‘మేకెదాటు’పై తమిళనాడుకు ఆ భయం అక్కర్లేదు..

కర్ణాటక సీఎం సిద్ధరామయ్య

Update: 2025-11-11 09:56 GMT
Click the Play button to listen to article

కర్ణాటక(Karnataka)-తమిళనాడు సరిహద్దులోని మేకెదాటు(Mekedatu) వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం వల్ల తమిళనాడు రైతులకు ఏ నష్టం జరగదని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(CM Siddaramaiah) చెప్పారు. మైసూరులో జరిగిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కావేరి నీటిలో తమ వాటాను కూడా తీసేసుకుంటారని భ్రమతో తమిళనాడు ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తోందని చెప్పారు. అలాంటిదేమీ ఉండదని హామీ ఇచ్చారు.


‘రెట్టింపు నీళ్లిచ్చాం..’

ఈ సంవత్సరం కర్ణాటకలో కురిసిన భారీ వర్షాల కారణంగా తమిళనాడు(Tamil Nadu)కు అదనపు నీరు వచ్చిందని సిద్ధరామయ్య గుర్తుచేస్తూ.."తమిళనాడుకు 177.25 టీఎంసీల నీటిని మాత్రమే ఇవ్వాలి. కానీ మేం 150 టీఎంసీలను అదనంగా ఇచ్చాం. అంటే మేము రెట్టింపు కోటా విడుదల చేస్తాం" అని పేర్కొన్నారు. 2018 సుప్రీంకోర్టు తీర్పును ప్రస్తావిస్తూ.. అంతర్ రాష్ట్ర నీటి పంపిణీ అప్పీళ్లలో తమిళనాడుకు 177.25 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటకను కోర్టు ఆదేశించింది.


‘రైతులను ఆదుకుంటాం’

రాష్ట్రంలోని అన్ని జలాశయాలు నిండిపోయాయని, ఈ సంవత్సరం తగినంత వర్షపాతం నమోదైందని సిద్ధరామయ్య సంతృప్తి వ్యక్తం చేశారు. అయితే అధిక వర్షపాతం ఉత్తర కర్ణాటకలో పంటలను దెబ్బతీసిందని చెప్పారు. ఉత్తర కర్ణాటకలోని కొన్ని జిల్లాల్లో 90 శాతం వరకు పంట నష్టం సంభవించిందని, రాష్ట్రవ్యాప్తంగా 11 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని పేర్కొన్నారు. శాశ్వత పంటలు పండించే రైతులకు హెక్టారుకు రూ. 31,000 పరిహారం, నీటిపారుదల ప్రాంతంలోని రైతులకు రూ. 25,500 పరిహారం చెల్లిస్తున్నామన్నారు.


మంత్రివర్గ విస్తరణపై..

తన ప్రభుత్వం, మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన వివిధ ప్రశ్నలకు కూడా సిద్ధరామయ్య సమాధానమిచ్చారు. మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడుతూ.. నవంబర్ 15న పుస్తకావిష్కరణ కోసం తాను ఢిల్లీకి వెళ్తున్నానని, రాహుల్‌ను కలిసేందుకు సమయం కోరానని చెప్పారు.

రాహుల్ గాంధీ సమయం ఇస్తే.. ఆయనతో మంత్రివర్గ విస్తరణపై చర్చిస్తానని, లేకుంటే అదే రోజు రాత్రి బెంగళూరుకు తిరుగు పయనమవుతానని సమాధానమిచ్చారు.

ఢిల్లీ కారు పేలుడుపై అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. ఈ ఘటన బీహార్ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని, ఇది బీజేపీకి వ్యతిరేకంగా మారవచ్చన్నారు. పేలుడులో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు.

భద్రతా లేదా నిఘా వైఫల్యం గురించి తనకు తెలియదని చెబుతూ..పేలుడుపై దర్యాప్తు నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. తరచుగా ఏనుగుల దాడిని ఎదుర్కొంటున్న ప్రాంతాలలో రైల్వే బారికేడ్లు ఏర్పాటు చేస్తామని ఆయన అన్నారు.

Tags:    

Similar News