క్యూ కట్టిన ‘సృష్టి’ బాధితులు
గోపాలపురం పోలీస్ స్టేషన్ లో మరో నాలుగు కేసులు;
సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మోసపోయిన బాధితులు ఒక్కొక్కరు గోపాలపురం పోలీస్టేషన్ ముందు క్యూ కడుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్న గోపాలపురం పోలీసులకు తాజాగా మరో నలుగురు బాధితులు ఫిర్యాదు చేశారు.
డాక్టర్ పచ్చిపాల నమ్రత ఐవీఎఫ్ చికిత్సకు వచ్చిన వారిని సరోగసి పేరిట మోసం చేసి డబ్బులు తీసుకున్నారని ఇప్పటికే అనేక ఫిర్యాదులు అందాయి. గోపాలపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. గతంలో డాక్టర్ నమ్రత చేసిన మోసాలు ఇప్పుడిప్పుడే వెలుగు చూస్తున్నాయి.
సరో గసి ద్వారా పుట్టిన బిడ్డలు తమ బిడ్డలు కాదన్న అనుమానంతో దంపతులు డిఎన్ఎ పరీక్షలు చేసుకుంటున్నారు. తల్లి దండ్రుల డిఎన్ ఎ పరీక్షలతో ఏ మాత్రం కలవకపోవడంతో బాధితులు డాక్టర్ నమ్రతపై చట్టపర చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తమకు అందించిన మెడికల్ రిపోర్టులు తీసుకొచ్చి బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు.
హైద్రాబాద్ లో ఇద్దరు దంపతులు వేర్వేరుగా ఫిర్యాదు
హైదరాబాద్‌కు చెందిన ఒక బాధితురాలి ఫిర్యాదు మేరకు తాజాగా కేసు నమోదైంది. సరోగసి పేరిట బాధితురాలికి ఈ కేసులో ప్రధాన నిందితురాలైన డాక్టర్ నమ్రత హార్మోన్ ఇంజక్షన్‌లు ఇచ్చినట్లు ఫిర్యాదు చేశారు. తమ వద్ద నుంచి డాక్టర్ రూ.50 లక్షలు వసూలు చేసినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు డాక్టర్ నమ్రత, చెన్నారావు, సురేఖపై కొత్త కేసు నమోదు చేశారు.
మరో కేసు
తాజాగా హైదరాబాద్‌కే చెందిన మరో బాధితురాలు కూడా డాక్టర్ నమ్రత తనకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చినట్టు , కొన్ని రోజుల తర్వాత కల్యాణి గ్యాంగ్ విశాఖకు పిలిచి స్పెర్మ్ తీసుకొని పంపిందని ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో సరోగసి పేరుతో రూ.18 లక్షలు కాజేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించి డాక్టర్ నమ్రత, డా.విద్యులత, కల్యాణి, శేషగిరి, శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదైంది.
మోసపోయిన ప్రవాసభారతీయులు
ఎన్నారైలను కూడా నమ్రత ముఠా మోసం చేసినట్లు వెలుగులోకి వచ్చింది. తాజాగా ఎన్నారై దంపతులు గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ నుంచి నుంచి రూ.25 లక్షలు వసూలు చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నల్గొండ దంపతులనుంచి
నల్గొండకు చెందిన దంపతుల నుంచి డాక్టర్ నమ్రత రూ.44 లక్షలు వసూలు చేసింది. బాధితుల ఫిర్యాదు మేరకు డాక్టర్ నమ్రతతో బాటు సదానందం, చెన్నారావు, అర్చన, సురేఖపై కేసు నమోదైంది
ఈ నాలుగు కేసుల్లో ఫెర్టిలిటీ పేరిట కేవలం సరోగసీకి మాత్రమే డాక్టర్ నమ్రత రిఫర్ చేసింది. ఐవిఎప్ మీకు పనికిరాదని సరోగసీ ఒక్కటే పరిష్కారమని బుకాయించింది. దంపతులకు పిల్లలు కలగాలంటే అండాలు, స్పెర్మ్ ఉత్తత్తి అవసరం. వీటిని ఉత్పత్తి చేయడానికి ప్రత్యేక హార్మోన్లు ఇస్తానని డాక్టర్ నమ్రత మాయమాటలు చెప్పింది.
ఫెర్టిలిటీ హార్మోన్ ఇంజెక్షన్లు అంటే
సంతానోత్పత్తి హార్మోన్ ఇంజెక్షన్లు, ముఖ్యంగా గోనాడోట్రోపిన్లు, అండాశయాలను ప్రేరేపిస్తుంది గుడ్లను ఉత్పత్తి చేయడానికి, అండోత్సర్గము జరగడానికి ఇవి దోహదపడతాయి. ఇవి సర్వ సాధారణంగా IVF (In Vitro Fertilization) వంటి సంతానోత్పత్తి చికిత్సలలో వినియోగిస్తారు. గోనాడోట్రోపిన్లు, FSH ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ (FSH), లూటినైజింగ్ హార్మోన్ (LH) కలిగి ఉంటాయి. క్రమరహిత అండోత్సర్గము ఉన్న మహిళల్లో అండోత్సర్గాన్ని ప్రేరేపిస్తారు. గోనాడోట్రోపిన్లు అండాశయాలను ప్రేరేపించి, గుడ్లు సకాలంలో విడుదలయ్యేలా చేస్తాయి.
IVF ట్రీట్ మెంట్ లో :
బహుళ గుడ్లను ఉత్పత్తి చేయడానికి , వాటిని సేకరించి, ప్రయోగశాలలో ఫలదీకరణం చేయడానికి IVF చికిత్సలో ఈ గుడ్లను ఉపయోగిస్తారు. స్పెర్మ్ ఉత్పత్తిని పెంచడానికి పురుషులలో ఈ హార్మోన్లు దోహదపడతాయి. ఈ హార్మోన్ ఇంజెక్షన్లు ఎవరు పడితే వాళ్లు ఉపయోగించడానికి వీల్లేదు. వైద్య పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవాలి.అండాశయ హైపర్‌స్టిమ్యులేషన్ సిండ్రోమ్ (OHSS) వంటి రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది.
బహుళ గర్భధారణకు కూడా దారితీయవచ్చు. అంటే ఈ హార్మోన్లు తీసుకుంటే ఒకటికి మించి గర్బధారణ అవుతుంది. అంటే ఆ దంపతులు ఒక గర్బధారణకు హార్మోన్ ఇంజక్షన్లు తీసుకుంటే బిడ్డ పుట్టిన తర్వాత కూడా మహిళ మళ్లీ గర్భం దాల్చవచ్చు.