కాంగ్రెస్, బీజేపీ మధ్య ‘‘కేసరీ- 2’’ వార్
రాజకీయ పర్యటనలు చేసిన బీజేపీ, వర్థంతి కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్;
Translated by : Chepyala Praveen
Update: 2025-04-27 07:03 GMT
(మూలం.. రాజీవ్ రామచంద్రన్)
భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ప్రముఖ వ్యక్తి, భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన ఏకైక మలయాళీ అయిన సర్ చెత్తూర్ శంకరన్ నాయర్ జీవిత చరిత్ర ఆధారంగా బాలీవుడ్ లో ఓ సినిమా తీశారు.
ప్రస్తుతం ఈ సినిమా తీవ్ర వివాదంలో చిక్కుకుని, రెండు జాతీయ పార్టీల మధ్య చిచ్చుకు కారణమైంది. ఈ సినిమా పై వచ్చిన వివాదం ఏంటీ.. పార్టీలు ఎలా స్పందించాయో ఓసారి పరిశీలిద్దాం.
అక్షయ్ కుమార్ నటించిన బాలీవుడ్ చిత్రం.. కేసరి చాప్టర్ 2: ది అన్ టోల్డ్ స్టోరీ ఆఫ్ జలియన్ వాలాబాగ్ విడుదల అయింది. ఇందులో నాయర్ జీవితం, పంజాబ్ మాజీ లెప్టినెంట్ గవర్నర్ మైఖేల్ ఓ డయ్యార్ పై ఆయన చేసిన పోరాటం దృశ్యరూపకంగా తెరకెక్కించడం అందరిని ఆకర్షించింది.
నాయర్ వారసత్వం కోసం పోటీ..
నాయర్ మునిమనవడు, అతని భార్య అయిన రఘు పలాట్, పుష్ఫ పలాట్ రాసిన ‘‘ది కేస్ దట్ షుక్ ది ఎంపైర్’’ పుస్తకం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా కేరళలో కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ పోరుకు కారణమైంది. ప్రతి ఒక్కరూ నాయర్ వారసత్వాన్ని తమ రాజకీయ లబ్ధి కోసం వాడటానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
నాయర్ 1857 లో పాలక్కాడ్ లోని మంకర లో జన్మించారు. చెట్టూర్ శంకరన్ నాయర్ ఒక ప్రముఖ న్యాయవాదీ, న్యాయవేత్త, రాజనీతిజ్ఞుడు, మద్రాస్ ప్రెసిడెన్సీలో అడ్వకేట్ జనరల్ గా, వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడిగా, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. అయితే జలియన్ వాలాబాగ్ ఊచకోతను బ్రిటిష్ వారు పాశవికంగా చేయడాన్ని నిరసిస్తూ వైస్రాయ్ కౌన్సిల్ కు రాజీనామా చేశారు. ఇది ఆయన చేసిన మొదటి ధిక్కార చర్య.
నాయర్ రాసిన తదుపరి పుస్తకం ‘గాంధీ అండ్ అనార్కీ(1922)’ బ్రిటిష్ విధానాలు, గాంధీ నిర్వహించిన సహాయ నిరాకరణ ఉద్యమాలను విమర్శించింది. ఇది ఆయనకు కాంగ్రెస్ తో ఘర్షణ వాతావరణాన్ని సృష్టించింది. ఆయన జలియన్ వాలాబాగ్ ఉదంతంపై బ్రిటిష్ వారిపై అవిశ్రాంతంగా పోరాటినప్పటికీ ఆయనకు కేరళలో రావాల్సినంత పేరు రాలేదు.
ప్రస్తుతం నాయర్ గురించి 2025, ఏప్రిల్ 14న ప్రధాని మోదీ హర్యానాలో ప్రసంగంలో ప్రస్తావించారు. తరువాతనే ఈ వివాదం మొదలైంది. ప్రధాని నాయర్ పై ప్రశంసలు కురిపిస్తూ.. ‘‘బ్రిటిష్ దురాగతాలకు వ్యతిరేకంగా వినిపించిన నిర్భయ స్వరం’’ అని అన్నారు.
ఆ తరువాత ఏప్రిల్ 24న నాయర్ వర్ధంతికి ముందు కేంద్ర మంత్రి సురేష్ గోపీ పాలక్కడ్, ఒట్టపాలెంలోని చెట్టూర్ కుటుంబాన్ని సందర్శించారు. ఈ పర్యటన మీడియా ద్వారా విస్తృతంగా కవర్ అయింది.
ఈ సంఘటన కాంగ్రెస్, బీజేపీ మధ్య వివాదానికి దారితీసింది. నాయర్ వారసత్వాన్ని తమ పరం చేసుకునే ప్రయత్నంగా బీజేపీని, కాంగ్రెస్ విమర్శించింది. ఈ రాష్ట్రంలో పార్టీ చారిత్రాత్మకంగా పట్టు సాధించడానికి కష్టపడుతున్నారని చురుకులు వేశాయి.
సామాజిక మాధ్యమాలు ఈ చర్చను మరింత విస్తృతం చేశాయి. కాంగ్రెస్, నాయర్ ను నిర్లక్ష్యం చేసిందని, పార్టీ కేరళ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్ లో ఆయన ఫోటో ఫ్రేమ్ ను తొలగించిందని రైట్ వింగ్ ఆరోపణలు గుప్పిచింది.
బీజేపీపై కాంగ్రెస్ విమర్శలు..
బీజేపీ టూర్ కు కౌంటర్ గా కాంగ్రెస్ రాష్ట్ర స్థాయిలో నాయర్ వర్థంతిని నిర్వహించింది. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కే మురళీధరన్, నాయర్ చేసిన కృషిని గుర్తించినప్పటికీ జాతీయవాద ఆధారాల గురించి పలు ప్రశ్నలు లేవనెత్తారు.
1904 లో కంపానియన్ ఆఫ్ ది ఇండియన్ ఎంఫైర్, 1912 లో నైట్ హుడ్ వంటి బ్రిటిష్ గౌరవాలను నాయర్ అంగీకరించడాన్ని, అలాగే వలసపాలనలో ఆయన పాత్రలను మురళీధరన్ ఎత్తి చూపారు.
‘‘శంకరన్ నాయర్ వైపు నుంచి మేము పూర్తిగా అంగీకరించలేని కొన్ని చర్యలు ఉన్నాయి. అయితే అతను మతతత్వవాది కాదు. అతను లౌకికవాది. కానీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి వైదొలగిన తరువాత మాత్రమే అతను అడ్వకేట్ జనరల్ అయ్యాడు. తరువాత న్యాయమూర్తి అయ్యాడు. తరువాత వైస్రాయ్ కార్యనిర్వాహాక మండలి సభ్యుడయ్యాడు’’ అని మురళీధరన్ అన్నారు.
కన్నూర్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కే. సుధాకరన్ వాయిస్ పెంచారు. ‘‘బీజేపీ ఇప్పుడూ చెట్టూర్ శంకరన్ నాయర్ ను గుర్తుంచుకోవడం ప్రారంభించింది’’. ఇది పార్టీ అవకాశవాదమని ఆరోపించారు. వారి ఆసక్తి ఇతర పార్టీల నుంచి నాయకులను గుంజుకోవడంలోనే ఉందన్నారు.
చర్చల్లో పాల్గొన్న సీపీఐ(ఎం)..
మరోవైపు సీపీఐ(ఎం) కూడా ఈ దాడిలో చేరింది. బీజేపీ కాంగ్రెస్ రెండింటినీ నిందించింది. ‘‘చెట్టూర్ శంకరన్ ను గుర్తుంచుకోవడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమయింది.
అతని వారసత్వాన్ని నిర్లక్ష్యం చేయడం, బీజేపీకి ఒక అవకాశాన్ని సృష్టించింది. బీజేపీకి అతనిపై చట్టబద్దమైన హక్కు లేనప్పటికీ అది ఇప్పుడు కాంగ్రెస్ ఉదాసీనతను ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తోంది’’ అని పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ అన్నారు.
అప్పట్లో ఆర్ఎస్ఎస్ స్వాత్రంత్య్ర పోరాటంలో పాల్గొనకూడదని నిశ్చయించుకుందని, ఆర్ఎస్ఎస్ ను నిషేధించింది సర్థార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పారు. అయితే ప్రస్తుతం మోదీ వల్లభాయ్ పటేల్ ను తమ ఆధీనంలోకి తీసుకోవడానికి ప్రయత్నిచారని విమర్శలు చేశారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. శశిథరూర్ ను కొంతమంది ఆయన అభిమానులు శంకరన్ నాయర్ తో పోలుస్తున్నారు. సినిమా విడుదలకు ముందే ఈ విషయాన్ని ఎక్స్ లో పోస్ట్ చేశారు.
‘కేసరి చాఫ్టర్ 2’ సి. శంకరన్ నాయర్ కథను సినీ తెరపైకి తీసుకువస్తుందని తెలిసి చాలా సంతోషంగా ఉంది. నిర్భయ దేశభక్తుడు, జలియన్ వాలాభాగ్ ఊచకోత తరువాత బ్రిటిష్ వారిని ఎదుర్కొన్న ఏఐసీసీ మొదటి మలయాళీ అధ్యక్షుడు, ఆధునిక భారతీయ చరిత్రలో అతని వారసత్వం మరింతగా గుర్తింపు పొందాలి’’ అని తరువాత థరూర్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
బీజేపీ కౌంటర్..
