బనకచర్లపై లోకేశ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు: ఉత్తమ్ కుమార్ రెడ్డి
బిఆర్ఎస్ నేతలూ ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపిస్తున్నారు;
బనకచర్ల విషయంలో ఏపీ మంత్రి నారా లోకేశ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలను తాము ఖండిస్తున్నామని తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. గోదావరి జలాలను రాయలసీమకు తీసుకువెళ్తానని గతంలో కేసీఆర్ చేసిన ప్రకటనను మంత్రి గుర్తు చేశారు. బనకచర్లకు అప్పుడే బీజం పడిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. రామగుండం నియోజకవర్గం అంతర్గాంలో రామగుండం ఎత్తిపోతలను ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడటం వల్లనే కేంద్రం బనకచర్లను వ్యతిరేకించిందని తెలిపారు.
‘‘ఏపీ విభజన చట్టానికి బనకచర్ల పూర్తిగా వ్యతిరేకం. బిఆర్ఎస్ నేతలు ప్రజల్లో తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు’’అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరాన్ని మంథని నియోజకవర్గ పరిధిలో కట్టినప్పటికీ అక్కడ ఒక్క ఎకరానికి కూడా సాగునీరు పారలేదన్నారు. ‘‘రూ లక్ష కోట్లను గత ప్రభుత్వం వృథా చేసింది. రూ.38 వేల కోట్లతో ప్రాణహిత-చేవెళ్ల కట్టి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు’’ అని మంత్రి అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిరుపయోగమైనప్పటికీ రికార్డు స్థాయిలో వరి పంట పండిందన్నారు. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్త వాటిని గోదావరిపై నిర్మిస్తామని మంత్రి హామి ఇచ్చారు. గోదావరి పరివాహక ప్రాంతాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువస్తామని మంత్రి చెప్పారు. ఇచ్చంపల్లి వద్ద కూడా ప్రాజెక్టు మొదలుపెట్టే ఆలోచన ఉందని ఉత్తమ్‌కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు.
బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణకు చెందిన వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటికే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రాజెక్టు అమలైతే తెలంగాణకు చెందిన గోదావరి నీటి వాటా తగ్గిపోతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ప్రాంతాలకు సాగునీరు, తాగునీరు కొరత ఏర్పడుతుందని పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వృథాగా పోతున్న నీరు తెలంగాణకు కూడా అవసరం ఉందని వాదిస్తున్నాయి. తెలంగాణకు సంబంధించిన స్టేక్‌హోల్డర్స్‌ను సంప్రదించకుండా ఏపీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆరోపిస్తున్నాయి.