస్తున్నారు. చాలామంది లీడర్లకు తాము భారత్ లాంటి విభిన్న సంస్కృతుల దేశంలో ఉంటున్నామనే స్పృహ కూడా లేకుంటా మాట్లాడుతున్నారు. ఆ రకంగా దుమ్ము ఎత్తిపోసుకుంటున్న తీరు ఓటర్లకు విసుగు పుట్టిస్తోంది’ అన్నారు గుంటూరు జిల్లాలో సుదీర్ఘకాలం టీచర్ గా పని చేసి పదవీ విరమణ చేసిన బాలశౌరి.

దేశంలో ఎన్నికల ప్రచార సరళి మారింది. జాతీయ స్థాయిలో రెండు కీలక రాజకీయ పార్టీలున్నట్టే చాలా రాష్ట్రాలలో రెండు ప్రాంతీయ పార్టీలు ఉంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో చాలా కొత్త పరిణామాలు వచ్చాయి. సోషల్ మీడియా, మాస్ మీడియా, అవుట్‌డోర్, ఇండోర్ ప్రచారాలు, వాలంటీర్ వ్యవస్థలు వచ్చాయి. ఇవికాకుండా వ్యూహాలు, ఎత్తుగడల కోసం నెట్ వర్క్ లు, ఏజెన్సీలు పని చేస్తున్నాయి. జెండా కర్రలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు, కరపత్రాలు చాలావరకు తగ్గిపోయాయి. రాజకీయ మార్కెటింగ్ బాగా అభివృద్ధి చెందింది. 2014 నుంచి దేశంలో ఆధునిక ప్రచారానికి పునాదులు పడ్డాయి. ఆధునిక ప్రచారమంతా లీడర్ సెంట్రిక్‌గా మారింది. నిపుణుల ఇంటర్వ్యూలు, ఫోకస్ గ్రూప్ డిస్కషన్లు పెరిగాయి. సామాన్యుల దృష్టిలో ఎవరు అగ్రస్థానంలో ఉంటారనే లెక్కలు వేసి ఆ వ్యక్తి చుట్టూ ఆయా పార్టీల రాజకీయాలు నడుస్తున్నాయి. ఎన్నికల సమయంలో విద్యావంతులైన ఓటర్లను లక్ష్యంగా చేసుకుని ప్రచారం సాగుతోంది.

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం తర్వాత ప్రపంచ చరిత్రలో రెండవ అత్యంత ఖరీదైన ప్రచారం మన దేశంలో జరుగుతోంది. పార్టీలు సంప్రదాయ ముద్రణ, టెలివిజన్‌కు అతుక్కోకుండా సోషల్ మీడియా, క్రౌడ్ ఫండ్ రైజింగ్, డిజిటల్ ర్యాలీలు, ప్రభావవంతమైన కథనాలు వంటి వినూత్న ప్రచార పద్ధతులకు వెళ్లడానికి ప్రయత్నించడంతో ప్రచార పద్దతిలో పెద్ద మార్పు వచ్చింది.

Tags:    

Similar News