కౌశిక్ రెడ్డిపై నమోదైన కేసులపై హైకోర్టు స్టే
ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేసాడంటూ వ్యాఖ్యలపై కేసులు;
బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై నమోదైన కేసులపై హైకోర్టు స్టే విధించింది.తనపై వివిథ పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులను కొట్టివేయాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని పలు పోలీసుస్టేషన్‌లలో కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేతలు ఇచ్చిన ఫిర్యాదులతో.. ఒకే ఘటనపై వేర్వేరు పోలీసు స్టేషన్‌లలో కౌశిక్ రెడ్డిపై కేసులు నమోదయ్యాయి. ఒకే అంశంపై తెలంగాణలోని వివిధపోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టారని కౌశిక్ రెడ్డి న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా కేసులు నమోదు చేశారని న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. కౌశిక్ రెడ్డిపై నమోదైన కేసులపై స్టే విధించి, అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలని న్యాయవాది మధ్యంతర పిటిషన్ వేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. అన్ని పోలీసు స్టేషన్లలో నమోదైన కేసులపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
బీఆర్ఎస్ నాయకుడు, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై గత నెల 26న కేసు నమోదైంది. తెలంగాణ వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేయడంతో కేసులు నమోదయ్యాయి. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
అసలు కౌశిక్ రెడ్డి ఎమన్నారంటే..
రేవంత్ రెడ్డి చివరకు తన భార్య ఫోన్‌ను కూడా ట్యాప్ చేశారని కౌశిక్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. భార్యాభర్తల ఫోన్లను ట్యాప్ చేయించి వింటున్నారని ఆయన అన్నారు.
ఫోన్ ట్యాపింగ్ సాధారణమేనని ఇటీవల ఢిల్లీలో రేవంత్ రెడ్డి చెప్పాడని అన్నారు. ఫోన్ ట్యాపింగ్‌ను సహజమని చెప్పిన ముఖ్యమంత్రిపై ఈడీ, సీబీఐ కేసు నమోదు చేయాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ నాయకులతో పాటు స్వంత పార్టీ ప్రభుత్వానికి చెందిన మంత్రుల ఫోన్‌లను కూడా ఆయన ట్యాప్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఇదే సమయంలో కౌశిక్ రెడ్డి ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి తమపై ఇలాగే నోటికి వచ్చినట్లు మాట్లాడితే ఆయన ఎవరెవరితో తిరిగారో ఆ పదహారు మంది పేర్లు బయటపెడతానని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. ‘‘జూబ్లీహిల్స్, ఢిల్లీ, దుబాయ్‌లలో ఎక్కడెక్కడ ఉన్నావో అందరికీ తెలుసు’’ అని ఆయన ఘాటుగా విమర్శించారు. చివరకు మిస్ వరల్డ్ పోటీదారుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆయన ఆరోపించారు.బీఎన్ఎస్ 356(2),353(B)352 సెక్షన్ల కింద కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు.