'నిప్పులు' కురిపించిన కలం ఆయనది...
స్వాతంత్య్రం వచ్చాక నిజం రాసినందుకు జైలుకు వెళ్లిన తొలి ఎడిటర్ టీజేఎస్ మృతి
By : The Federal
Update: 2025-10-04 05:29 GMT
ప్రముఖ జర్నలిస్ట్, రచయిత, కాలమిస్ట్ టీజేఎస్ జార్జ్(తాయిల్ జాకబ్ సోనీ జార్జ్) బెంగళూర్ లో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 97 సంవత్సరాలు. ఆయనకు కుమారుడు జీత్ తాయిల్, కుమార్తె షెబా తాయిల్ ఉన్నారు. ఆయన భార్య అమ్ము జార్జ్ ఈ సంవత్సరమే జనవరిలో మరణించారు. ఆయన ఎక్స్ ప్రెస్ పబ్లికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా కూడా పనిచేశారు.
టీజేఎస్ కొంతకాలంగా వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్నారు. గత రెండు నెలలుగా ఆయన పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. గతవారం అనారోగ్య కారణాలతో బెంగళూర్ లోని మణిపాల్ ఆస్పత్రిలో చేశారు. శస్త్రచికిత్స అనంతరం ఆయన కోలుకున్నారు. అయితే గురువారం వరుసగా రెండు గుండెపోటులు రాగా, శుక్రవారం సాయంత్రం కన్నుమూశారు.
టీజేఎస్ మే 7, 1928 లో మేజిస్ట్రేట్ అయిన తాయిల్ థామస్ జాకబ్, చాచియమ్మ జాకబ్ దంపతులకు నాల్గవ సంతానంగా కేరళలో జన్మించారు. మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ నుంచి ఆంగ్ల సాహిత్యంలో పట్టభద్రుడయ్యాడు. అనంతరం పాత్రికేయ వృత్తిని స్వీకరించారు. ఆయన కేరళకు చెందిన వారు అయినప్పటికీ ఎక్కువ జీవితం కర్ణాటకలోనే గడిపారు.
1950 లో టీజేఎస్ తన కెరీర్ ను ఇండియాస్ మ్యాగ్జిమమ్ సిటీ( బాంబే) లోని ది ఫ్రీ ప్రెస్ జర్నల్ లో పనిచేశారు. హాంకాంగ్ నుంచి ప్రచురితమయ్యే ఆసియా వీక్ వ్యవస్థాపకుడిగాను వ్యవహరించారు. ఆయన ఇంతకుముందు ది సెర్చ్ లైట్ ఇంటర్నేషనల్ ప్రెస్ ఇన్ స్టిట్యూట్ ఫార్ ఈస్టర్న్ ఎకనామిక్ రివ్యూలతో కలిపి పనిచేశారు.
సెర్చ్ లైట్ లో పనిచేసినందకు భారత్ లో ఆయనపై దేశ ద్రోహం కేసు నమోదు అయింది. అప్పటి బీహార్ సీఎం కేజీ సహాయ్ పై వ్యాసాలు రాసినందుకు అరెస్ట్ చేయించారు. దీనితో రక్షణ మంత్రి వీకే కృష్ణమీనన్ ఆయనకు మద్దతుగా పాట్నాకు వెళ్లారు.
నాలుగు దశాబ్దాల ప్రయాణం..
ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో నాలుగు దశాబ్ధాలకు పైగా పనిచేశారు. టీజేఎస్ గత 25 సంవత్సరాలలో 1300 లకు పైగా కాలమ్స్ రాశారు. ఆయన ‘పాయింట్ వ్యూ’ కాలమ్ పేరుతో కథనాలు రాసేవారు. జూన్ 12, 2025న ఆయన చివరగా పాత్రికేయ వృత్తి నుంచి విశ్రాంతి తీసుకున్నారు.
తన కెరీర్ నుంచి విశ్రాంతి తీసుకున్న తరువాత కూడా టీజేఎస్ ఎక్కడా తగ్గలేదు. ‘‘కొంతమంది భారత్ ను విమర్శించకూడదంటారు. కొందరు విమర్శిస్తారు. మనలాంటి పెద్ద దేశానికి ఎదురయ్యే ఆపదల గురించి అందరిని హెచ్చరించాలి. అన్ని వాదనలకు వారి స్వంత మద్దతుదారులు, వారి స్వంత విమర్శకులు, చెల్లుబాటు, లోపాలు ఉంటాయి.
కానీ ఒక దేశం దాని పాలకులు, తమను అస్సలు విమర్శించకూడదని భావించడం ప్రారంభిస్తే అందులో ఏదో తప్పు ఉంది. ముఖ్యంగా వార్తా పత్రికల వాళ్లు’’ అని తన అభిప్రాయాన్ని నిష్కల్మషంగా చెప్పేవారు. సాహిత్యం, విద్యలో ఆయన చేసిన కృషికి గానూ 2011 లో పద్మభూషణ్ పొందారు. 2007 లో కర్ణాటక రాజ్యోత్సవ అవార్డును అందుకున్నారు.
టీజీఎస్ రాసిన కొన్ని ప్రసిద్ధ పుస్తకాలు.. లీ కువాన్ యూ సింగపూర్(1973), రివోల్ట్ ఇన్ మిండనావో: ది రైజ్ ఆఫ్ ఇస్లాం ఇన్ ఫిలిప్పైన్స్ పాలిటిక్స్(1980), పోథన్ జోసెఫ్స్ ఇండియా(1992), ది లైఫ్ అండ్ టైమ్స్ ఆఫ్ నర్గీస్(1994), ది ఫస్ట్ రెప్యూజ్ ఆఫ్ స్కాండ్రల్స్(2003), ఎంఎస్, ఏ లైఫ్ ఇన్ మ్యూజిక్(2004), లెసన్స్ ఇన్ జర్నలిజం: ది స్టోరీ ఆఫ్ పోథన్ జోసెఫ్(2007), ఎంఎస్ సుబ్బులక్ష్మీ: ది డెఫినిటివ్ బయోగ్రఫీ(2016) వంటి ప్రసిద్ధ రచనలు ఎన్నో ఉన్నాయి.
టీజెఎస్ అంత్యక్రియలు బెంగళూర్ లో ఆదివారం మధ్యాహ్నం హెబ్బాల్ శ్మశాన వాటికలో జరుగుతాయి.
ప్రముఖుల సంతాపం..
కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తన ఎక్స్ హ్యాండిల్ లో ‘‘పాయింట్ ఆఫ్ వ్యూ’ కాలమ్ స్క్రీన్ షాట్ ను తీసి పెట్టారు. ‘‘ప్రముఖ జర్నలిస్ట్, టీజెఎస్ జార్జ్ మరణ వార్త విని బాధపడ్డాను. భారతీయ జర్నలిజంలో ఆయన నిజమైన దిగ్గజం’’ అని కొనియాడారు. ఆయన రాసిన కాలమ్స్ భారతీయ ట్రెజరీలో చాలాకాలం ఉంటాయన్నారు.
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా ఆయనకు నివాళులర్పించారు. ‘‘తన పదునైన కలంతో రాజీలేని స్వరంతో ఆరు దశాబ్ధాలకు పైగా భారతీయ జర్నలిజాన్ని సుసంపన్నమైన మేధావి టీజేఎస్, ఆయన అభిమానులకు నా హృదయపూర్వక సంతాపం’’ అని ఎక్స్ లో ట్వీట్ చేశారు.