వేములవాడకు పోటెత్తిన భక్తులు

రెండో శ్రావణ సోమవారం కావడంతో..;

Update: 2025-08-04 12:31 GMT

దక్షిణ కాశీగా పేరు పొందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రావణమాసం రెండో సోమవారం కావడంతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వేములవాడకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దర్శనానంతరం కోడె మొక్కులు చెల్లించుకున్నారు. ఉదయం స్వామివారికి వేద పండితులు మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, తదితర ప్రత్యేక పూజలు వేడుకగా నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఇన్‌ఛార్జి ఈవో రాధాబాయి, ఆలయ అధికారులు, ఎస్పీఎఫ్ సిబ్బంది ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.

వేములవాడ ప్రత్యేకత

వేములవాడని పూర్వం లేంబులవాటిక అని పిలిచేవారని కొంతమంది చరిత్రకారుల నమ్మకం.ఇది పశ్చిమ చాళుక్యుల కాలం నుండి ఉన్నదని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. పశ్చిమ చాళుక్యులు నిర్మించిన రాజరాజేశ్వర స్వామి దేవాలయం వేములవాడగా ప్రసిద్ధి చెందింది. చారిత్రక ప్రసిద్ధి కలిగిన ఈ దేవాలయానికి దేశ నలుమూలల నుండి యాత్రికులు వస్తూ ఉంటారు. ఈ ప్రాంతాన్ని పాలించిన మొదటి నరసింహుడుకు రాజాదిత్య అనే బిరుదు ఉండేది. కనుక ఈ దేవాలయానికి ఈ పేరు వచ్చిందని చెబుతారు. 

Tags:    

Similar News