మయన్మార్ మిలిటరీ చీఫ్‌తో మాట్లాడిన ప్రధాని మోదీ..
అండగా ఉంటామని ప్రధాని మోదీ హామీ;
మయన్మార్(Myanmar)లో భూకంపం(Earthquake) కారణంగా మరణించిన వారి సంఖ్య వెయ్యికి పెరిగింది. శిథిలాల కింద మరిన్ని మృతదేహాలు ఉండవచ్చని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇప్పటి దాకా వెయ్యి మంది మరణించారని, 68 మంది కనిపించకుండా పోయారని, మరో 1,500 మంది గాయపడ్డారని ప్రభుత్వ టెలివిజన్ MRTV పేర్కొంది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.2గా నమోదైందని అక్కడి నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది.
శుక్రవారం మధ్యాహ్నం సంభవించిన భూకంప తీవ్రతకు మయన్మార్‌లోని చాలా ప్రాంతాల్లో భవనాలు కూలిపోయాయి. రోడ్లు పగుల్లిచ్చాయి. వంతెనలు కూలిపోయాయి. ఆనకట్టలు తెగిపోయాయి.
థాయిలాండ్‌లో ఆరుగురు మృతి..
పొరుగున ఉన్న థాయిలాండ్‌లోని గ్రేటర్ బ్యాంకాక్ ప్రాంతాన్ని భూకంపం కుదిపేసింది. ఇక్కడ దాదాపు 17 మిలియన్ల మంది నివసిస్తున్నారు. వీరిలో చాలామంది ఎత్తైన భవనాలలో నివసిస్తున్నారు. ఇప్పటివరకు ఆరుగురు మృతి చెందారని, 26 మంది గాయపడ్డారని, 47 మంది ఇంకా కనిపించలేదని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
అండగా భారత్..
ఇదిలా ఉండగా.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మయన్మార్ సైనిక జుంటా చీఫ్ మిన్ ఆంగ్ హ్లైంగ్‌తో మాట్లాడారు. మృతులకు సంతాపం తెలిపారు. మయన్మార్‌కు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. మయన్మార్ ప్రభుత్వానికి సాయపడేందుకు 80 మంది ఎన్‌డీఆర్ఎఫ్ బృందాన్ని భారతదేశం పంపింది. సహాయక సామగ్రిని కూడా వెంటతీసుకెళ్లారు.