తమిళనాడులో నేటి నుంచి S.I.R ప్రారంభం..

డిసెంబర్ 4 వరకు కొనసాగింపు - ఫిబ్రవరి 7న తుది ఓటరు జాబితా..

Update: 2025-11-04 12:38 GMT
Click the Play button to listen to article

తమిళనాడు(Tamil Nadu)లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (S.I.R) మంగళవారం (నవంబర్ 4) ప్రారంభమైంది. డిసెంబర్ 4వ తేదీ వరకు కొనసాగుతుంది. అయితే ఈ ప్రక్రియను వ్యతిరేకిస్తూ అధికార ద్రవిడ మున్నేట్ర కజగం (DMK) సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. అక్టోబర్ 27న ఎన్నికల సంఘం (ఈసీ) జారీ చేసిన S.I.R నోటిఫికేషన్‌ రద్దు చేయాలని కోరింది. అయితే దాన్ని కోర్టు తిరస్కరించింది. కాగా ప్రధాన ప్రతిపక్షం, బీజేపీ(BJP) మిత్రపక్షమైన ఎఐఎడిఎంకె(AIADMK) S.I.R ప్రక్రియకు మద్దతు తెలిపాయి.


ఇంటింటికి BLOలు..

బూత్ లెవల్ అధికారులు (BLOలు) ఇంటింటికి వెళ్లి సర్వే చేస్తారని, డిసెంబర్ 4 వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుందని తమిళనాడు ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం తెలిపింది.

"ఏదైనా ఇంటికి తాళం వేసి ఉంటే సంబంధిత BLO ఆ ఇంటిని మూడుసార్లు వెళ్తారు. పూరించిన దరఖాస్తుఫారాలను BLOలు స్వీకరించి రసీదు ఇస్తారు. దాన్ని ఓటరు భద్రపరుచుకోవాలి. ఓటర్లు ఎన్యుమరేషన్ ఫాంను ఆన్‌లైన్‌లోనూ సబ్మిట్ చేయవచ్చు.’’ అని CEO కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది.

‘‘నెల పాటు S.I.R ప్రక్రియ చేపడతారు. డిసెంబర్ 9న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదలవుతుంది. ఒకవేళ పూరించిన దరఖాస్తు ఫారాలను ఓటరు నిర్ణీత గడువులోగా సమర్పించలేకపోతే.. డిసెంబర్ 9 నుంచి 2026 జనవరి 8 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాల కాలవ్యవధిలో సమర్పించవచ్చు. వాటిని కూడా పరిశీలించాక ఫిబ్రవరి 7న తుది ఓటరు జాబితా ప్రచురితమవుతుంది. బీఎల్‌వోలు ఏ ఏరియాలో, ఏ తేదీన వెళ్తారన్న విషయాలను ఇప్పటికే ఓటర్లకు సమాచారం ఇచ్చారు.’’ అని ఓ ప్రకటన విడుదల చేసింది తమిళనాడు ఈసీ.


ఇప్పటికే S.I.Rపై పార్టీలకు అవగాహన..

అక్టోబర్ 29న అన్ని గుర్తింపు పొందిన జాతీయ/రాష్ట్ర రాజకీయ పార్టీల ప్రతినిధులతో CEO సమావేశం నిర్వహించారు. SIR ప్రక్రియను వారికి వివరంగా వివరించారు. ఇప్పటివరకు జిల్లా ఎన్నికల అధికారి స్థాయిలో SIR పై 39 సమావేశాలు జరిగాయి. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు 932 మంది హాజరయ్యారు. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ స్థాయిలో 241 సమావేశాలు జరగ్గా.. వీటికి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు 3,346 మంది హాజరయ్యారు.

Tags:    

Similar News