‘పాఠ్యాంశంగా ‘జయ జయహే తెలంగాణ’’
అందెశ్రీకి పద్మశ్రీ కోసం కేంద్ర మంత్రులు చొరవ తీసుకోవాలని కోరిన సీఎం రేవంత్ రెడ్డి.
అందెశ్రీ రాసిన తెలంగాణ గీతం ‘జయజయహే తెలంగాణ’ గేయాన్ని పాఠ్యాంశంగా అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. అందెశ్రీ రచించిన ‘నిప్పుల వాగు’ పుస్తకాన్ని 20వేల కాపీలు తీసి అన్ని లైబ్రరీల్లో ఉంచుతామని చెప్పారు. ఘట్‌కేసర్‌లో జరిగిన అందెశ్రీ అంత్యక్రియల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన పాడను మోశారు రేవంత్. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాహిత్యానికి అందెశ్రీ చేసిన సేవలను అజరామరం అని కొనియాడారు. ఆయన కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అందెశ్రీకి పద్మశ్రీ పురస్కారం ఇవ్వాలని కోరారు. ఈ అంశంపై కేంద్రం ప్రభుత్వంతో చర్చించి అందెశ్రీకి ఈ పురస్కారం వచ్చేలా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు చొరవ చూపాలని కోరారు.
ప్రముఖ తెలంగాణ వాగ్గేయకారుడు అందెశ్రీ (64) తీవ్ర అస్వస్ధతతో సోమవారం ఉదయం కన్నుమూశారు. ఉదయం ఇంట్లోనే రచయిత గుండెపోటుతో కుప్పకూలిపోయారు. అందెశ్రీ కి తెల్లవారిజుమునుండే బాగా నలతగా ఉన్నట్లు కుటుంబసభ్యులు చెప్పారు. ఉదయం 3.30 గంటల ప్రాంతంలో పల్స్ కొట్టుకోవటం బాగా పడిపోవటంతో స్పృహతప్పిపడిపోయారు. దాంతో వెంటనే కుటుంబసభ్యులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆయన మరణంపై సీఎం రేవంత్ రెడ్డి సోమవారం తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను రాసిన అందెశ్రీ మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర సాధనలో జయ జయహే తెలంగాణ గేయం కోట్లాది ప్రజల గొంతుకై నిలిచిందని గుర్తు చేశారు.