స్కూటీ డిక్కీ పగుల గొట్టి నగదు చోరి
బైంసాలో దొంగ పట్టుకెళ్తున్న దృశ్యాలుసీసీ కెమెరాల్లో;
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో సోమవారం జరిగిన చోరీ దృశ్యాలు అక్కడే ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ముథోల్ మండలం ఎండ్ బిడ్ గ్రామానికి చెందిన బొంబోతుల ఆనంద్ అనే వ్యక్తి తన స్కూటీని పార్కింగ్ చేసి భోజనం చేయడానికి హోటల్ లోకి వెళ్లాడు. తన బ్యాంకు ఖాతా నుంచి రూ.5 లక్షల నగదు విత్ డ్రా చేసి స్కూటీ డిక్కీలో పెట్టి హోటల్లోకి వెళ్లాడు. తాను బ్యాంకు నుంచి నగదు డ్రా చేసిన విషయాన్ని దొంగ ముందే పసిగట్టాడు. హోటల్ లో భోజనం చేయడానికి ఆనంద్ వెళ్లడగానే దొంగ ఇదే అదనుగా భావించాడు. స్కూటీ డిక్కీలో పెట్టిన నగదును తస్కరించి పరారయ్యాడు.కొంత సేపటి తర్వాత వచ్చి చూడగా స్కూటీ డిక్కీ తెరిచి ఉండటంతో ఆనంద్ లబోదిబోమన్నాడు. అందులోని నగదు మాయమైందని ఆనంద్ పోలీసులకు ఫిర్యాదుచేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సీసీ కెమెరాలను పరిశీలించారు. ఓ వ్యక్తి స్కూటీ డిక్కీ పగులగొట్టి నగదు అపహరిస్తున్న దృశ్యాలు ఆ కెమెరాలో రికార్డయ్యాయి.