థరూర్ పోస్ట్ పై కేరళ బీజేపీ చీఫ్ రాజీవ్ చంద్రశేఖర్ తీవ్రంగా స్పందించారు. తన ఎక్స్ ఖాతాలో దీనిపై ట్వీట్ చేస్తూ.. ‘‘ కాంగ్రెస్ పార్టీ తన చరిత్ర నుంచి నాయకులను ఎలా తొలగించిందో చెప్పడానికి ఇది తాజా ఉదాహారణ. సుభాష్ చంద్రబోస్, సర్దార్ వల్లభాయ్ పటేల్, అంబేడ్కర్ అనేక ఇతర జాతీయ నాయకులను తొలగించారు. ఇతర వ్యక్తుల మాదిరిగానే కాంగ్రెస్ రాజవంశాన్ని పొగిడేందుకు ’’ అని ఆయన రాశారు.
యూపీఏ పాలనలో ప్రధానమంత్రి కార్యాలయానికి మాజీ సలహాదారు టీకేఏ నాయర్ అధ్యక్షతన ఉన్న చెట్టూర్ శంకరన్ నాయర్ షౌండేషన్ ఈ విషయం పై మరోసారి స్పందించింది. నాయర్ రచనలపై కథనాన్ని తిరిగి కేంద్రీకరించడానికి ప్రయత్నించింది. గాంధీ పద్దతులకు భిన్నంగా రాజ్యాంగ మార్గాల ద్వారా, అతని ప్రగతిశీల న్యాయ వారసత్వం ద్వారా స్వాతంత్య్రం పోరాటంలో అతని పాత్రను హైలైట్ చేసిందన్నారు.
ఉచ్చులో పడకండి..
‘‘శంకరన్ నాయర్ ను జరుపుకోవడానికి అనుకూలంగా లేదా వ్యతిరేకంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోంది. శంకర్ నాయర్ ను స్వాధీనం చేసుకుంటున్నారనే వాదన బీజేపీకి సరిగ్గా అదే కావాలి. మనం ఉచ్చులో గుడ్డిగా పడవకూడదు.’’ అని సామాజిక శాస్త్రవేత్త డాక్టర్ టీటీ శ్రీ కుమార్ అభిప్రాయపడ్డారు.
‘‘ఈ సందర్భంలో శంకరన్ నాయర్ చుట్టూ జరుగుతున్న చర్చ ఒక ఉచ్చుగా మారుతోంది. ఇది సాంస్కృతిక జాతీయతను పెంచుతుంది. ఈ ఉచ్చులో పడకుండా ఉండటం ఈ సమయంలో అవసరం.
చెట్టూర్ శంకరన్ నాయర్ సహకారాన్ని అంగీకరిస్తునే కాంగ్రెస్ కమ్యూనిస్టూ పార్టీలు ఐక్యంగా స్ఫష్టంగా నమ్మకంగా వ్యక్తపరచాలి’’ అని శ్రీ కుమార్ ఇటీవల వ్యాసంలో వాదించారు.
కేసరీ అధ్యాయం 2 నాయర్ పై ఆసక్తిని తిరిగి రేకెత్తించడంలో కీలకపాత్ర పోషించింది. అతని కోర్టు గతి ధిక్కారానికి చిత్రీకరించిన తీరు ప్రేక్షకులకు బాగా నచ్చింది.
థియెటర్లలో చాలామంది నాయర్ బ్రిటిష్ ఒత్తిడికి తలొగ్గడానికి నిరాకరించిన సన్నివేశాలకు చప్పట్లు కొట్టారు. అయితే కొంతమంది విమర్శకులు మాత్రం ఈచిత్రం కొన్ని సన్నివేశాల్లో సృజనాత్మకత స్వేచ్ఛను తీసుకుందని, గాంధీపై నాయర్ చేసిన విమర్శలను కప్పిపుచ్చిందని, ఏకీకృత జాతీయవాద కథనాన్ని మాత్రమే చూపిందని వాదించారు.
న్యాయ సంస్కరణలు, జలియన్ వాలాభాగ్ పై రాజీనామా లండన్ లో న్యాయపోరాటం వంటి అంశాలతో నిండిన నాయర్ జీవితం వలసవాద శక్తిని తనదైన రీతిలో సవాల్ చేసిన కేరళీయులకు ఆదర్శంగా నిలిచింది. అతని వారసత్వం పై చర్చ భిన్నంగా ఉన్నప్పటికీ చారిత్రక గుర్తింపుతో పోరాడుతున్న రాష్ట్రంలో అతని కథ శాశ్వతంగా నిలిచి ఉండేలా చేసింది.